మహేంద్ర సింగ్‌ ధోనీ ఈ సారి చెన్నై పగ్గాలు వదిలేస్తున్నాడా? అందుకే రవీంద్ర జడేజాను సీఎస్‌కే రూ.16 కోట్లు పెట్టి అట్టిపెట్టుకుందా? ఉద్దేశపూర్వకంగానే మహీ రెండో ప్రాధాన్య ఆటగాడిగా ఉండేందుకు ఇష్టపడ్డాడా? ఐపీఎల్‌-15లో చెన్నై సింహాలను రవీంద్రుడే ఉరుకులు పెట్టిస్తాడా?


అంటే..!


కాదనే అంటున్నాయి చెన్నై సూపర్‌కింగ్స్‌ వర్గాలు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగు పదిహేనో సీజన్లోనూ చెన్నైని ఎంఎస్ ధోనీయే నడిపిస్తాడని అంటున్నారు. ఫ్రాంచైజీ క్రికెట్‌కు వీడ్కోలు పలకనంత వరకు అతడే నాయకుడిగా ఉంటాడని చెబుతున్నారు. ఇప్పటికే ఐపీఎల్‌ వేలం గురించి చర్చించేందుకు ధోనీ చెన్నైకి చేరుకోవడాన్ని గుర్తు చేస్తున్నారు.


చెన్నై సూపర్‌కింగ్స్‌ ఈ సారి నలుగురు ఆటగాళ్లను రీటెయిన్‌ చేసుకుంది. ఎప్పుడూ తొలి ప్రాధాన్యంలో ఉండే ఎంఎస్‌ ధోనీ ఈ సారి రెండో స్థానానికి స్వయంగా తప్పుకున్నాడు. రవీంద్ర జడేజాను రూ.16 కోట్లకు తీసుకొనేలా చేశాడు. అతడు రూ.12 కోట్లకే పరిమితం అయ్యాడు. ఇక రూ.8 కోట్లకు ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ, రూ.6 కోట్లతో రుతురాజ్‌ గైక్వాడ్‌ను సీఎస్‌కే తీసుకుంది.


మహీకి దాదాపుగా ఇదే చివరి సీజన్‌గా భావిస్తుండటం, రవీంద్ర జడేజాను ఎక్కువ ధరకు తీసుకోవడంతో అతడికే పగ్గాలు అప్పగిస్తారని అనుకున్నారు. వికెట్ల వెనకాల ఉండి జడ్డూకు నాయకత్వ పాఠాలు బోధిస్తారని అంచనా వేశారు. కానీ అవేమీ నిజం కావని తెలుస్తోంది.


Also Read: Dinesh Karthik on Ravindra Jadeja: జడ్డూ చిన్న పిల్లాడేం కాదు! మిడిలార్డర్‌ కష్టాలు తీర్చేస్తాడు!!


Also Read: Harbhajan Favourite Batter: కోహ్లీపై పూర్తి గౌరవంతో చెబుతున్నా! నా ఫేవరెట్‌ క్రికెటర్‌ ఎవరంటే?


'కెప్టెన్సీ మార్పుపై ఇప్పటి వరకు చర్చే జరగలేదు. సమయం వచ్చినప్పుడు వంతెన దాటుతాం! ఇప్పటికైతే ధోనీయే మా కెప్టెన్‌. సీఎస్‌కేలో మొదటి ఆటగాడు అతడే. నిజంగా దిగిపోవాలని అనుకుంటే అతడే నిర్ణయం తీసుకుంటాడు. మేమిప్పుడు వేలం పైనే ఫోకస్ చేస్తున్నాం. ఉదాహరణ తర్వాత ఉదాహరణగా నిలుస్తున్న ధోనీ గురించి మీరు మాట్లాడుతున్నారు. అతడు కావాలనే తొలి ప్రాధాన్య రీటెన్షన్‌ను జడ్డూకు ఇచ్చేశాడు. ప్రతిసారీ శిబిరానికి అందరికన్నా ముందే వస్తాడు. అతడు దృఢంగా ఉన్నాడు. మరోసారి టైటిల్‌ అందిస్తాడు. సీజన్‌ మధ్యలోనే అతడెందుకు రిటైర్‌ అవుతాడు? సరైన సమయంలో సరైన నిర్ణయాలే తీసుకుంటాం' అని సీఎస్‌కే వర్గాలు అంటున్నాయి.


ధోనీ గురువారం రాత్రి చెన్నై నగరానికి చేరుకున్నాడు. పదిహేను రోజుల పాటు అక్కడే ఉంటాడని తెలిసింది. రాబోయే పదేళ్లకు జట్టుకు సేవలందించే ఆటగాళ్లను తీసుకొనేందుకు చెన్నై వ్యూహాలు రచిస్తోంది. ఇవన్నీ ధోనీ నేతృత్వంలోనే సాగనున్నాయి.