ఇండియన్ ప్రీమియర్ లీగు-2021లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పోరు ముగిసింది. ఈ సీజన్లో 14 మ్యాచులు ఆడిన ఆ జట్టు కేవలం 3 విజయాలే సాధించింది. గతంలో ఎన్నడూ లేనంత ఘోరమైన ప్రదర్శన చేయడంతో అభిమానులు నిరాశచెందారు. దానికితోడు జట్టుకు ఆడటం ఇదే చివరి సారని చెప్పడంతో వారంత బాధపడ్డారు.
సన్‌రైజర్స్ లీగ్ నుంచి నిష్క్రమించిన వెంటనే భావోద్వేగంతో నిండిన సందేశం పెట్టాడు. హైదరాబాద్ జట్టుతో తన అనుబంధం గుర్తు చేసుకున్నాడు. ఫ్రాంచైజీలోని ఆటగాళ్లతో తనకు అనుభూతులెన్నో ఉన్నాయని తెలిపాడు. జట్టుతో తన మధుర స్మృతులను నెమరువేసుకున్నాడు. అంతేకాకుండా ఇన్నాళ్లూ తనకు అండగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు.
'నాకిష్టమైన సందర్భం!! దాంతోపాటు మా ప్రయాణంలోని కొన్ని చిత్రాలివి. మాకు ఎల్లప్పుడూ అండగా నిలబడినందుకు ఆ చివరి చిత్రం ద్వారా అభిమానులకు కృతజ్ఞతలు చెబుతున్నా' అని డేవిడ్ వార్నర్ ఇన్‌స్టాలో కొన్ని చిత్రాలను పోస్ట్ చేశాడు.
హైదరాబాద్ తరఫున వార్నర్‌కు తిరుగులేని రికార్డులు ఉన్నాయి. 2014లో అరంగేట్రం చేసినప్పటి నుంచీ పరుగుల వరద పారిస్తూనే ఉన్నాడు. జట్టుకు 95 మ్యాచుల్లో 4014 పరుగులు చేశాడు. 2015లో నాయకుడిగా ఎంపికైన అతడు ఆ తర్వాత దుమ్మురేపాడు. 2016లో వీరోచితమైన ఫామ్, బ్యాటింగ్, నాయకత్వంతో ఐపీఎల్ టైటిల్ అందించాడు. అభిమానుల దృష్టిలో బాహుబలిగా నిలిచిపోయాడు.
Also Read: మెస్సీ.. ఏడోసారి గెలుస్తాడా? రొనాల్డోతో పోటీపడుతున్న అర్జెంటీనా దిగ్గజం
Also Read: డేవిడ్ వార్నర్ అంశంలో గుసగుసలెందుకు? ఏదో జరుగుతోందని సంజయ్ మంజ్రేకర్ అనుమానం!
Also Read: ఆఖరి బంతికి సిక్స్..! ఆ కిక్కులో ఆర్‌సీబీ చేసుకున్న సంబరాలు చూడండి