ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఆదివారం జరిగే రెండు మ్యాచులు అభిమానులను అలరించనున్నాయి. పట్టికలో మూడో స్థానంలో ఉన్న బెంగళూరు, ప్లేఆఫ్స్‌ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న పంజాబ్‌ కింగ్స్‌తో తలపడనుంది. మరోవైపు పరువు కోసం మాత్రమే ఆడుతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ ఢీకొటుంది. ఈ నాలుగు జట్లలోనూ విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. వారిలో ఐదుగురు 'సండే'ను 'ఫన్‌డే'గా మార్చేందుకు సిద్ధంగా ఉన్నారు.


Also Read: రాహుల్‌ X కోహ్లీ... బెంగళూరును ఓడిస్తే పంజాబ్‌ బతుకుంది!


విరాట్‌ కోహ్లీ: ఐపీఎల్‌లో అత్యధిక మొత్తం అందుకుంటున్న ఏకైక ఆటగాడు విరాట్‌ కోహ్లీ. చాన్నాళ్ల తర్వాత ఫామ్‌లోకి వచ్చాడు. రెండో అంచెలో దూకుడుగా ఆడుతున్నాడు. పంజాబ్‌ గనక అతడిని త్వరగా ఔట్‌చేయకపోతే ఊచకోత తప్పనట్టే ఉంది! ప్రపంచకప్‌నకు ముందు పూర్తి ఫామ్‌లోకి రావాలని కింగ్‌ కోహ్లీ పట్టుదలగా ఉన్నాడు. అందుకే ఆదివారం అతడు చెలరేగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అతడు 33 సగటుతో 332 పరుగులు చేశాడు.


కేఎల్‌ రాహుల్‌: ఆట, అందం, విధ్వంసం కలిస్తే కేఎల్‌ రాహల్‌ బ్యాటింగ్‌. ప్రపంచంలోనే అత్యంత సోయగంగా షాట్లు కొట్టే రాహుల్‌ పంజాబ్‌కు వెన్నెముక. ఇప్పటికే 489 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ కోసం తీవ్రంగా పోటీపడుతున్నాడు. కోల్‌కతా మ్యాచులో 55 బంతుల్లోనే 67 పరుగులు చేసి జట్టును రక్షించాడు. ప్లేఆఫ్స్‌ కోసం తపిస్తున్న పంజాబ్‌కు ఈ రోజు అతడే కీలకం. బెంగళూరు అతడికి మంచి రికార్డూ ఉంది మరి!


Also Read: చెన్నైపై ఆరు వికెట్లతో రాజస్తాన్ విజయం.. పాపం గైక్వాడ్.. సెంచరీ వృథా!


మాక్స్‌వెల్‌: ఐపీఎల్‌లో కొన్నేళ్ల తర్వాత భీకరమైన ఫామ్‌ చూపిస్తున్నాడు గ్లెన్‌ మాక్స్‌వెల్‌. పంజాబ్ కొన్నేళ్లు అట్టిపెట్టుకున్నా బెంగళూరుకు వచ్చాక అతడి ఆటతీరు మారింది. విధ్వంసకర ఇన్నింగ్సులతో బెంగళూరును గెలిపిస్తున్నాడు. మ్యాచులను ముగిస్తున్నాడు. 11 మ్యాచుల్లో అతడు 38 సగటుతో 350 పరుగులు చేశాడు. చివరి మ్యాచులో శ్రీకర్‌ భరత్‌ ఔటయ్యాక మాక్సీ ఎంత 'మ్యాడ్‌'గా ఆడాడో అందరికీ తెలుసు. పంజాబ్‌తో అతడితో జాగ్రత్తగా ఉండాలి.


Also Read: పాయింట్ల పట్టికలో టాప్-4 జట్లు ఇవే.. రేసు మరింత రసవత్తరం!


జేసన్‌ రాయ్‌: డేవిడ్‌ వార్నర్‌ మెరుపులకు దూరమైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు జేసన్‌ రాయ్‌ ఇప్పుడు శుభారంభాలు ఇస్తున్నాడు. ఈ అంచెలో ఇచ్చిన తొలి అవకాశంలోనే అతడు 60 పరుగులు చేశాడు. జట్టు యాజమాన్యం అంచనాలను అందుకుంటున్నాడు. ఇంగ్లాండ్‌కు విధ్వంసకర ఆరంభాలు ఇచ్చిన రాయ్‌ నుంచి హైదరాబాద్ నేడు భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తోంది. కోల్‌కతాను ఓడించాలని కోరుకుంటోంది.


వెంకటేశ్‌ అయ్యర్‌: దేశవాళీ క్రికెటర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ హఠాత్తుగా తెరమీదకు వచ్చాడు. నిర్భీతిగా ఓపెనింగ్‌ చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. పంజాబ్‌ కింగ్స్‌పై చివరి మ్యాచులో 49 బంతుల్లోనే 67 పరుగులు చేశాడు. బ్యాటుతోనే కాకుండా బంతితోనూ రాణిస్తుండటం కోల్‌కతాకు సంతోషాన్నిస్తోంది. ఈ ఇండోర్‌ కుర్రాడు ఐదు ఇన్నింగ్సుల్లోనే 193 పరుగులు చేశాడు. సన్‌రైజర్స్‌ అతడిని అడ్డుకొనేందుకు ఆదివారం ప్రత్యేక ప్రణాళికలు వేయాల్సిందే. వచ్చే ఏడాది వేలంలో అతడు కోటీశ్వరుడు అవ్వడం ఖాయమని సన్నీ, మంజ్రేకర్‌ వంటి విశ్లేషకులు చెబుతున్నారు.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి