ఐపీఎల్‌లో నేటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై ఆరు వికెట్లతో కోల్‌కతా విజయం సాధించింది. ఈ విజయంతో కోల్‌కతా ప్లేఆఫ్స్ వైపు ముందడుగు వేసింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 115 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత సన్‌రైజర్స్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినా కొట్టాల్సిన స్కోరు తక్కువే ఉండటంతో.. కోల్‌కతా 19.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది.
పూర్తిగా విఫలమైన బ్యాటింగ్ లైనప్
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు మొదటి ఓవర్లోనే ఎదురు దెబ్బ తగిలింది. మొదటి ఓవర్లోనే సాహాను (0: 2 బంతుల్లో) టిమ్ సౌతీ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అనంతరం ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో జేసన్ రాయ్ (10: 13 బంతుల్లో, రెండు ఫోర్లు) కూడా శివం మావి బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. ఆ తర్వాత కేన్ విలియమ్సన్ (26: 21 బంతుల్లో, నాలుగు ఫోర్లు), ప్రియం గర్గ్ (21: 31 బంతుల్లో, ఒక సిక్సర్) కలిసి స్కోరును మెల్లగా ముందుకు నడిపించారు. దీంతో పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ రెండు వికెట్లు నష్టపోయి 35 పరుగులు మాత్రమే చేసింది.
ఆ తర్వాత ఓవర్లోనే రైజర్స్‌కు మరో భారీ షాక్ తగిలింది. లేని పరుగుకు ప్రయత్నించి కేన్ విలియమ్సన్ రనౌటయ్యాడు. అనంతరం కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రాలేదు. పది ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ మూడు వికెట్లు నష్టపోయి 51 పరుగులు చేసింది. ఆ తర్వాత అబ్దుల్ సమద్ (25: 18 బంతుల్లో, మూడు సిక్సర్లు), ప్రియం గర్గ్ మినహా ఎవరూ సరిగ్గా ఆడకపోవడంతో 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 115 పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లలో సౌతీ, శివం మావి, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు తీయగా, షకీబ్‌కి ఒక వికెట్ దక్కింది.
Also Read: కోల్‌కతా మ్యాచుకు ముందు పంజాబ్‌కు షాక్! బుడగ వీడిన క్రిస్‌గేల్.. ఎందుకంటే?
పడుతూ లేస్తూ కొట్టేశారు..
మరో వైపు కోల్‌కతా ఇన్నింగ్స్ కూడా మందకొడిగానే ప్రారంభం అయింది. ఫాంలో ఉన్న వెంకటేష్ అయ్యర్‌ను (8: 14 బంతుల్లో) ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో జేసన్ హోల్డర్ అవుట్ చేశాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి కోల్‌కతా వికెట్ నష్టానికి 36 పరుగులు మాత్రమే చేసింది. ఏడో ఓవర్లో రాహుల్ త్రిపాఠి (7: 6 బంతుల్లో) కూడా రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అవుటవ్వడంతో కోల్‌కతా కష్టాల్లో పడింది. అప్పటికి జట్టు స్కోరు 38 పరుగులు మాత్రమే. అయితే ఆ తర్వాత గిల్ (57: 51 బంతుల్లో, 10 ఫోర్లు), నితీష్ రాణా(25: 33 బంతుల్లో, మూడు ఫోర్లు) కలిసి స్కోరును ముందుకు నడిపించారు. 10 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు రెండు వికెట్ల నష్టానికి 44 పరుగులు మాత్రమే.
అయితే ఆ తర్వాత సన్‌రైజర్స్ బౌలర్లు వికెట్లు తీయకపోయినా.. పరుగులను కట్టడి చేశారు. దీంతో స్కోరు వేగం కూడా మందగించింది. అయితే కోల్‌కతా సాధించాల్సిన స్కోరు తక్కువే ఉండటంతో బ్యాట్స్‌మెన్ కూడా పెద్దగా తొందర పడలేదు. అయితే ఆ తర్వాత శుభ్‌మన్ గిల్, నితీష్ రాణా అవుట్ అయినా దినేష్ కార్తీక్ ఒత్తిడికి లోను కాకుండా ఆడటంతో కోల్‌కతా 19.4 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టానికి లక్ష్యం ఛేదించింది. సన్‌రైజర్స్ బౌలర్లలో హోల్డర్ రెండు వికెట్లు తీయగా.. రషీద్, కౌల్ చెరో వికెట్ తీశారు.
Also Read: యాష్ తప్పేం చేయలేదు! సోషల్ మీడియాలో ఫాలోవర్లు పెంచుకొనేందుకే అతడిపై విమర్శలు.. గౌతీ సీరియస్!
Also Read: విరాట్ సరసన స్మృతి మంధాన.. పింక్ టెస్టులో సెంచరీ. ఔటివ్వకున్నా పెవిలియన్ వెళ్లిన పూనమ్!