ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆఖరి దశకు చేరుకుంటోంది. మ్యాచులు ముగిసే కొద్దీ అభిమానులకు మజా దొరుకుతుంటే కొన్ని జట్లకేమో చావోరేవో తేల్చుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌ది సరిగ్గా ఇదే పరిస్థితి. ప్లేఆఫ్స్‌ చేరుకోవాలంటే ఆ జట్టు శనివారం దిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి తీరాల్సిందే. ఈ నేపథ్యంలో ఎవరి బలాబలాలేంటి? ఏ జట్టు వ్యూహం ఎలా ఉండబోతోంది?


Also Read: యాష్‌ తప్పేం చేయలేదు! సోషల్‌ మీడియాలో ఫాలోవర్లు పెంచుకొనేందుకే అతడిపై విమర్శలు.. గౌతీ సీరియస్‌!


ముంబయి తప్పక గెలవాలి
ఈ సీజన్లో 11 మ్యాచులాడిన దిల్లీ క్యాపిటల్స్ 8 విజయాలతో 16 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది. 11 మ్యాచులాడిన ముంబయి ఐదు మాత్రమే గెలిచి 10 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. కోల్‌కతా సైతం ఐదే గెలిచినా నెట్‌ రన్‌రేట్‌ తక్కువగా ఉండటంతో రోహిత్‌ సేన వెనకబడింది. దిల్లీ సాంకేతికంగా ప్లేఆఫ్స్‌ చేరినా అధికారికంగా మరో విజయం అందుకోవాలి. మరో రెండు మ్యాచులు మిగిలే ఉండటంతో ఇందులో ఓడినా ఫర్వాలేదు! ముంబయి పరిస్థితి మాత్రం అలా లేదు. కప్పు కొట్టాలంటే ముందీ మ్యాచ్‌ గెలవాలి. కోల్‌కతా చేతిలో ఓడిన రిషభ్‌ సేన ఈ పోరును తేలిగ్గా తీసుకోదు కాబట్టి ముంబయి కష్టపడాల్సిందే. ఆ తర్వాత హైదరాబాద్‌, రాజస్థాన్‌పై సునాయాసంగా గెలవొచ్చు!


Also Read: విరాట్‌ సరసన స్మృతి మంధాన.. పింక్‌ టెస్టులో సెంచరీ. ఔటివ్వకున్నా పెవిలియన్‌ వెళ్లిన పూనమ్‌!


మానసికంగా ముంబయిదే పైచేయి!
ఐపీఎల్‌లో దిల్లీపై ముంబయిదే పైచేయి! ఈ రెండు జట్లు 29 సార్లు తలపడితే విజయాల శాతం 16-13గా ఉంది. అంటే రోహిత్‌సేనకు పూర్తిగా ఆధిపత్యం లేదనే చెప్పాలి. అయితే చివరి ఐదు మ్యాచుల్లో నాలుగింట్లో హిట్‌మ్యాన్‌ సేన దుమ్మురేపింది. ఆ నాలుగు గతేడాదే ఆడటం గమనార్హం. అంటే రెండు లీగులు, ఒక క్వాలిఫయర్‌, ఫైనల్‌ అన్నమాట! ముంబయి మానసికంగా బలంగా ఉండటం వారికి కలిసొచ్చే అంశం.


Also Read: రైజర్స్ మళ్లీ పాత పాటే.. హైదరాబాద్‌పై ఆరు వికెట్లతో చెన్నై విజయం!


జయంత్‌ కీలకం
యూఏఈకి వచ్చాక ముంబయి తన స్థాయికి తగిన ఆట ఆడలేదు. వరుసగా మూడు మ్యాచులు ఓడి మొన్నే పంజాబ్‌పై గెలిచింది. రోహిత్‌, డికాక్‌ నిలకడగానే ఆడుతున్నారు. మిడిలార్డర్‌ పుంజుకోవాల్సిన అవసరం ఉంది. సూర్యకుమార్‌ నుంచి అభిమానులు మెరుపులు ఆశిస్తున్నారు. పొలార్డ్‌ నిలవాల్సి ఉంది. రాహుల్‌ చాహర్‌ను పూర్తిగా వినియోగించుకోవడం లేదు. బౌలర్లు పరుగులిస్తున్నారు. వారు మెరుగవ్వాలి. దిల్లీపై జయంత్‌ యాదవ్‌కు అద్భుతమైన రికార్డుంది. అంటే అతడు ఆడటం గ్యారంటీ. రిషభ్‌, అక్షర్‌, ధావన్‌, శ్రేయస్‌ను అడ్డుకోగలడు. ఈ పోరులో దిల్లీ కచ్చితంగా కొత్త వ్యూహ్యాలతో వస్తుంది. వాటిని తిప్పికొడితేనే ముంబయి హిట్టవుతుంది.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి


ఇక్కడ అశ్విన్‌ ఉన్నాడు
దిల్లీ క్యాపిటల్స్‌కు ఒత్తిడేం లేదు. ముంబయి, చెన్నై, బెంగళూరుపై ఏ ఒక్కటి గెలిచినా చాలు. ఐతే హిట్‌మ్యాన్‌ సేనను దిల్లీ ఓడించాలని వారి కన్నా ఎక్కువగా బెంగళూరు, కోల్‌కతా కోరుకుంటున్నాయి! అప్పుడే ఆ రెండింటికీ భయం ఉండదు. గాయపడ్డ పృథ్వీషా అందుబాటులోకి రావొచ్చు. అయితే మార్కస్‌ స్టాయినిస్‌ కోసం ఆ జట్టు ఎంతగానో ఎదురు చూస్తోంది. ఇవి మినహా ఆ జట్టులో ఎక్కువ మార్పులేమీ ఉండకపోవచ్చు. అశ్విన్‌ బౌలింగ్‌లో డికాక్‌, రోహిత్‌, కృనాల్‌ ఇబ్బంది పడటం దిల్లీకి కలిసొచ్చే అంశం. అయితే సూర్య అతడి బౌలింగ్‌ను ఊచకోత కోయగలడు. అతడితో జాగ్రత్తగా ఉండాలి. మిడిలార్డర్‌ బ్యాటింగ్‌ ఒక్కోసారి కుప్పకూలుతోంది. దాన్ని సరిదిద్దుకొంటే దిల్లీకి తిరుగుండదు.