ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కడప జిల్లాపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. విశాఖలో మీడియాలో సమావేశంలో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం జిల్లాకో విమానాశ్రయం కడతామన్న సీఎం జగన్ ప్రకటనపై స్పందించారు. ఈ క్రమంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 


హత్యలు చేసే ప్రాంతం కడపగా చెప్పిన సోము వీర్రాజు ! 


సోము వీర్రాజు విమానాశ్రయాలు కేంద్రం కడుతుందని చెబుతూ .. సీఎం జగన్ సొంత జిల్లా కడప ప్రస్తావన తీసుకు వచ్చారు. "  కడప జిల్లాలో హత్యలు చేసే వాళ్లు మాత్రమే ఉంటారని.. వాళ్లకు ప్రాణాలు తీయడమే మాత్రమే తెలుసు. ప్రాణాలు తీసే ప్రాంతంలో కూడా ఎయిర్‌పోర్ట్‌లు కట్టించాము"అని వ్యాఖ్యానించారు.  ఎయిర్‌పోర్ట్‌ల విషయం కేంద్రం చూసుకుందని, రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు సరిగా వేయాలని సోము వీర్రాజు సూచించారు. 


 






సోము వీర్రాజు కడపకు వస్తే ప్రజలు దాడిచేస్తారన్న వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ! 


సోము వీర్రాజు కడప జిల్లాపై చేసిన వ్యాఖ్యలు ఒక్క సారిగా వైరల్‌గా మారాయి. కడప జిల్లాపై ఇంత దారుణమైన వ్యాఖ్యలను ఓ జాతీయ పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షుడు చేయడం ఏమిటని విమర్శించడం ప్రారంభించారు. కడప జిల్లాకు చెందిన పలువురు సోషల్ మీడియాలో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు చేయడం ప్రారంభించారు. ఈ వివాదం పై ఎస్ఆర్‌సీపీ నేతలు కూడా సోము వీర్రాజుపై విరుచుకుపడుతున్నారు. ప్రొద్దుటూరు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదర్ రెడ్డి సోము వీర్రాజు వ్యాఖ్యలు బాధిస్తున్నాయన్నారు. సోము వీర్రాజు కడప జిల్లాకు వస్తే ప్రజలు దాడి చేస్తారని.. తాను ప్రజాస్వామ్యంలో లేకపోయి ఉంటే .. సోము వీర్రాజు నాలుక కోసి ఉండేవాడినన్నారు. ఇతర నేతలు కూడా ఇంతే ఘాటుగా స్పందిస్తున్నారు. 


తన వ్యాఖ్యలు వక్రీకరించారని సోము వీర్రాజు వివరణ !


తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో సోము వీర్రాజు కూడా వెంటనే స్పందించారు. తన వ్యాఖ్యలు కడప జిల్లాకు చెందినవి కావని... కడప జిల్లాను ఉద్దేశించి అనలేదని ఆయన వివరణ ఇస్తూ ప్రకటన ఇచ్చారు. తాను కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్యను ప్రస్తావిస్తూ మాత్రమే ఆ వ్యాఖ్యాలను చేశానన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారన్నారు. కడప జిల్లా ప్రజలు మొత్తం హత్యలు చేస్తారని తాను అనలేదన్నారు. 


పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సోము వీర్రాజు 


సోము వీర్రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి కాదు. ఇటీవల విజయవాడలో ఆ పార్టీ నిర్వహించిన బహిరంగసభలో రూ. యాభై కే చీప్ లిక్కర్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇది దేశవ్యాప్తంగా ట్రోలింగ్‌కు గురైంది . అదే సభలో కమ్యూనిస్టు పార్టీల నేతలపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. సోము వీర్రాజు వ్యాఖ్యలు అనేక రకాల విమర్శలకు గురవుతున్నాయి. ఆయన మాత్రం అలా వివాదాస్పదంగా మాట్లాడుతూనే ఉన్నారు.