Indonesia Open 2023: 


ఇండోనేసియా ఓపెన్‌ 2023లో భారత అగ్రశ్రేణి షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు కథ ముగిసింది. ప్రి క్వార్టర్స్‌తోనే టోర్నీని ముగించింది. తనకన్నా మెరుగైన ప్లేయర్‌, చైనీస్‌ తైపీ అమ్మాయి తైజు యింగ్‌ చేతిలో 18-21, 16-21 తేడాతో ఓటమి పాలైంది. పురుషుల సింగిల్స్‌లో గుంటూరు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్‌, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నారు. సహచరుడు లక్ష్య సేన్‌ను 21-17, 22-20 తేడాతో కిదాంబి, లాంగ్‌ ఆంగుస్‌ను 21-18, 21-16 తేడాతో ప్రణయ్‌ ఓడించారు.




యింగ్‌.. జింగ్‌ జింగ్‌!


బ్యాడ్మింటన్‌ చరిత్రలోనే అత్యంత మెరుగైన టెక్నికల్‌ ప్లేయర్లలో తైజు యింగ్‌ ఒకరు. కోర్టులో ఎటునుంచి ఎటువైపైనా చిటికెలో కదిలేస్తుంది. తెలివైన షాట్లతో ప్రత్యర్థిని కోర్టు మొత్తం తిప్పుతుంది. అందుకే ఆమెను ఎదుర్కోవడం ఎవరికైనా కష్టమే! ఆమెపై గెలిచేందుకు పీవీ సింధు ఎంతగానో ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. తొలి గేమ్‌లోనే ఆమె 0-4తో వెనకబడింది. ఆ తర్వాత అస్సలు కోలుకోలేదు. 13-5తో యింగ్ ఆధిక్యంలోకి వెళ్లిపోయింది. ఇలాగే చెలరేగి 19-14తో గేమ్‌ పాయింట్‌ను సమీపించింది. ఈ క్రమంలో సింధు వరుసగా మూడు పాయింట్లు సాధించినా ఫలితం లేకుండా పోయింది. రెండో గేమ్‌లో ఆమె కాస్త కష్టపడింది. 2-2, 4-4, 6-6,11-11, 13-13తో నువ్వా నేనా అన్నట్టుగా ఆడింది. అయితే స్కోరు 16-16తో ఉన్నప్పుడు యింగ్‌ వరుసగా 5 పాయింట్లు అందుకొని మ్యాచ్‌ గెలిచేసింది. సింధుపై తన రికార్డును 19-5కు పెంచుకుంది.




సేన్‌పై మస్తు రికార్డు!


లక్ష్యసేన్‌ను శ్రీకాంత్‌ కేవలం 45 నిమిషాల్లోనే ఓడించాడు. అతడిపై తన రికార్డును 3-0కు పెంచుకున్నాడు. మొదట నుంచీ సేన్‌పై అతడిదే ఆధిపత్యం. మొదటి గేమ్‌లో వీరిద్దరూ నువ్వానేనా అన్నట్టుగానే ఆడారు. స్కోరు 4-4తో సమంగా ఉన్నప్పుడు శ్రీకాంత్‌ వరుసగా పాయింట్లు గెలిచి 8-4తో ఆధిపత్యం చెలాయించాడు. ఈ క్రమంలో సేన్‌ పుంజుకొని 10-10, 14-14, 17-17తో స్కోరు సమం చేశాడు. వెంటవెంటనే నాలుగు పాయింట్లు సాధించిన కిదాంబి గేమ్‌ను గెలిచేశాడు. రెండో గేమ్‌లో 13-13తో సమంగా ఉన్నప్పుడు శ్రీకాంత్‌ 6 పాయింట్లు గెలిచి 19-13తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లాడు. గేమ్‌తో పాటు మ్యాచునూ గెలిచేశాడు.




అటాకింగ్‌ ప్రణయ్‌!


ప్రి క్వార్టర్స్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ డామినేటింగ్‌ గేమ్‌ ఆడాడు. ఏడో సీడ్‌గా బరిలోకి దిగిన అతడు 21-18, 21-16తో హాంకాంగ్‌ షట్లర్‌ ఎన్‌జీ కా లాంగ్‌ ఆంగుస్‌ను చిత్తు చేశాడు. మొదటి గేమ్‌లో వీరిద్దరూ 9-9, 15-15తో సమంగా నిలిచారు. అయితే ప్రణయ్‌ వరుసగా పాయింట్లు సాధించి గేమ్‌ గెలిచేశాడు. రెండో గేమ్‌లో మరింత అటాక్‌ చేశాడు. 3-3, 9-9తో స్కోరు సమానంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత స్మాష్లతో విరుచుకుపడ్డాడు. వరుసగా ఐదు పాయింట్లు సాధించి ఆధిక్యాన్ని 14-9కి పెంచుకున్నాడు. అదే ఊపులో మ్యాచ్‌ పాయింట్‌ కైవసం చేసుకున్నాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌శెట్టి 21-17, 21-15 తేడాతో చైనా జోడీ హీ జి టింగ్‌, జౌ హావో డాంగ్‌ను ఓడించారు.