ఐపీఎల్‌లో నేడు జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో ఢిల్లీపై చెన్నై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 172 పరుగులు చేయగా.. చెన్నై 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. చాలా రోజుల తర్వాత ధోని మార్కు ఫినిష్ ఈ మ్యాచ్‌లో కనిపించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్, బెంగళూరు మ్యాచ్ విజేతతో.. ఢిల్లీ క్వాలిఫయర్ 2 ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు చెన్నైతో ఫైనల్స్‌లో తలపడుతుంది.


షా, పంత్ షో..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి పృథ్వీ షా (60: 34 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించాడు. ఒక పక్క ధావన్ (7, 7 బంతుల్లో, ఒక ఫోర్) విఫలం అయినా.. మొదటి ఐదు ఓవర్లలోనే జట్టు స్కోరును 50 పరుగులకు చేర్చాడు. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ (1: 8 బంతుల్లో) కూడా వెంటనే అవుటయ్యాడు. అయితే ఆశ్చర్యకరంగా అక్షర్ పటేల్‌ను (10: 11 బంతుల్లో, ఒక ఫోర్) వన్ డౌన్‌లో పంపించి, రిషబ్ పంత్ ప్రయోగం చేసినా.. అది వర్కవుట్ అవ్వలేదు. దీంతో పది ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ మూడు వికెట్లు నష్టపోయి 79 పరుగులు చేసింది.


ఆ తర్వాత క్రీజులో కుదురుకున్న పృథ్వీ షా కూడా అవుట్ కావడంతో ఢిల్లీ కష్టాల్లో పడింది. ఈ దశలో జట్టును రిషబ్ పంత్ (51 నాటౌట్: 35 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు), హెట్‌మేయర్  (37: 24 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) ఆదుకున్నారు. వీరిద్దరూ బాగా ఆడటంతో చివర్లో ఢిల్లీ స్కోరు ఊపందుకుంది. అయితే చివరి దశలో హెట్‌మేయర్ అవుట్ కావడంతో.. చివరి ఓవర్లో కేవలం 8 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో ఢిల్లీ స్కోరు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 172 పరుగులకు పరుగులకు చేరుకుంది. చెన్నై బౌలర్లలో జోష్ హజిల్‌వుడ్ రెండు వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, డ్వేన్ బ్రేవో తలో వికెట్ తీశారు.


Also Read: డేవిడ్‌ వార్నర్‌ అంశంలో గుసగుసలెందుకు? ఏదో జరుగుతోందని సంజయ్‌ మంజ్రేకర్‌ అనుమానం!


ఫినిషర్ ఈజ్ బ్యాక్
ఇక చెన్నై బ్యాటింగ్ కూడా పేలవంగానే ప్రారంభం అయింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే ఫాఫ్ డుఫ్లెసిస్ అవుటయ్యాడు. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ (70: 50 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు), వన్ డౌన్‌లో వచ్చిన రాబిన్ ఊతప్ప (63: 44 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు) కలిసి స్కోరును ముందుకు నడిపించారు. చాన్నాళ్ల తర్వాత గ్రౌండ్‌లో కనిపించిన ఊతప్ప పూర్తి కంట్రోల్‌తో ఆడాడు. దీంతో పవర్ ప్లే ఆరు ఓవర్లలో చెన్నై వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ పదో ఓవర్‌లో ఊతప్ప 35 బంతుల్లో తన అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో 10 ఓవర్లలో జట్టు స్కోరు వికెట్ నష్టానికి 81 పరుగులకు చేరింది.


రెండో వికెట్‌కు 110 పరుగులు జోడించిన అనంతరం ఊతప్ప అవుటయ్యాడు. టూ డౌన్‌లో వచ్చిన శార్దూల్ ఠాకూర్ కూడా అదే ఓవర్లో అవుటయ్యాడు. అయితే ఆ తర్వాత రుతురాజ్ గేర్లు మార్చాడు. కొట్టాల్సిన స్కోరు ఎక్కువ ఉండటంతో భారీ షాట్లు ఆడటం ప్రారంభించాడు. ఈ క్రమంలో రాయుడు  (1: 3 బంతుల్లో) కూడా రనౌటయ్యాడు. 12 బంతుల్లో 24 కొట్టాల్సిన దశలో గైక్వాడ్ అవుట్ అవ్వడంతో మ్యాచ్ ఢిల్లీ వైపు మొగ్గినట్లు అనిపించింది. అయితే చాన్నాళ్ల తర్వాత ధోని (18 నాటౌట్: 6 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) తనలోని ఫినిషర్‌ను బయటకు తీయడంతో ఇంకో రెండు బంతులు మిగిలి ఉండగానే చెన్నై లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్స్‌కు చేరుకుంది.


Also Read: ఆఖరి బంతికి సిక్స్‌..! ఆ కిక్కులో ఆర్‌సీబీ చేసుకున్న సంబరాలు చూడండి


Also Read: మెస్సీ.. ఏడోసారి గెలుస్తాడా? రొనాల్డోతో పోటీపడుతున్న అర్జెంటీనా దిగ్గజం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి