సీనియర్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ సంచలన విషయం చెప్పాడు! ఐపీఎల్ ఫ్రాంచైజీ దిల్లీ క్యాపిటల్స్ తనను రీటెయిన్ చేసుకోవడం లేదని చెప్పాడు. అంతేకాదు మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌నూ తీసుకోవడం లేదని వెల్లడించాడు. ఎవరెవరిని తీసుకుంటుందో అంచనా వేశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాత సీజన్‌కు త్వరలోనే వేలం వేయనున్నారు. ఈ సారి మెగావేలం జరుగుతుండటంతో కేవలం నలుగురిని మాత్రమే రీటెయిన్ చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నారు! గరిష్ఠంగా ముగ్గురు భారతీయులు, ఒక విదేశీయుడు లేదా ఇద్దరు భారతీయులు, ఇద్దరు విదేశీయులను తీసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎవరెవరిని రీటెయిన్ చేసుకోవాలోనని ఫ్రాంచైజీలన్నీ తలమునకలు అయ్యాయి.
దిల్లీ ఫ్రాంచైజీ తనను, శ్రేయస్ అయ్యర్‌ను రీటెయిన్ చేసుకోవడం లేదని ఈ మధ్యే రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో చెప్పాడు. 'నన్ను దిల్లీ రీటెయిన్ చేసుకోవడం లేదు. తీసుకునేట్టైతే ఈ పాటికి నాకు చెప్పుండేవారు' అని యాష్ అన్నాడు. 'శ్రేయస్ అయ్యర్‌ను కూడా తీసుకోలేదని నాకిప్పుడే తెలిసింది' అని పేర్కొన్నాడు. కెప్టెన్ రిషభ్ పంత్, ఓపెనర్ పృథ్వీషా, పేసర్ ఆన్రిచ్ నార్జ్‌ను ఫ్రాంచైజీ తీసుకుంటుందని అంచనా వేశాడు.
పంజాబ్‌కు సారథ్యం వహిస్తున్న రవిచంద్రన్ అశ్విన్‌ను గతేడాది దిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. అందుకు తగ్గట్టే అతడు రాణించాడు. 2020లో 15 మ్యాచులాడి 7.61 ఎకానమీతో 13 వికెట్లు తీశాడు. ఇక ఈ సీజన్లో 13 మ్యాచుల్లో 7.46 ఎకానమీతో 7 వికెట్లు తీశాడు. ఇక శ్రేయస్ అయ్యర్ గాయపడటంతో రిషభ్ పంత్‌ను దిల్లీ సారథిగా ఎంచుకుంది. ఆ తర్వాత కోలుకొని అయ్యర్ వచ్చి ఫర్వాలేదనిపించాడు. బహుశా మిగతా వారిని వేలంలో దిల్లీ దక్కించుకొనే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Gambhir on Ravi Shastri: శాస్త్రిపై గౌతీ విమర్శలు.. ద్రవిడ్ సమతూకం బాగుందన్న మాజీ ఓపెనర్
Also Read: Cricketer Dog Viral Video: కుక్క ఫీల్డింగ్ కేక.. ఏకంగా సచిన్ టెండూల్కరే అలా!