ఐపీఎల్‌లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌పై సన్‌రైజర్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. వార్నర్ స్థానంలో జట్టులోకి వచ్చిన రాయ్(60: 42 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్) మొదటి మ్యాచ్‌లోనే చెలరేగి ఆడాడు. రాయ్ తర్వాత విలియమ్సన్ (51 నాటౌట్: 41 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్), అభిషేక్ శర్మ (21: 16 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) రాణించడంతో ఏడు వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్.. సంజు శామ్సన్ బాగా ఆడటంతో 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఈ పరాజయంతో రాజస్తాన్ ప్లేఆఫ్ అవకాశాలు క్లిష్టం అయ్యాయి.


శామ్సన్ షో...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్తాన్‌తో ఆదిలోనే ఎదురుదెబ్బ  తగిలింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఎవిన్ లూయిస్‌ను అవుట్ చేసి భువనేశ్వర్ రైజర్స్‌కు మొదటి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత యశస్వి జైస్వాల్(36: 23 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్), సంజు శామ్సన్(82: 57 బంతుల్లో, ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు) కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. దీంతో ఆరు ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టానికి 49 పరుగులను రాజస్తాన్ సాధించింది. రెండో వికెట్‌కు 56 పరుగులు చేసిన అనంతరం తొమ్మిదో ఓవర్లో యశస్వి జైస్వాల్ అవుటయ్యాడు. 10 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు రెండు వికెట్ల నష్టానికి 77 పరుగులు చేశాడు.


10 ఓవర్లు ముగిసిన వెంటనే లియాం లివింగ్‌స్టోన్‌ను (4: 6 బంతుల్లో) రషీద్ ఖాన్ అవుట్ చేశాడు. అనంతరం సంజు శామ్సన్‌కు, లోమ్‌రోర్(29: 28 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) జత కలిశాడు. మొదట నిదానంగా ప్రారంభించి 14 ఓవర్ల తర్వాత శామ్సన్ గేర్లు మార్చడంతో స్కోరు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో తను అర్థ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. అయితే ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో సంజు, పరాగ్ అవుటయ్యారు. దీంతో ఆ ఓవర్లో నాలుగు పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో రాజస్తాన్ 20 ఓవర్లు ముగిసేసరికి ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగుల చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో కౌల్ రెండు వికెట్లు తీయగా.. భువనేశ్వర్, సందీప్, రషీద్ తలో వికెట్ తీశారు.


Also Read: షాకిచ్చిన మొయిన్‌ అలీ! టెస్టులకు గుడ్‌బై.. మూడో బెస్ట్‌ బౌలర్‌ అతడే!


ఆరంభం నుంచే లక్ష్యం వైపు..
సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ మాత్రం మెరుపు వేగంతో ప్రారంభం అయింది. జేసన్ రాయ్(60: 42 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్), వృద్ధిమాన్ సాహా చెలరేగి ఆడటంతో ఐదు ఓవర్లలోనే జట్టు స్కోరు 57 పరుగులకు చేరుకుంది. అయితే మహిపాల్ లో‌మ్‌రోర్ బౌలింగ్‌కు రాగానే సాహాను అవుట్ చేశాడు. దీంతో వన్‌డౌన్‌లో విలియమ్సన్ క్రీజులోకి వచ్చాడు. వీరిద్దరూ చెలరేగి ఆడటంతో స్కోరు పరుగులు పెట్టింది. 10 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 90 పరుగులను చేరుకున్నారు.


ఇక టెవాటియా వేసిన 11వ ఓవర్లో రాయ్ విశ్వరూపం చూపించాడు. ఒక సిక్సర్, మూడు ఫోర్లు కొట్టడంతో ఈ ఓవర్లో ఏకంగా 21 పరుగులు వచ్చాయి. అయితే తర్వాతి ఓవర్లోనే రాయ్‌ని అవుట్ చేసి సకారియా రాజస్తాన్ శిబిరంలో ఆనందాన్ని నింపాడు. వెంటనే ప్రియం గర్గ్ 0(1) కూడా అవుటయ్యాడు. దీంతో సన్‌రైజర్స్ ఒక్కసారిగా కష్టాల్లో పడింది. అయితే కెప్టెన్ కేన్ విలియమ్సన్(51 నాటౌట్: 41 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్), అభిషేక్(21: 16 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) తడబడకుండా ఆడటంతో.. రైజర్స్ 18.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. ముస్తాఫిజుర్ రెహ్మాన్, మహిపాల్ లోమ్‌రోర్, చేతన్ సకారియా తలో వికెట్ తీశారు.


Also Read: డుప్లెసిస్ ఫీల్డింగ్ అద్భుతం.. మోకాలికి రక్తం కారుతున్నా క్యాచ్ మాత్రం వదల్లేదు.. నెటిజన్ల ప్రశంసలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి