రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున పరుగుల వరద పారించేందుకు కారణం ఉందని ఆసీస్‌ క్రికెటర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ అంటున్నాడు. ప్రస్తుతం తన ఆలోచనా ధోరణి సానుకూలంగా ఉందని తెలిపాడు. ఆస్ట్రేలియా జట్టులో పోషించిన పాత్రనే ఇక్కడా చేపట్టాలని యాజమాన్యం సూచించిందన్నాడు. అందుకే స్వేచ్ఛగా ఆడుతున్నానని వెల్లడించాడు. పంజాబ్‌ కింగ్స్‌పై విజయం తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు.


Also Read: ఢిల్లీతో చెన్నై ఢీ.. గెలిచినవాళ్లకే టాపర్లయ్యే అవకాశం!


'పెద్ద తేడా ఏం లేదు! చక్కని పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చాను. కాస్త సమయం తీసుకొని పరిస్థితులను అర్థం చేసుకున్నా. తొలుత కొంత రిస్క్‌ తీసుకొని షాట్లు బాదేశా. ఈ ఐపీఎల్‌ సీజన్‌, ప్రొఫెషనల్‌ క్రికెట్‌లో నేను మరింత స్పష్టతతో ఉన్నాను. నా బ్యాటింగ్‌ లయ బాగుంది. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేయడం సులభం కాదు. ఓపెనర్లు శుభారంభం ఇవ్వడంతో పని తేలికవుతోంది. షార్జా వికెట్టును అర్థం చేసుకొనేందుకు కాస్త సమయం పడుతుంది' అని మాక్సీ తెలిపాడు.


Also Read: ప్లేఆఫ్స్‌కు కన్ఫర్మ్ అయిన మూడు జట్లూ ఇవే.. నాలుగో స్థానం కోసం!


'ఆస్ట్రేలియాకు సుదీర్ఘ కాలంగా ఆడుతున్నప్పుడు నా పాత్రపై స్పష్టత ఉంటుంది. ఆర్‌సీబీలోనూ నాకదే పాత్ర ఇచ్చారు. డ్రెస్సింగ్‌ రూమ్‌ వాతావరణం బాగుంది. ఈ షార్జా వికెట్‌పై నిలదొక్కుకోవడం కష్టం. బంతి జారుతోంది. ఇతర మైదానంల్లో బంతి కాస్త పైకి వస్తుంది. బ్యాక్‌ఫుట్‌పై ఆడేందుకు సమయం దొరుకుతుంది. ఎంత ఎక్కువసేపు ఆడితే అంత సునాయాసంగా పరుగులు చేయొచ్చు' అని మాక్సీ పేర్కొన్నాడు.


Also Read: పంజాబ్ పాత కథే! విజయానికి చేరువై బోల్తా! ప్లేఆఫ్స్‌ చేరిన కోహ్లీసేన


ఈ సీజన్లో మాక్స్‌వెల్‌ వీరోచిత ఫామ్‌లో ఉన్నాడు. కేవలం 12 మ్యాచుల్లోనే 407 పరుగులు చేశాడు. 40 సగటు, 145 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేస్తున్నాడు. ఐదు అర్ధశతకాలూ బాదేశాడు. అయితే పంజాబ్‌కు ఆడినప్పుడు ఇంతలా చెలరేగలేదు. ఆ ఫ్రాంచైజీకి దాదాపుగా 60+ మ్యాచులాడినా ఆరుకు మించి అర్ధశతకాలు చేయకపోవడం గమనార్హం.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి