ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో ఫైనల్‌ కాని ఫైనల్‌..! వేదిక షార్జా. ఈ ప్రతిష్ఠాత్మక పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో దిల్లీ క్యాపిటల్స్‌ తలపడుతోంది. కేకేఆర్‌ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంటే పంత్‌సేన మాత్రం ధోనీదెబ్బతో కాస్త డీలా పడింది. మరి ఈ రెండు జట్లలో గెలిచెదెవరు? ఫైనల్‌ చేరేదెవరు?


Also Read: అయ్యో ఆర్సీబీ.. ‘ఈ సాల’ కూడా కప్పు మిస్.. ఎలిమినేటర్‌లో కోల్‌కతా విజయం!


ఆధిపత్యం అటు..ఇటు
ఈ రెండు జట్లు 27సార్లు తలపడగా కేకేఆర్‌ 15 సార్లు గెలిచింది. అయితే చివరిసారిగా తలపడ్డ ఐదు మ్యాచుల్లో మూడు సార్లు గెలిచి దిల్లీ ఆధిపత్యం చలాయించింది. ఈ  సీజన్లో ఆడిన రెండు లీగు మ్యాచుల్లో చెరో మ్యాచ్‌ గెలిచాయి. ఇక షార్జాలో కేకేఆర్‌ 7 మ్యాచులాడి 4 విజయాలు సాధించింది. అత్యధిక స్కోరు 210. దిల్లీ కూడా అన్నే మ్యాచులాడినా కేవలం రెండింట్లోనే ఓడింది. అత్యధిక స్కోరు 228. గెలుపోటముల పర్సెంటేజీ దిల్లీకే ఎక్కువ.


Also Read: ప్రపంచ క్రికెట్‌ను భారత్ శాసిస్తోంది.. బీసీసీఐ మాటే నెగ్గుతుంది: ఇమ్రాన్ ఖాన్


అన్నీ ఉన్నా.. మైండ్‌సెట్‌ మారితేనే!
దిల్లీ క్యాపిటల్స్‌కు బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో అన్ని వనరులు ఉన్నాయి. ఏ మ్యాచునైనా గెలవగల సత్తా ఆ  జట్టుకుంది. కానీ ఫ్లేఆఫ్స్‌ మ్యాచులను ఎలా గెలవాలో ఇంకా అనుభవం రాలేదు. చివరి మూడు సీజన్లలో మనమిది చూడొచ్చు. పెద్ద మ్యాచులను గెలిచే సామర్థ్యం తమకుందని మానసికంగా బలంగా నమ్మకపోవడమే అందుకు కారణం. చెన్నైతో తొలి క్వాలిఫయర్‌లోనూ ఇదే కనిపించింది. దాంతో వ్యూహాల అమల్లో, ఆలోచనలు చేయడంలో విఫలమవుతున్నారు. పేస్‌ను ఎదుర్కోలేకపోతున్న ధోనీకి ఆఖరి ఓవర్లో రబాడతో బౌలింగ్‌ చేయిస్తే ఫలితం మరోలా ఉండేదేమో! అవతలి జట్టులో ఎవరైనా ఒకరు నిలబడితే.. దిల్లీ కుర్రాళ్లు ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ సంగతి తెలుసు కాబట్టే ధోనీ క్రీజులోకి వచ్చి అద్భుతం చేశాడు. రెండో క్వాలిఫయర్‌లో కేకేఆర్‌ను ఎదుర్కొనేందుకు కావాల్సింది కేవలం ఆత్మవిశ్వాసం, గెలుస్తామన్న నమ్మకమే!


Also Read: ధోని నామస్మరణతో షేక్ అయిన సోషల్‌మీడియా.. స్టార్ హీరోలు కూడా ఫ్యాన్స్ అయిపోయిన వేళ!


కేకేఆర్‌లో మళ్లీ గౌతీ దూకుడు!
ఈ సీజన్‌ తొలి అంచెలో ఓటములు ఎదుర్కొన్న కోల్‌కతా దుబాయ్‌కి వచ్చాక రూటు మార్చింది. ఒకప్పటి గంభీర్‌ నాయకత్వంలోని దూకుడు మళ్లీ కనిపిస్తోంది. జట్టులో ఆటగాళ్లకు  స్థిరత్వం రావడంతో గెలుస్తామన్న నమ్మకంతోనే వారు బరిలోకి దిగుతున్నారు. కెప్టెన్‌ మోర్గాన్‌ ఫామ్‌లో లేకున్నా విజయాలు సాధిస్తుండటం దాన్నే సూచిస్తోంది. పవర్‌ప్లేలో ప్రత్యర్థిని చితక్కొట్టడమే కేకేఆర్‌ లక్ష్యం. ఇది గంభీర్‌ వారికి నేర్పిన పాఠం! అతడు వెళ్లాక.. ఓపెనింగ్‌లో ఇబ్బందులు ఎదుర్కొంది. ఎప్పుడైతే వెంకటేశ్‌ అయ్యర్‌ వచ్చాడో శుభ్‌మన్‌ సైతం దంచికొడుతున్నాడు. నితీశ్‌ రాణా టార్చ్‌బేరర్‌లా నిలకడగా ఆడుతూ వికెట్లను కాపాడుతున్నాడు. మిగతావాళ్లు దంచేస్తున్నారు. ఇక సునిల్‌ నరైన్‌, వరుణ్‌ చక్రవర్తిని ఎదుర్కోవడం ఎవరికైనా కష్టమే. పైగా నరైన్‌పై దిల్లీ టాప్‌, మిడిలార్డర్‌కు మెరుగైన రికార్డు లేదు. ఫెర్గూసన్‌తో పాటు కుర్ర పేసర్లూ దడదలాడిస్తున్నారు. మానసికంగా బలంగా కనిపిస్తున్న కేకేఆర్‌ను ఓడించడం దిల్లీకి అంత సులువేం కాదు. వారిపై గెలిస్తే దాదాపుగా ఫైనల్లో ధోనీసేననూ ఓడించగల విశ్వాసం వస్తుంది.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి