చాన్నాళ్ల తర్వాత రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సంతోషంగా కనిపిస్తోంది. అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌ విభాగాల్లో ఇబ్బందులు తొలగిపోవడంతో హుషారుగా ఆడుతోంది. ఓడిపోతారని అనుకున్న మ్యాచులనూ ఆఖర్లో గెలిచేస్తోంది. బ్యాటింగ్‌లో శ్రీకర్‌ భరత్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌ విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పుతున్నారు. బౌలింగ్‌లో హర్షల్‌ పటేల్‌, యుజ్వేంద్ర చాహల్‌ దుమ్మురేపుతున్నారు.


Also Read: సన్‌రైజర్స్‌పై 42 పరుగులతో ముంబై విజయం.. అయినా లేదు ప్రయోజనం!


దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఆఖరి మ్యాచులోనూ బెంగళూరు గెలుస్తుందా లేదా అన్న ఉత్కంఠ కలిగింది. మాక్సీ సహకారంతో ఆంధ్రా ఆటగాడు శ్రీకర్‌ భరత్‌ అద్భుతం చేశాడు. మూడో స్థానంలో పెద్ద బాధ్యతనే తీసుకున్నాడు. 52 బంతుల్లోనే మూడు బౌండరీలు, నాలుగు సిక్సర్లతో 78 పరుగులు చేశాడు. అజేయంగా నిలిచాడు. విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పుతున్నాడు. ఎప్పట్నుంచో బలహీనపడ్డ మిడిలార్డర్‌కు అతడు వెన్నెముకగా మారాడు.


Also Read: చితక్కొట్టిన శ్రీకర్‌.. ఆఖరి బంతికి సిక్సర్‌తో దిల్లీకి షాక్‌


దిల్లీ మ్యాచులో భరత్‌ ఆడిన తీరు అందరినీ మెప్పించింది. వికెట్లు పడకుండా అతడు అడ్డుకున్నాడు. మరోవైపు చేయాల్సిన రన్‌రేట్‌ తగ్గకుండా షాట్లు కొట్టాడు. కట్టుదిట్టమైన బంతుల్ని గౌరవించాడు. మాక్సీతో కలిసి 63 బంతుల్లోనే 111 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించాడు. ఆఖరి ఓవర్లో 15 పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో ఒత్తిడిని జయించాడు. తొలి మూడు బంతుల్లో మాక్సీ 4, 2, 1 చేశాడు. ఆ తర్వాత బంతికి శ్రీకర్‌ పరుగు చేయలేదు. చివరి రెండు బంతుల్లో 8 చేయాల్సి ఉండగా ఐదో బంతికి రెండు పరుగులు తీశాడు. ఆఖరి బంతిని అవేశ్‌ వైడ్‌ వేయడంతో.. ఆ తర్వాత బంతిని స్టాండ్స్‌లో పెట్టేసి బెంగళూరుకు చిరస్మరణీయ విజయం అందించాడు.


Also Read: అంతర్జాతీయ క్రికెట్లో దూకుడు ఐపీఎల్‌లో ఎందుకు కనిపించదో..! రోహిత్‌ బ్యాటింగ్‌పై గౌతీ ఆశ్చర్యం


ఆఖరి బంతికి శ్రీకర్‌ విన్నింగ్‌ షాట్‌ కొట్టడంతో బెంగళూరు శిబిరం ఆనందంలో మునిగి తేలింది. డగౌట్లో సంబరాలు చేసుకుంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌, మిగతా కుర్రాళ్లు ఎగిరి గంతులేశారు. మరో ఎండ్‌లో ఉన్న మాక్సీ అయితే తనే గెలుపు షాట్‌ కొట్టినంత వేడుక చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ చిత్రాలు, వీడియో వైరల్‌గా మారాయి. మరి మీరూ ఆ వీడియోను చూసేయండి!