తమలపాకు తింటే మంచిదే... కానీ దాన్ని కిళ్లీ రూపంలో తీసుకుంటే మాత్రం ముప్పు పొంచి ఉన్నట్టేనని చెబుతున్నారు వైద్యులు. డయాబెటిస్ ఉన్న వారు కిళ్లీకి పూర్తిగా దూరంగా ఉండాలి. ఇంకా ఆ వ్యాధి బారిన పడని వాళ్లు కిళ్లీ లాంటి అలవాట్లు చేసుకోకుండా ఉండడం ఉత్తమం అని చెబుతున్నారు అధ్యయనకర్తలు. తైవాన్ లో జరిగిన ఓ అధ్యయనంలో కిళ్లీతో కూడా మధుమేహ ముప్పు పెరుగుతున్నట్టు గుర్తించారు. ఆల్కహాల్, ధూమపానం లాంటి మానదగిన అలవాట్ల  కోవలోకే కిళ్లీ కూడా చెందుతుందని అంటున్నారు పరిశోధకులు. ఒట్టి తమలపాకు నమలడం వల్ల ఎలాంటి హాని కలుగదని చెబుతున్నారు. కానీ కిళ్లీలో వాడే వక్కల కారణంగా నడుము చుట్టు కొలత పెరుగుతున్నట్టు మరో అధ్యయనంలో తేలింది. బ్రిటన్ లో చేసిన అధ్యయనంలో పాన్ తినే యువకుల్లో మధుమేహం వచ్చే అవకాశాలు కనిపించాయి. ఇది చాలా ఆందోళన కలిగించే అంశంగా పరిగణించారు అధ్యయనకర్తలు. 


పాన్ లో వాడే వక్కల వల్ల దీర్ఘకాల కిడ్నీజబ్బులు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు అంచనా. అలాగే వక్కలు తినేవారిలో విటమిన్ డి కూడా అతి తక్కువగా ఉంటుంది. అంతేకాదు ఈ వక్క అతిగా నమలడం వల్ల పొట్ట క్యాన్సర్, నోటి క్యాన్సర్, పాంక్రియాస్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే వక్కపొడిని క్యాన్సర్ కారకంగా ప్రకటించింది. అయినా సరే రోజూ వక్కపొడి నోటినిండా వేసుకుని నమిలే వాళ్లు ఎంతో మంది.  అలా నమిలి నమిలి దంతాలు కూడా క్షీణించిపోతాయి. ఏవైనా రోగాలకు మందులు వాడుతున్నప్పుడు ఇలా వక్క పొడిని వేసుకుంటే శరీరంలో అనేక రకాల విషపూరిత రియక్షన్లకు దారితీయచ్చు. అందుకే ఇతర సమస్యలకు మందులు వాడుతున్నప్పుడు కిళ్లీ జోలికి వెళ్లకండి. 
 అయితే తమలపాకు నమలడం వల్ల మాత్రం మంచి ఆరోగ్య ప్రయోజనాలే ఉన్నాయి. వీలైతే ఆకు మాత్రమే నమిలేందుకు ప్రయత్నించండి.  ఇలా చేయడం వల్ల ఆకు నుంచి విటిమిన్ సి, థియామిన్, నియాసిన్, రైబోఫ్లోవిన్, కెరోటిన్, కాల్షియం వంటి ఎన్నో విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. 


Also read: సెప్సిస్ గురించి విన్నారా? పైకి కనిపించకుండా ప్రాణాలు తీసేస్తుంది...


Also read: బాయ్ ఫ్రెండ్ కు అందంగా కనిపించాలనుకుంది... చివరకు ఆసుపత్రి పాలైంది


Also read: ఇలాంటి వారికి కరోనా సోకితే మరణించే అవకాశాలు ఎక్కువ... తేల్చిన కొత్త అధ్యయనం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి