ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో డేవిడ్ వార్నర్‌కు మరోసారి కెప్టెన్సీ అవకాశం దక్కకపోవచ్చని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అంటున్నాడు. ఐపీఎల్ మొత్తం ఒక కుటుంబం వంటిదేనని అతడు పేర్కొన్నాడు. గతేడాది ఏం జరిగిందో ఆటగాళ్లు, ఫ్రాంచైజీలకు తెలిసే ఉంటుందని అంచనా వేశాడు. బ్యాటర్‌గా అతడికి వేలంలో భారీ ధర పలకొచ్చని తెలిపాడు.
ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్ తిరుగులేని ఆటగాడు. అత్యధిక పరుగులు చేసిన విదేశీ బ్యాటర్‌గా అతడు రికార్డు సృష్టించాడు. ఆరేళ్లుగా వరుసగా 500+ పరుగులు చేస్తున్న వార్నర్ గతేడాది ఎనిమిది మ్యాచుల్లో కేవలం 195 పరుగులే చేశాడు. ఫామ్ కోల్పోవడంలో, జట్టు యాజమాన్యంతో విభేదాలు తలెత్తడంతో అతడిని నాయకత్వం నుంచి తప్పించారు. కొన్ని మ్యాచుల్లోనైతే తుది జట్టులోనూ చోటు దక్కలేదు. కొత్తగా వచ్చిన జట్లు సైతం అతడిని తీసుకోలేదు. దాంతో వేలంలో అతడికి భారీ ధర లభించే అవకాశం ఉంది. బెంగళూరు అతడిని తీసుకొంటుందన్న అంచనాలు ఉన్నాయి.
Also Read: IPL 2022: ఎంఎస్ ధోనీ CSK పగ్గాలు వదిలేస్తున్నాడా? మరి 'సింహం' చెన్నైలో ఎందుకు దిగినట్టు?
'డేవిడ్ వార్నర్ కెప్టెన్సీపై ఫ్రాంచైజీలు ఆలోచిస్తుండొచ్చు. నా ఉద్దేశంలో మాత్రం అతడికి నాయకత్వ బాధ్యతలు అప్పగించరు. లీగులో మూడు జట్లు కెప్టెన్ కోసం చూస్తున్నప్పటికీ అతడికి సారథ్యం అప్పగించరని అనిపిస్తోంది. పంజాబ్‌ను పక్కన పెట్టినా మరో రెండు జట్లు కెప్టెన్ కోసం ఎదురు చూస్తున్నాయి. డేవిడ్ వార్నర్‌ను ఏదో ఒక జట్టు కచ్చితంగా తీసుకుంటుంది. భారీ ధర పలుకుతాడు. ఏదేమైనా ఐపీఎల్ ఒక కుటుంబం. గతేడాది ఏం జరిగిందో, కారణాలు, సమస్యలేంటో అందరికీ తెలుసు. ఆటగాళ్లు, ఫ్రాంచైజీలు ఇలాంటివి ప్రోత్సహించరు' అని ఆకాశ్ చోప్రా అన్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం కోసం డేవిడ్ వార్నర్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. బహుశా పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ వంటి జట్లు అతడి కోసం ఎదురు చూస్తున్నాయి. ఓపెనర్ల ఇబ్బందులున్న జట్లు వేలంలో అతడి కోసం బిడ్డింగ్ వేయొచ్చు. ప్రస్తుతం వార్నర్ పుష్ఫ పాటలు, డైలాగులను రీక్రియేట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.