Cyclone Biperjoy: 25 ఏళ్ల తర్వాత గుజరాత్ తీరాన్ని దాటబోతున్న తొలి తుపాను బిపార్జోయ్. గుజరాత్‌ తర్వాత రాజస్థాన్‌కు చేరుకునే అవకాశం కూడా ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ తుఫాను గత 10 సంవత్సరాల్లో తుపానుల రికార్డును బద్దలు కొట్టనుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బిపర్జోయ్ తుపాను వల్ల ఇప్పటి వరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది అరేబియా సముద్రంలో ఏర్పడిన తొలి తుపాను బిపర్జోయ్.. వేగంగా తీవ్ర తుపానుగా మారింది.


తుపాను కారణంగా జూన్ 15న అంటే ఈరోజు పిడుగులు పడే అవకాశం ఉంది. జూన్ 15వ తేదీన తుపాను జఖౌ ఓడరేవు (గుజరాత్), మాండ్వి (గుజరాత్), కరాచీ (పాకిస్తాన్) మీదుగా మధ్యాహ్నం వరకు తీరం దాటబోతోంది. జూన్ 16న రాజస్థాన్ చేరుకునే అవకాశం ఉంది. ఐఎండీ ప్రకారం గరిష్ట గాలి వేగం 125 - 135 కిలోమీటర్ల వేగం నుంచి 150 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 


వాతావరణ శాఖ ప్రకారం.. తుపాను మంగళవారం కొంత బలహీనపడింది. అయితే ఇది ఇప్పటికీ ప్రమాదకరంగానే ఉంది. ఈ తుపాను జూన్ 15 మధ్యాహ్నం కచ్ జిల్లాలోని జఖౌ ఓడరేవును తాకనుంది. ఈ తుఫాను తాకిడి కారణంగా గంటకు 150 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను కారణంగా గుజరాత్, ముంబై తీర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కొనసాగుతోంది. గుజరాత్, మహారాష్ట్రల్లో ఇప్పటివరకు 7 మరణాలు నమోదయ్యాయి.


జూన్ 11వ తేదీ నుంచి బిపర్ జోయ్ తీవ్ర తుపానుగా మారింది. భారత వాతావరణ శాఖ ప్రకారం జూన్ 12వ తేదీ ఉదయం 11.30 గంటల వరకు గాలి వేగం గంటకు 165 - 175 నుంచి 190 కిలో మీటర్లు ఉంది. జూన్ 10వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు తుఫాను అత్యంత తీవ్రమైన తుపానుగా మారుతుందని ఐఎండీ హెచ్చరించింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం జూన్ 11వ తేదీ ఉదయం 5.30 గంటలకు తీవ్ర తుపానుగా మారడంతో పాటు ప్రమాదకరంగా కొనసాగుతోంది. 


గుజరాత్‌లో బిపర్జోయ్ ప్రభావం.. ఆరావళి జిల్లాలో భారీ వర్షాలు


గుజరాత్‌లోని పలు జిల్లాల్లో జూన్ 14వ తేదీ నుంచే బిపర్జోయ్ తుపాను ప్రభావం కనిపించడం ప్రారంభించింది. దీంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఆరావళి జిల్లాలో పెద్ద ఎత్తున వర్షం కురుస్తోంది. గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన 17 బృందాలు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన 13 బృందాలు ప్రభావిత ప్రాంతంలో మోహరించాయి. గుజరాత్‌లోని 21 వేలకుపైగా పడవలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కచ్ జిల్లాలో 144 సెక్షన్ విధించారు. జూన్ 14 నుంచి 15 వరకు గుజరాత్‌లోని కచ్, ద్వారక, జామ్‌నగర్, పోర్‌బందర్, రాజ్‌కోట్, మోర్బి,  జునాగఢ్‌లలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా గుజరాత్‌లోని కందల్ పోర్ట్‌ను సందర్శించారు. తుపాను తీవ్రతను గమనించిన ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించారు.


గుజరాత్‌లోని మొత్తం 8 జిల్లాల్లో అలర్ట్ ప్రకటించారు. వీటిలో కచ్, రాజ్‌కోట్, భావ్‌నగర్, పోర్‌బందర్, గిర్-సోమ్‌నాథ్, ద్వారక, జఖౌ, జఫ్రాబాద్ ఉన్నాయి. 25 ఏళ్ల తర్వాత గుజరాత్ తీరాన్ని దాటిన తొలి తుపాను బిపార్జోయ్. గంటకు 48-63 కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ గాలి వేగంతో వచ్చే తుపానుల్లో ఇది ఐదోది. గత 58 ఏళ్లలో జూన్‌లో అరేబియా సముద్రంలో వృద్ధి చెందిన మూడో 'అత్యంత తీవ్రమైన' తుపానుగా బిపర్జోయ్ రికార్డు సృష్టించింది. 


ఈ తుపాను ప్రభావం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో?


సైక్లోన్ బిపర్జోయ్ ఇటీవలి కాలంలో ఎక్కువ కాలం కొనసాగిన తుపాను. 6 రోజుల క్రితం ఏర్పడిన ఈ తుపాను ఇంకా ఉద్ధృత స్థాయికి చేరుకోలేదని చెప్పొచ్చు. ఇది 10 రోజుల పాటు కొనసాగుతుందని అంచనా. గత 10 సంవత్సరాల‌్లో ఏర్పడిన తుపానుల వ్యవధితో పోలిస్తే ఇది అత్యధికం. గ్లోబల్ వార్మింగ్ కారణంగా అరేబియా సముద్రంలో తుపానులు మరింత తీవ్రంగా మారుతున్నాయని ఐఐటీ మద్రాస్ అధ్యయనంలో తేలింది. ఈ తుపాను భారతదేశం, పాకిస్తాన్ రెండింటికీ ఈ సంవత్సరం అత్యంత తీవ్రమైన తుపానుగా మారింది. 2013లో పైలీన్ తుఫాను వచ్చింది. ఈ తుఫాను 9 రోజుల పాటు కొనసాగింది.


అరేబియా సముద్రం మీదుగా 2019లో ఏర్పడిన అత్యంత తీవ్రమైన తుఫాను క్యార్ జీవిత కాలం 9 రోజుల 15 గంటలు. సైక్లోన్ బిపర్జోయ్ 126 గంటల పాటు కేటగిరీ 1 (అత్యంత ప్రమాదకరమైన) తుపానుగా పరిగణిస్తున్నారు. జేటీడబ్ల్యూసీ (జాయింట్ టైఫూన్ వార్నింగ్ సెంటర్) ప్రకారం 1982లో కేటగిరీ-1 తుపాను బలం గంటకు 120 కి.మీ. బిపర్జోయ్ తుపానులో గాలి వేగం గంటకు 165-175 నుంచి 190 కి.మీ.


రుతుపవనాలపై తుఫాను ప్రభావం ఏమిటి?


స్కైమెట్ ప్రకారం.. ఈ తుపాను కారణంగా రుతుపవనాల విస్తరణ ఆలస్యం కానుంది. రుతుపవనాల సమయంలో భారత్‌లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ ఇంతకు ముందస్తుంగా పేర్కొంది.