హుజూరాబాద్ ఎన్నికల ప్రచారం వాడీవేడీగా జరుగుతోంది. కమలాపూర్ మండలం అంబాలలో బీజేపీ నేత ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కు నీళ్ల మీద ప్రేమ కన్నా వాటి వెనుక కమీషన్ల కోసమన్నారు. కేసీఆర్ ఓడిపోతేనే తెలంగాణలో ఉద్యోగాలు వస్తాయన్నారు. టీఆర్ఎస్ తాటాకు చప్పుళ్లకు ఈటల భయపడడన్నారు.
తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ గొర్లు అనుకుంటున్నారని ఈటల ఆరోపించారు. కానీ తెలంగాణ ప్రజలు అలా మోసపోరన్నారు. తనపై నాలుగు దొంగ ఉత్తరాలు పుట్టించారని మండిపడ్డారు. దళిత బంధు వద్దని రాశాను అంటే ఎన్నికల కమిషన్ చెంప చెళ్లు మనిపించిందని చెప్పారు. కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడేవాడు కాదు ఈటల రాజేందర్ అన్నారు.
'ఎన్నికల ఫలితాల తరవాత తెలంగాణలో అగ్గి పెడతా.. కేసీఆర్ పీఠం కూల్చుతా' అని ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు. హుజూరాబాద్ ప్రజలకు బీజేపీకి అండగా ఉండాలని కోరారు. హుజూరాబాద్ ప్రజలు దొంగల ముఠాను తరిమికొడుతుందన్నారు. ప్రజలు కట్టే ట్యాక్సుల మీద కేసీఆర్ బతుకుతున్నారని ఆయన ఓ కాపలాదారుడు మాత్రమే, ఓనర్ కాదని ఈటల తెలిపారు.
Also Read: నిద్రపోతున్న ఫ్యామిలీపై కూలిన పైకప్పు.. శాశ్వత నిద్రలోకి ఐదుగురు.. సీఎం దిగ్భ్రాంతి
దళితులను కేసీఆర్ మోసం చేశారు: బొడిగె శోభ
ఈటెల రాజేందర్ ప్రజల మనిషని బీజేపీ నేత బొడిగె శోభ అన్నారు. హుజూరాబాద్ ప్రజల మీద నమ్మకం లేక హరీష్ రావు, సిద్ధిపేట నియోజకవర్గ నాయకులను తీసుకువచ్చి ప్రచారం చేయిస్తున్నారనన్నారు. కేసీఆర్ దళిత బంధు ఇవ్వకపోతే ప్రజలు రాజకీయ సమాధి కడతారన్నారు. దళితులను కేసీఆర్ మోసం చేశారన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానన్న సీఎం కేసీఆర్ తాను అలా అనలేదని అసెంబ్లీ సాక్షిగా అబద్ధం చెప్పారన్నారు. 30వ తేదీ తర్వాత ఇక్కడికి వచ్చిన నాయకులు కనబడరన్నారు. మళ్లీ కనిపించేది, పనిచేసేది ఈటల రాజేందర్ అన్నారు బొడిగె శోభ. కేసీఆర్ కుటుంబంలో ఉన్న వారందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నారని, నిరుద్యోగులకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వరని ఆమె ప్రశ్నించారు.
Also Read: టెస్లాను తలదన్నే కార్ల కంపెనీ తెలంగాణలో.. ప్రదర్శనకు సూపర్ SUV, అదిరిపోయే డిజైన్‌తో..