ఐపీఎల్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు సాయంత్రం 7:30కు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో ఒక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతూ ఉండగా, మరో మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌లతో లీగ్ స్టేజ్ అయిపోతుంది. అక్టోబర్ 10వ తేదీ నుంచి ప్లేఆఫ్స్ ప్రారంభం అవుతాయి. ఒకేసారి రెండు మ్యాచ్‌లు జరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారు, వ్యూయర్ షిప్ దెబ్బ తింటుందా అనే అంశంపై ఆసక్తి నెలకొంది.
ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌తో ముంబై ఇండియన్స్ భవితవ్యం తేలనుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై భారీ తేడాతో గెలిస్తేనే.. ముంబై ఇండియన్స్‌కు ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశం ఉంటుంది. అయితే సన్‌రైజర్స్ తన గత మూడు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. రాజస్తాన్‌ను ఓడించి వారి ప్లేఆఫ్స్ అవకాశాలను దెబ్బతీసింది. రాయల్ చాలెంజర్స్‌ను చిత్తు చేసి వారిని రెండో స్థానానికి చేరకుండా ఆపింది. కాబట్టి ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో తిరుగులేని విజయం సాధించాల్సిందే.
గత మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌పై ముంబై తన బెస్ట్ ఇచ్చింది. క్వింటన్ డికాక్ స్థానంలో ఇషాన్ కిషన్‌ను, కృనాల్ పాండ్యా స్థానంలో జిమ్మీ నీషంను జట్టులోకి తీసుకోగా.. ఈ రెండు మార్పులూ ఫలితాన్నిచ్చాయి. వాబట్టి అదే ఊపును ముంబై కొనసాగిస్తే చాలు.
ఇక సన్‌రైజర్స్ విషయానికి వస్తే.. గత మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ విఫలమైనా బౌలర్లు అద్భుతంగా రాణించి 141 పరుగులను కాపాడుకున్నారు. కానీ ముంబై లాంటి జట్టు మీద గెలవాలంటే.. బ్యాట్స్‌మెన్ కూడా ఒక చేయి వేయాల్సిందే..
రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఈ రెండు జట్లూ ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరిపోయాయి కాబట్టి.. ఈ మ్యాచ్ ప్రభావం ప్లేఆఫ్స్ రేసు మీద ఉండదు. క్వాలిఫయర్-1 మ్యాచ్ మీద మాత్రం దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది.
గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఢిల్లీ అద్భుత ఫాంలో ఉంది. బ్యాట్స్‌మెన్, బౌలర్లు అందరూ తమ బాధ్యతను అద్భుతంగా నెరవేరుస్తున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ప్లేఆఫ్స్‌కు మరింత ఉత్సాహంగా ఢిల్లీ వెళ్తుంది. మరోవైపు బెంగళూరు గత మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే.. ప్లేఆఫ్స్‌కు ముందు మానసికంగా బలహీనంగా అయ్యే అవకాశం ఉంది.