తెలంగాణలో మరో అంతర్జాతీయ స్థాయి ఆటోమొబైల్ పరిశ్రమ అడుగుపెట్టనుంది. అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ ట్రిటాన్‌ తెలంగాణలోని తన రెండో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో దూసుకుపోతున్న టెస్లా కంపెనీకి ట్రిటాన్‌ ఎలక్ట్రిక్‌ కార్లు టెస్లాకు గట్టిపోటీ ఇవ్వనున్నాయి. అయితే, గతంలోనే ట్రిటాన్‌ తొలి ఉత్పత్తి కర్మాగారాన్ని మహారాష్ట్రలోని పుణెలో ఏర్పాటుచేయగా.. రెండో కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయనున్నారు.


ఇందులో భాగంగా ట్రిటాన్‌ సంస్థ మేనేజ్ మెంట్ హైదరాబాద్‌లో తొలిసారిగా ట్రిటాన్‌ హెచ్‌ మోడల్‌ ఎస్‌యూవీను ప్రదర్శనకు ఉంచింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌, ట్రిటాన్‌ సంస్థ వ్యవస్థాపకుడు హిమాన్షు పటేల్‌, మాన్సుర్‌ తదితరులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను జయేష్ రంజన్ ట్వీట్ చేశారు. ట్రిటాన్‌ తన రెండో ఉత్పత్తి కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసి కంపెనీ మరొక కీలక రాయిని చేరుకుందని జయేష్‌ రంజన్‌ తెలిపారు. 






ట్రిటాన్‌ తెలంగాణలో తన రెండో కర్మాగారాన్ని నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మానుఫ్యాక్చరింగ్‌ జోన్‌ (నిమ్జ్‌-NIMZ) జహీరాబాద్‌ వద్ద ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ట్రిటాన్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం జరాసంగం మండలంలోని యెల్‌గోయ్ గ్రామం సమీపంలో భూమిని కూడా కేటాయించింది. అక్టోబర్‌ 7న ట్రిటాన్‌ సంస్థ యాజమాన్యం ప్రభుత్వం కేటాయించిన భూమిని సందర్శించింది. ట్రిటాన్‌ ఎలక్ట్రిక్ కార్ల తయారీ యూనిట్‌ కోసం సుమారు రూ.2,100 కోట్లతో పెట్టుబడి పెట్టనున్నారు.


Also Read: కొత్త వృద్ధాప్య పింఛన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్... 57 ఏళ్ల వయసు నిండిన వారు అర్హులు... ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?


ట్రిటాన్‌‌ సూపర్‌ ఎస్‌యూవీ ప్రత్యేకతలివే..!
సాధారణ ఎస్‌యూవీల కంటే ట్రిటాన్‌ హెచ్‌‌ఎస్‌యూవీ మోడల్‌ ఎక్కువ స్పేస్‌ను కలిగి ఉంది. ఈ కారు 7 కలర్లలో అందుబాటులోకి రానుంది. కంపెనీ వ్యవస్థాపకుడు హిమాన్షు పటేల్‌ ట్రిటాన్‌ హెచ్‌‌ఎస్‌యూవీ మోడల్‌ను సూపర్‌ ఎస్‌యూవీ అని అభివర్ణించారు. ట్రిటాన్ మోడల్ హెచ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 1,500 హర్స్‌పవర్‌ను ఉత్పత్తి  చేస్తోంది. ఈ కారులో 200 kWh బ్యాటరీని అమర్చారు.  ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే గరిష్టంగా 1,120 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. హైపర్‌ ఛార్జింగ్‌ సహాయంతో కేవలం 2 గంటల్లోనే బ్యాటరీలు ఛార్జ్‌ అవుతాయని అన్నారు. అదీ కాక ఈ కారు 96 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.9 సెకండ్లలో అందుకుంటుందని కంపెనీ తెలిపింది.


Also Read: నిద్రపోతున్న ఫ్యామిలీపై కూలిన పైకప్పు.. శాశ్వత నిద్రలోకి ఐదుగురు.. సీఎం దిగ్భ్రాంతి