'వింటే భారతం వినాలి.. తింటే గారెలే తినాలి.. ఆడితే కేఎల్ రాహుల్‌లా ఆడాలి'.. కాస్త అతిగా అనిపిస్తున్నా కేఎల్ ఆటను చూసిన ఎవ్వరైనా ఇదే చెప్తారు. ఏమా ఆట! ఏమా క్లాస్.. ఏమా షాట్లు.. ఏమా దూకుడు.. ఎంత చెప్పినా తక్కువే!
కఠినమైన పిచ్.. తెలివైన కెప్టెన్.. చక్కని బౌలర్లు.. అలాంటి చెన్నైపై పంజాబ్ కింగ్స్ అద్భుతంగా ఆడింది. కేఎల్ రాహుల్ (98: 42 బంతుల్లో 7x4, 8x6) చిరస్మరణీయ అజేయ ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థి నిర్దేశించిన 135 పరుగుల లక్ష్యం చిన్నబోయింది. కేవలం 13 ఓవర్లకే 6 వికెట్ల తేడాతో విజయం సాధించేసింది. రన్‌రేట్‌ను మెరుగు పర్చుకొని పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. ముంబయిని వెనక్కి నెట్టింది.
Also Read: రాజస్థాన్‌పై గెలిస్తే బిందాస్! లేదంటే కోల్‌కతాకు తప్పదు విలవిల!
రాహుల్.. ది బీస్ట్
అదృష్టం తలుపు తడితేనే పంజాబ్ ప్లేఆఫ్స్‌కు వెళ్లగలదు! అందుకు వారి చేతిలో ఉన్న అని పనులు చేసేంది రాహుల్‌సేన. 14 ఓవర్లలోపు 135 లక్ష్యాన్ని ఛేదిస్తే ముంబయిని పంజాబ్ దాటేస్తుంది. అందుకు తగ్గట్టే ఆ జట్టు ఆడింది. జట్టు స్కోరు 46 వద్దే మయాంక్ అగర్వాల్ (12), సర్ఫరాజ్ ఖాన్ (0) ఔటౌనా.. కేఎల్ రాహుల్ తన దూకుడు కొనసాగించాడు. చక్కని క్రికెటింగ్ షాట్లు ఆడాడు. దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, డ్వేన్ బ్రావో, హేజిల్‌వుడ్.. ఎవ్వరొచ్చినా సిక్సర్లే లక్ష్యంగా దంచికొట్టాడు. ఏ ఒక్క షాట్‌నూ అతడు నిర్లక్ష్యంగా ఆడలేదు. లెక్కపెట్టినట్టుగా కళ్లు చెదిరే.. అందమైన సిక్సర్లు, బౌండరీలు బాదేశాడు. 25 బంతుల్లో అర్ధశతకం బాదేశాడు. అతడి ధాటికి పంజాబ్ 10.2 ఓవర్లకే 102 చేసేసింది. ఆ తర్వాత వేగంగా విజయం సాధించేసింది. షారుక్ (8)తో కలిసి 34 (24 బంతుల్లో), మార్క్రమ్ (13)తో కలిసి 46 (19 బంతుల్లో) విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు.
Also Read: పేసర్ ఉమ్రాన్ మాలిక్ తండ్రి భావోద్వేగం.. టీమ్‌ఇండియాకు ఆడాలని ఆకాంక్ష!
డుప్లెసిస్ ఒక్కడే
టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన చెన్నైకి వరుస షాకులు తగిలాయి. పవర్‌ప్లేలో కేవలం 30 పరుగులే రాగా రుతురాజ్ గైక్వాడ్ (12), మొయిన్ అలీ (0) ఔటయ్యారు. అర్షదీప్ వారిని వెంటవెంటనే ఔట్ చేశాడు. మరికాసేపటికే అంబటి రాయుడు (4), రాబిన్ ఉతప్ప (2)ను క్రిస్‌జోర్డాన్ పెవిలియన్ పంపించాడు. ధోనీ (12)ని రవి బిష్ణోయ్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. అప్పటికి చెన్నై స్కోరు 61/5. ఇలాంటి స్థితిలో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా (15*) సహకారంతో ఓపెనర్ డుప్లెసిస్ (76: 55 బంతుల్లో 8x4, 2x6) ఆచితూచి ఆడాడు. దొరికిన బంతుల్ని బౌండరీకి తరలించాడు. 46 బంతుల్లోనే అర్ధశతకం బాదేశాడు. మరోవైపు జడ్డూ వికెట్లు పడకుండా అడ్డుకున్నాడు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్‌కు 45 బంతుల్లో 67 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఆఖరి ఓవర్లో మూడో బంతికి డుప్లెసిస్ ఔటవ్వడంతో ఈ జోడీ విడిపోయింది. చెన్నై 134/6కు పరిమితం అయింది. అర్షదీప్, జోర్డాన్ చెరో రెండు వికెట్లు తీశారు.