Kondapolam Review: తన మొదటి సినిమా ఉప్పెనతో అందరినీ ఆకట్టుకున్న వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్‌ల కాంబినేషన్‌లో విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి రూపొందించిన చిత్రం కొండపొలం. హరిహర వీరమల్లు షూటింగ్ గ్యాప్‌లోనే ఈ చిత్రాన్ని క్రిష్ తెరకెక్కించారు. ఎంతో ఆసక్తికరంగా కట్ చేసిన ట్రైలర్ ఈ చిత్రం మీద అంచనాలను పెంచింది. ఒక విభిన్న సినిమాను చూడబోతున్నామనే ఫీలింగ్‌ను కలిగించింది. మరి వైష్ణవ్ తేజ్ తన రెండో సక్సెస్‌ను అందుకున్నాడా? సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా?


కథ: నల్లమలకు చెందిన కటారు రవీంద్ర యాదవ్(పంజా వైష్ణవ్ తేజ్) బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా ఉద్యోగం మాత్రం దొరకదు. దీంతో నగరంలో బతకలేని పరిస్థితిలో తిరిగి సొంతూరికి వెళ్లిపోతాడు. అదే సమయంలో రవీంద్ర గ్రామంలో ప్రజలు కరువుతో అల్లాడుతూ ఉంటారు. దీంతో తాత రోశయ్య(కోట శ్రీనివాసరావు) సలహా మేరకు.. తండ్రి(సాయిచంద్)తో కలిసి గొర్రెల మందతో కొండపొలం చేయడానికి వెళ్తాడు. నెలరోజులు అడవిలోనే గడపాల్సి వస్తుంది. ఈ క్రమంలో అక్కడ తనకి కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి? ఆ పరిస్థితుల నుంచి తను ఎలా బయటపడ్డాడు? తన కథలో ఓబులమ్మ(రకుల్‌ప్రీత్ సింగ్) పాత్ర ఏమిటి? చివరికి రవీంద్ర యాదవ్ జీవితం ఏం అయింది? వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..


విశ్లేషణ: కొండపొలం నవలను కథగా తెరకెక్కించడమే దర్శకుడు క్రిష్‌కు అతిపెద్ద సవాల్. ఎక్కడో అడవుల్లో, కొండల మీదకి షూటింగ్‌కి అవసరమైన సామాన్లు తరలించడం, అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో షూటింగ్ చేయడం వంటి అంశాలు క్రిష్ ఈ కథను ఎంత ప్రేమించాడో చెబుతాయి. ఈ సినిమా మీద క్రిష్‌కు ఉన్న ప్రేమ మనకు తెర మీద కనపడుతుంది. ముఖ్యంగా అడవుల్లో జరిగే సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్‌లు అయితే విపరీతంగా ఆకట్టుకుంటాయి. రాయలసీమ అంటే మనం ఇంతవరకు ఫ్యాక్షన్ సినిమాలు ఎక్కువ చూశాం. అక్కడి వ్యక్తులు తమ పశువులకు ఏమైనా జరిగితే.. ప్రాణాలను పణంగా పెట్టి పోరాడతారని క్రిష్ ఈ సినిమా ద్వారా తెలియజేశాడు. అయితే నవలను ఎక్కువగా ప్రేమించడం వల్లనేమో సినిమా కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. మధ్యలో కొన్ని అనవసరమైన సన్నివేశాల కారణంగా ప్రేక్షకులు సినిమా నుంచి డిస్‌కనెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది.


ఈ సినిమాలో డైలాగ్‌లు కూడా చాలా అర్థవంతంగా ఉన్నాయి. ఇక్కడ జ్ఞానశేఖర్ కెమెరా పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. తన విజువల్స్‌తో సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాడు. పోరాట సన్నివేశాలు, అడవిలో వచ్చే సీక్వెన్సులు అయితే ఐఫీస్ట్ అని చెప్పవచ్చు. కీరవాణి నేపథ్య సంగీతం కూడా మంచి సన్నివేశాలను ఎలివేట్ చేసింది. ఉప్పెన తరహాలో పాటలు అంత సక్సెస్ కాకపోవడం ఈ సినిమాకు మరో మైనస్.


ఇక నటీనటుల విషయానికి వస్తే.. మొదటి సినిమాలో ప్రేమలో ఉన్న యువకుడి పాత్ర చేసిన వైష్ణవ్‌కు ఈ సినిమా ప్రమోషన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది ఒక మెచ్యూర్డ్ రోల్. కొన్ని సన్నివేశాల్లో వైష్ణవ్ కళ్లతోనే నటించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఏ నటుడికి అయినా ఇటువంటి మెచ్యూర్డ్ పాత్ర చేయాలంటే కాస్త కాన్ఫిడెన్స్ కూడా అవసరం అవుతుంది. ఉప్పెన లాంటి హిట్ సినిమా ఉంది కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది అని కూడా అనలేం.. ఎందుకంటే ఉప్పెన విడుదలకు ముందే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయిపోయంది. ఇప్పుడు తనకు నటుడిగా మంచి గుర్తింపు కూడా వచ్చింది కాబట్టి త్వరలో తననుంచి మరిన్ని మంచి పాత్రలు వస్తాయనుకోవచ్చు.


ఓబులమ్మ పాత్రలో నటించిన రకుల్ ప్రీత్ సింగ్‌కు కూడా ఇది కొత్త తరహా ఎక్స్‌పీరియన్స్. ఇప్పటివరకు రకుల్ చేసిన పాత్రల్లో మెజారిటీ గ్లామరస్ రోల్సే. అయితే ఇటువంటి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ కూడా తను చేయగలను అని రకుల్ ఈ సినిమాతో నిరూపించింది. పిరికివాడైన వైష్ణవ్‌లో ధైర్యాన్ని నింపే సన్నివేశాల్లో ఇప్పటివరకు చూడని కొత్త రకుల్‌ని చూడవచ్చు. సాయిచంద్, కోటశ్రీనివాసరావు, మిగతా నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.


ఓవరాల్‌గా చూస్తే.. కొండపొలం ఫస్టాఫ్ కథ వేగంగా సాగుతుంది. అయతే సెకండాఫ్‌లో స్క్రీన్‌ప్లే కాస్త స్లో అవ్వడంతో సినిమా గ్రాఫ్ అక్కడక్కడ కొంచెం కిందికి దిగుతుంది. దీంతో ప్రేక్షకుడు కథ నుంచి డిస్‌కనెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. కమర్షియల్‌గా ఈ సినిమా రేంజ్ ఇప్పుడే అంచనా వేయలేం కానీ.. మంచి సినిమాను చూసిన అనుభూతి కలుగుతుంది. సక్సెస్, రెవిన్యూ ఉప్పెన రేంజ్‌లో రాకపోయినా.. వైష్ణవ్‌ను నటుడిగా మాత్రం ఈ సినిమా మరో మెట్టు ఎక్కిస్తుంది.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి