ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియజేశాడు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ తనకు లేఖ రాయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని వెల్లడించాడు. భారతదేశం ప్రపంచానికే శక్తికేంద్రమని, అక్కడి ప్రజలు తనకెంతో ఇష్టమని పేర్కొన్నాడు.


73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ కొందరు విదేశీయులకు ప్రత్యేకంగా లేఖలు రాశారు. ఇండియాను ప్రేమించే, ఇక్కడి ప్రజలతో మమేకం అయ్యే, ఇక్కడి సంస్కృతులను ఇష్టపడే, ఈ దేశంతో అనుసంధానం అయ్యే క్రీడాకారులే ఎక్కువగా ఉన్నారు. ఇంతకు ముందే దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌కు లేఖ రాయడం తెలిసిందే. ఇప్పుడు పీటర్సన్‌ తనకు వచ్చిన లేఖను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.


Also Read: Dinesh Karthik on Ravindra Jadeja: జడ్డూ చిన్న పిల్లాడేం కాదు! మిడిలార్డర్‌ కష్టాలు తీర్చేస్తాడు!!


Also Read: Harbhajan Favourite Batter: కోహ్లీపై పూర్తి గౌరవంతో చెబుతున్నా! నా ఫేవరెట్‌ క్రికెటర్‌ ఎవరంటే?


'ప్రియమైన నరేంద్ర మోదీజీ! ఈ లేఖలో నా గురించి అత్యంత ప్రేమతో ప్రస్తావించినందుకు ధన్యవాదాలు. 2003లో మొదటిసారి భారత్‌లో అడుగుపెట్టాను. అప్పట్నుంచి పర్యటనకు వచ్చిన ప్రతిసారీ మీ దేశం పట్ల ప్రేమ పెరుగుతూనే ఉంది. ఇండియాలో నాకు అత్యంత ఇష్టమైంది ఏమిటని ఈ మధ్యే ఒకరు నన్నడిగారు. అక్కడి ప్రజలేనని నేను సింపుల్‌గా జవాబిచ్చాను. అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. భారత్‌ అంటే గర్వించే దేశం.. ప్రపంచానికే శక్తికేంద్రం. మిమ్మల్ని వ్యక్తిగతంగా కలుసుకొనేందుకు ఎదురు చూస్తుంటాను' అని పీటర్సన్‌ అన్నాడు.


'ఏటా జనవరి 26న మేం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. భారత్‌లో ఇదే రోజున రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. మైదానంలో మీ విధ్వంసకర బ్యాటింగ్‌ మా అందరి మనసుల్లో ఇప్పటికీ తాజాగానే ఉంది. భారత్‌, భారతీయులతో ఈ అనుబంధం నిజంగా అద్భుతం. మీరు హిందీలో చేసే ట్వీట్లు చూసి ఆస్వాదిస్తుంటాను. ఇండియా ఇప్పుడు చారిత్రక సాంఘిక ఆర్థిక పరివర్తన చెందుతోంది. ఇది ప్రజల జీవితాలను, ప్రపంచ మేలుకు దోహదం చేస్తుందన్న ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. మరోసారి మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మిమ్మల్ని కలిసి మాట్లాడేందుకు ఎదురు చూస్తుంటా' అని పీటర్సన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు.