మార్కస్‌ స్టాయినిస్‌ను తీసుకోవడం వెనక కారణాలను లక్నో జట్టు మెంటార్‌ గౌతమ్‌ గంభీర్‌ వివరించాడు. ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ వేలంలోకి రావడంపై స్పష్టత లేదని పేర్కొన్నాడు. అలాంటప్పుడు స్టాయినిస్‌ వెనక ఫ్రాంచైజీలు వరుస కడతాయని వెల్లడించాడు. అతడు బ్యాటు, బంతితో జట్టుకు అండగా నిలుస్తాడని వెల్లడించాడు.


'బెన్‌స్టోక్స్‌ వేలానికి దూరంగా ఉండే అవకాశం ఉంది. అలాంటప్పుడు స్టాయినిస్‌ కంప్లీట్‌ ప్యాకేజీ అవుతాడు. అతడు బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేస్తాడు. ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడు. అతడి చేరిక జట్టుకు అదనంగా లబ్ధి చేకూరుస్తుంది' అని గంభీర్‌ అన్నాడు. 'ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో అతడు రాణించడం మనందరం చూశాం. స్టాయినిస్‌ ఒంటి చేత్తో మ్యాచులు గెలిపించగలడు' అని గౌతీ చెప్పాడు.


కేవలం ఆల్‌రౌండర్‌గానే కాకుండా ఫినిషర్‌గానూ స్టాయినిస్‌ సేవలందిస్తాడని గంభీర్‌ తెలిపాడు. బెన్‌స్టోక్స్‌ తర్వాత వేలానికి అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఆల్‌రౌండర్‌ స్టాయినిసే అని పేర్కొన్నాడు. మిడిలార్డర్లో అతడు జట్టుకు వెన్నెముకగా మారి మ్యాచులను ముగిస్తాడని వెల్లడించాడు.


లక్నో జట్టు చాలా తెలివిగా ఆటగాళ్లను ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. కేఎల్‌ రాహుల్‌ను సారథిగా ఎంచుకుంది. అతడు ప్రతి సీజన్లో కనీసం 550 పరుగులు చేస్తున్నాడు. నిలకడగా రాణిస్తున్నాడు. అందుకే రూ.17 కోట్లతో అతడిని సొంతం చేసుకుంది. ప్రతి జట్టుకు పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అవసరం ఎంతైనా ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా బౌలింగ్‌, బ్యాటింగ్‌ చేసే ఆటగాళ్లను వేలంలో అత్యధిక ధరకు కొంటారు. అందుకే స్టాయినిస్‌కు రూ.9 కోట్లకు పైగా చెల్లించి సొంతం చేసుకున్నారు. ఇక రవి బిష్ణోయ్‌ తన మిస్టరీ స్పిన్‌తో ఎంతటి బ్యాటర్‌నైనా బోల్తా కొట్టించగలడు. గూగ్లీలతో వికెట్లు తీస్తూ పరుగులు నియంత్రిస్తాడు.


ఇక ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ సరికొత్త సీజన్‌ భారత్‌లోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముంబయి నగరం సీజన్‌కు ఆతిథ్యం ఇవ్వనుందని తెలిసింది. అభిమానులకు అనుమతి లేకుండా కట్టుదిట్టమైన బయో బుడగలను ఇక్కడ సృష్టిస్తారు. వాంఖడే, డీవై పాటిల్‌, క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా (CCI)లో మ్యాచులు నిర్వహిస్తారని బీసీసీఐ వర్గాలు మీడియాకు తెలిపాయి. అవసరమైతే పుణెను ప్రత్యామ్నాయ వేదికగా ఉపయోగించుకుంటారు.


Also Read: Ind vs SA, Innings Highlights: అయిపాయే.. రెండో మ్యాచ్‌లోనూ భారత్ ఓటమి.. సిరీస్ కూడా!


Also Read: IPL 2022 Retention: లక్నో, అహ్మదాబాద్ ఎంచుకున్న ఆటగాళ్లు వీరే.. కెప్టెన్లు ఎవరంటే?


Also Read: David Warner: పుష్పని వదలని వార్నర్.. తర్వాతి ఐపీఎల్ ఫ్రాంచైజీకి హింట్ ఇచ్చాడా?