Cyclone Biparjoy:
జామ్‌నగర్‌లో 5గురు మృతి
బిపార్‌జాయ్ తుపాను అప్పుడే విధ్వంసం మొదలు పెట్టింది. గుజరాత్ తీర ప్రాంతాలకు చేరుకుంటున్న సమయంలో ఐదుగురి ప్రాణాలను బలి తీసుకుంది. జామ్‌నగర్‌లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 5గురు ప్రాణాలు కోల్పోయినట్టు NDRF వెల్లడించింది. ప్రజల ప్రాణాలను కాపాడటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ టీమ్స్‌తో పాటు ప్రత్యేకంగా 18 బృందాలను సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది.
"తుపాను తాకిడికి కొండ చరియలు విరిగి పడ్డాయి. జామ్‌నగర్‌లో ఇప్పటికే కొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నార్త్,సౌత్ ఏరియాల్లో టీమ్స్ రెడీగా ఉన్నాయి. రాజ్‌కోట్‌లో 2 టీమ్స్, జామ్‌నగర్‌లో ఓ టీమ్ సిద్ధంగా ఉంది. వీటితో పాటు 4-5 రిజర్వ్ టీమ్స్‌ని ఏర్పాటు చేశాం. ఇళ్లు ధ్వంసం కాకుండా చూడడమే మా ముందున్న అతి పెద్ద సవాలు. అలలు 3-6 మీటర్ల ఎత్తులో ఎగిసిపడే ప్రమాదముంది. వీలైనంత త్వరగా పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం"
- ఎన్‌డీఆర్‌ఎఫ్
పెద్ద ఎత్తున ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు భారీ షిప్స్‌ని పంపించింది NDRF. కొందరు గర్భిణిల పరిస్థితి విషమంగా ఉండటం వల్ల ఆసుపత్రులకు తరలించారు. దాదాపు 15 ప్రాంతాల్లో రిజర్వ్ టీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ సంస్థలు కూడా సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నాయి.
25 ఏళ్ల తర్వాత గుజరాత్ తీరాన్ని దాటబోతున్న తొలి తుపాను బిపార్జోయ్. గుజరాత్ తర్వాత రాజస్థాన్‌కు చేరుకునే అవకాశం కూడా ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ తుఫాను గత 10 సంవత్సరాల్లో తుపానుల రికార్డును బద్దలు కొట్టనుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బిపర్జోయ్ తుపాను వల్ల ఇప్పటి వరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది అరేబియా సముద్రంలో ఏర్పడిన తొలి తుపాను బిపర్జోయ్.. వేగంగా తీవ్ర తుపానుగా మారింది. తుపాను కారణంగా జూన్ 15న అంటే ఈరోజు పిడుగులు పడే అవకాశం ఉంది. జూన్ 15వ తేదీన తుపాను జఖౌ ఓడరేవు (గుజరాత్), మాండ్వి (గుజరాత్), కరాచీ (పాకిస్తాన్) మీదుగా మధ్యాహ్నం వరకు తీరం దాటబోతోంది. జూన్ 16న రాజస్థాన్ చేరుకునే అవకాశం ఉంది. ఐఎండీ ప్రకారం గరిష్ట గాలి వేగం 125 - 135 కిలోమీటర్ల వేగం నుంచి 150 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. ప్రాణనష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడుతున్నాయి.