కోల్‌కతా విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ ఆవరణలో బుధవారం రాత్రి  అగ్నిప్రమాదం జరిగింది. కోల్‌కతా ఎయిర్ పోర్టులోని 3సి డిపార్చర్ టెర్మినల్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం. అయితే మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ప్రాణ భయంతో పరుగులు పెట్టారు. అక్కడ ఇప్పటివరకు ప్రాణనష్టం జరగలేదు. 


సమాచారం అందుకున్న వెంటనే రెండు ఫైరింజన్లు ఎయిర్ పోర్టులో డిపార్చర్ టర్మినల్ కు చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. 3సి టెర్మినల్ భవనంలో సెక్యూరిటీ చెక్ ఏరియా సమీపంలో రాత్రి 9.20 గంటలకు మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు చెబుతున్నారు. ఫైరింజన్ సిబ్బంది హుటాహుటీన అక్కడికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. దాదాపు 30 నిమిషాల పాటు శ్రమించి మంటల్ని ఆర్పివేసినట్లు ఆనందబజార్ పత్రికా పేర్కొంది. ప్రశాంతంగా ఉండే ఎయిర్ పోర్టులో ఒక్కసారిగా అగ్నిప్రమాదం జరగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. 






బెంగాల్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ మంత్రి సుజిత్ బోస్ ఈ అగ్నిప్రమాదంపై స్పందించారు. 3 సి టర్మినల్ లో మంటలు చెలరేగాయని చెప్పారు. కానీ సీఐఎస్ఎఫ్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటల్ని అదుపులోకి తెచ్చారని చెప్పారు.  అగ్నిప్రమాదం కారణంగా విమానాశ్రయ టెర్మినల్ కార్యకలాపాలు కొద్దిసేపు నిలిపివేశారు. చెక్ ఇన్ ప్రక్రియ తిరిగి పది గంటల 15 నిమిషాలకు ప్రారంభించినట్లు వివరించారు.