స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'పుష్ప'. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా మొదటి భాగాన్ని ఈ ఏడాది డిసెంబర్ 17న విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో రూపొందిస్తోన్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. కొద్దిరోజుల క్రితమే ఈ సినిమా నుంచి ఆమె పాత్ర 'శ్రీవల్లి'ను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో రష్మిక.. పల్లెటూరి పిల్లగా, లంగావోణీలో పూలు పెట్టుకుంటూ కనిపించింది. 


Also Read: వాట్ అమ్మా..? వాట్ ఈజ్ దిస్ అమ్మా..? విష్ణు-ప్రకాష్ రాజ్ సెల్ఫీపై హీరో సెటైర్


ఈ సినిమా నుంచి ఇప్పటికే 'దాక్కో దాక్కో మేక' అనే పాటను రిలీజ్ చేశారు. ఐదు భాషల్లో, ఐదుగురు సింగర్లతో ఈ పాటను పాడించారు. అలానే 'శ్రీవల్లి' పై రూపొందించిన పాటను ఈ నెల 13న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ పాట ఎలా వుండబోతుందనే చిన్న వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, సింగర్ సిద్ శ్రీరామ్ కనిపించారు. 


ముందుగా ఇద్దరూ హమ్ చేస్తూ కనిపించారు. ఆ తరువాత సిద్ 'చూపే బంగారామాయనే.. శ్రీవల్లీ.. మాటే మాణిక్యమాయనే.. చూపే బంగారామాయనే.. శ్రీవల్లీ.. నవ్వే నవరత్నమాయనే' అంటూ పాట అందుకున్నాడు. ఇక పూర్తి పాటను ఈ నెల 13న విడుదల చేయబోతున్నారు. మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో మలయాళ స్టార్ నటుడు ఫహాద్ పాజిల్ నటిస్తున్నారు. ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్, సునీల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.