'క్రీడా స్ఫూర్తి' అంశంలో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అండగా నిలిచాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచులో చోటు చేసుకున్న వివాదంలో యాష్‌కు మద్దతు ఇస్తున్నానని పేర్కొన్నాడు. అతడు చేసిందాట్లో తప్పేమీ లేదని స్పష్టం చేశాడు. కొంతమంది సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకొనేందుకే అతడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని వెల్లడించాడు.
'నేను రవిచంద్రన్ అశ్విన్‌కు వందశాతం అండగా ఉంటాను. అతడు నిబంధనలకు లోబడే ప్రవర్తించాడు. అతడేమీ తప్పు చేయలేదు' అని గౌతమ్ గంభీర్ అన్నాడు. 'ఈ విషయంపై చాలా మంది మాట్లాడుతున్నారు. నిజానికి వారికిది అనవసరం. సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకొనేందుకు, టీవీ షోల్లో ఉనికి కోసమే కొందరు దీనిపై మాట్లాడుతున్నారు. వారు చేస్తున్నదాంట్లో అర్థం లేదు. అశ్విన్ ప్రవర్తనలో తప్పేం లేదు' అని గౌతీ స్పష్టం చేశాడు.
Also Read: ఎవరు మంచోడు? ఎవరు చెడ్డోడు? క్రీడాస్ఫూర్తిపై విమర్శించిన వారికి అశ్విన్ ఘాటు సందేశం!
దిల్లీ క్యాపిటల్స్ యజమాని పార్థ్ జిందాల్ సైతం యాష్‌కు అండగా నిలిచాడు. ఈ అంశంలో వంచన కనిపిస్తోందని పేర్కొన్నాడు. 'అంటే.. బెన్‌స్టోక్స్ బ్యాటుకు బంతి తగిలి నాలుగు అదనపు పరుగులు వచ్చి ప్రపంచకప్ గెలిస్తే అస్సలు తప్పేం లేదు? కానీ యాష్ ఒక అదనపు పరుగు కోసం ప్రయత్నిస్తే ప్రపంచమంతా తప్పని అరుస్తోంది? ఇది వంచనకు మరోరూపం! నేను నీవెనకే ఉన్నా అశ్విన్' అని జిందాల్ ట్వీట్ చేశాడు.
Also Read: విరాట్ సరసన స్మృతి మంధాన.. పింక్ టెస్టులో సెంచరీ. ఔటివ్వకున్నా పెవిలియన్ వెళ్లిన పూనమ్!
దక్షిణాఫ్రికా మాజీ స్పీడ్‌స్టర్ డేల్ స్టెయిన్ మరోలా స్పందించాడు. నిబంధనలను యాష్ తనకు అనుకూలంగా మలుచుకుంటాడని చెప్పాడు. 'నిజానికి నిబంధనలు అందుకు అనుమతిస్తాయి. అందుకే అశ్విన్ తన ప్రయోజనాల కోసం ప్రతి నిబంధనను ఉపయోగించుకుంటాడు. అతనాడే విధానమే అలా ఉంటుంది. మరొకరు తమకిష్టం వచ్చినట్టు ఆడతారు. అందుకే యాష్‌కు వ్యతిరేకంగా ఉండలేం' అని స్టెయిన్ పేర్కొన్నాడు.
Also Read: రైజర్స్ మళ్లీ పాత పాటే.. హైదరాబాద్‌పై ఆరు వికెట్లతో చెన్నై విజయం!
షార్జా వేదికగా మంగళవారం దిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైడర్స్ తలపడ్డాయి. 19వ ఓవర్లో వికెట్లకు విసిరిన బంతి పంత్ భుజానికి తగిలినా రిషభ్ పంత్, అశ్విన్ అదనపు పరుగు కోసం ప్రయత్నించారు. ఆ తర్వాత ఓవర్లో యాష్‌ను టిమ్‌సౌథీ ఔట్ చేశాడు. అయితే అతడు పెవిలియన్ చేరే క్రమంలో ఇయాన్ మోర్గాన్ ఏదో అన్నాడు. దాంతో యాష్ వాగ్వాదానికి దిగాడు. వారిని ఆపేందుకు దినేశ్ కార్తీక్, అంపైర్లు ప్రయత్నించారు.
నిబంధనల ప్రకారం యాష్ చేసిందాట్లో తప్పేమీ లేదు. అయితే బ్యాటర్ల దేహానికి బంతి తగిలిన తర్వాత పరుగెత్తకూడదని ఓ సంప్రదాయం ఉంది. దానిని యాష్ పాటించలేదని షేన్‌వార్న్ సహా మరికొందరు విమర్శించారు.