INDW vs AUSW: భారత్‌తో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. మొదట బ్యాటింగ్ కంగారూ బ్యాటర్లు 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తరఫున ఓపెనర్ బెత్ మూనీ (54: 37 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) అర్థ సెంచరీ కొట్టేసింది. భారత్ విజయానికి 120 బంతుల్లో 173 పరుగులు కావాలి.


ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు అలీస్సా హీలీ (25: 26 బంతుల్లో, మూడు ఫోర్లు), బెత్ మూనీ (54: 37 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) కంగారూలకు శుభారంభం ఇచ్చారు. వీరు మొదటి వికెట్‌కు 52 పరుగులు జోడించారు. ఈ దశలో ప్రమాదకరంగా మారుతున్న ఈ భాగస్వామ్యాన్ని రాధా యాదవ్ విడదీసింది. అలీస్సా హీలీని అవుట్ చేసి భారత్‌కు మొదటి బ్రేక్ అందించింది.


క్రీజులో నిలదొక్కుకున్న బెత్ మూనీకి కెప్టెన్ మెగ్ లానింగ్ (49 నాటౌట్: 34 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) తోడయింది. ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డింగ్ చాలా పేలవంగా ఉంది. మెగ్ లానింగ్ ఖాతా తెరవక ముందే ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ రిచా ఘోష్ వదిలేసింది. ఆ తర్వాత స్టంపింగ్ అవకాశం కూడా చేజార్చుకున్నారు. దీనికి తోడు చాలా మిస్ ఫీల్డ్స్ కూడా అయ్యాయి. సులభంగా 15 నుంచి 20 పరుగులు మిస్ ఫీల్డ్‌ల రూపంలో కోల్పోయింది. అదే ఆస్ట్రేలియాకు భారీ స్కోరును అందించింది.


అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం బెత్ మూనీ అవుట్ అయింది. ఆ తర్వాత యాష్లే గార్డ్‌నర్‌తో (31: 18 బంతుల్లో, ఐదు ఫోర్లు) కలిసి మెగ్ లానింగ్ గేర్లు మార్చింది. చివరి ఆరు ఓవర్లలో ఆస్ట్రేలియా ఏకంగా 73 పరుగులు సాధించింది. ఇక్కడ కంట్రోల్ చేసినా 150 పరుగుల లోపే ఆస్ట్రేలియాను కట్టడి చేసి ఉండవచ్చు. కానీ బౌలర్ల వైఫల్యం కారణంగా ఆస్ట్రేలియాకు భారీ స్కోరు దక్కింది. 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 172 పరుగులు చేసింది. భారత బౌలర్లలో శిఖా పాండే రెండు వికెట్లు దక్కించుకుంది. రాధా యాదవ్, దీప్తి శర్మ చెరో వికెట్ తీసుకున్నారు.


పూజా వస్త్రాకర్ గాయం కారణంగా కీలకమైన మ్యాచ్‌కు దూరం అయింది. దీంతో తన స్థానంలో స్పిన్ బౌలర్ స్నేహ్ రాణా జట్టులోకి వచ్చింది. తను నాలుగు ఓవర్లలో 33 పరుగులు ఇచ్చింది.


ఆస్ట్రేలియా మహిళలు (ప్లేయింగ్ XI)
అలిస్సా హీలీ(వికెట్ కీపర్), బెత్ మూనీ, మెగ్ లానింగ్(కెప్టెన్), ఆష్లీ గార్డనర్, ఎల్లీస్ పెర్రీ, తహ్లియా మెక్‌గ్రాత్, గ్రేస్ హారిస్, జార్జియా వేర్‌హామ్, జెస్ జోనాస్సెన్, మేగాన్ షట్, డార్సీ బ్రౌన్


భారత మహిళలు (ప్లేయింగ్ XI)
షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), శిఖా పాండే, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా ఠాకూర్ సింగ్