Cyclone Biperjoy: ప్రస్తుతం దేశంలోని పశ్చిమ తీర ప్రాంతాల్లో 'బిపర్ జోయ్' తుపానుపై హెచ్చరిక కొనసాగుతోంది. తుపాను సమయంలో బలమైన గాలులు వీయడం, వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉంది. ముంబయి, గోవా, పోర్ బందర్, కరాచీ సహా పరిసర ప్రాంతాలపై తుపాను ప్రభావం చూపవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది అరేబియా సముద్రంలో ఏర్పడిన తొలి తుఫాను ఇదేనని వాతావరణ శాఖ చెబుతోంది. సముద్రంలో ఏం జరుగుతుందో, అటువంటి భీకర తుఫానులు తరచుగా ఎందుకు ఏర్పడతాయి, ఆపై భూమిపైకి వచ్చి ఎందుకు విధ్వంసం సృష్టిస్తాయి?
అరేబియా సముద్రంలో తుఫానులు తక్కువ..!
అరేబియా సముద్రం కంటే బంగాళాఖాతంలో తుఫానులు ఎక్కువగా ఏర్పడతాయని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ శాస్త్రవేత్త రాక్సీ మాథ్యూ కోల్ చెప్పారు. కానీ ఇప్పుడు అరేబియా సముద్రంలో కూడా పరిస్థితి మారిపోయిందని అంటున్నారు. వాాతావరణం హీటెక్కిందని అందుకే ఇక్కడ మరింత తీవ్రతతో తుపానులు ఏర్పడుతాయని అభిప్రాయపడుతున్నారు.
సముద్రంలో తుపానులు ఎందుకు ఏర్పడతాయి?
సముద్రాలలో పెను తుపానులకు గ్లోబల్ వార్మింగ్ ప్రధాన కారణమనే వాదన బలపడుతోంది. గ్రీన్ హౌస్ వాయువుల వల్ల పెరిగే వేడిలో 93 శాతం మహా సముద్రాలు గ్రహిస్తాయని ఐపీసీసీ నివేదిక చెబుతోంది. దీని కారణంగా సముద్రాల ఉష్ణోగ్రత కూడా ప్రతి సంవత్సరం పెరుగుతోంది. అటువంటి పరిస్థితిలో ఇక్కడ ఏర్పడే బిపార్ జోయ్ వంటి ఉష్ణ మండల తుపానుల సంఖ్య, తీవ్రత కూడా పెరుగుతున్నాయి. బిపర్ జోయ్ వంటి తుపానులు సముద్రాల వెచ్చని భాగంలో మాత్రమే ఏర్పడతాయి. ఈ భాగం సగటు ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో తుఫానులు శక్తిమంతంగా మారుతాయి. ఆ తర్వాత ముందుకు దూసుకెళ్తాయి అలా అవి భూమిపైకి వచ్చి విధ్వంసం సృష్టిస్తాయి.
ఇలాంటి తుపానులు, ప్రకృతి విపత్తుల సంగతి భారతదేశంలో కచ్చితత్వంతో ముందే అంచనా వేయగలుగుతున్నామని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని కారణంగా రిలీఫ్, డిజాస్టర్ రెస్క్యూ టీమ్ అలర్ట్‌గా ఉంటోందని ప్రభావిత ప్రాంతాల ప్రజలను సకాలంలో సురక్షిత ప్రదేశాలకు చేరుస్తున్నామని అంటున్నారు.
ఇప్పటికే 50 వేల మందిని తాత్కాలిక ఆశ్రయాలకు తరలించిన అధికారులు
బిపర్జోయ్ తుపాను కారణంగా సౌరాష్ట్ర, కచ్‌లలో అలర్ట్ ప్రకటించారు. కచ్ జిల్లాలోని జఖౌ ఓడరేవు సమీపంలో శక్తివంతమైన తుపాను 'బిపార్జోయ్' తీరం దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే గుజరాత్ తీర ప్రాంతాల నుంచి 50 వేల మందిని తాత్కాలిక శిబిరాలకు తరలించారు. వాయుగుండం గుజరాత్ తీరం వైపు దూసుకు రావడంతో సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలో బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాను గురువారం సాయంత్రం "తీవ్రమైన తుఫానుగా" తీరం దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గరిష్ట గాలి వేగం గంటు 150 కిలో మీటర్లకు చేరుకుంటుందని తెలిపారు.