Indian Womens Hockey Coach: భారత మహిళల హకీ జట్టు కోచ్‌(Indian womens hockey coach) షాప్‌(Janneke Schopman) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మహిళలను గౌరవించే దేశం నుంచి వచ్చానని. కానీ అదే గౌరవాన్ని తాను ఇక్కడ పొందలేకపోతున్నాని నెదర్లాండ్స్‌కు చెందిన షాప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దేశంలో మహిళలకు చాలా గౌరవం ఇస్తారని కానీ హాకీ ఇండియా తనకు ఎలాంటి గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు. భారత్‌లో పని చేయడం ఎంతో కష్టమని  కూడా షాప్‌ మన్‌ అన్నారు. భారత మహిళల కోచ్‌గా రెండున్నరేళ్ల తన పదవీ కాలంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని ఈ మాజీ దిగ్గజ క్రీడాకారిణి వాపోయింది. భారత్‌లో తాను ఎంతో ఒంటరిగా ఫీలవుతున్నానని వెల్లడించింది. బీజింగ్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన నెదర్లాండ్స్‌ జట్టులో సభ్యురాలైన షాప్‌మెన్‌... హాకీ ఇండియా మహిళల జట్టుపై పక్షపాతం చూపుతోందని విమర్శించింది. పురుషుల జట్టును ఒకలా.... మహిళల జట్టును ఇంకోలా చూస్తోందని మండిపడింది. 




 

మహిళల జట్టుకు నిరాశే

భారత మహిళల హాకీ జట్టుకు నిరాశే ఎదురైంది. జపాన్ చేతిలో ఓటమితో భారత హాకీ జట్టు పారిస్ ఒలింపిక్స్ ఆశలు గల్లంతయ్యాయి. హాకీ ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌ టోర్నీ(Hockey Olympic Qualifiers)లో జపాన్ తో జరిగిన కీలక పోరులో 0-1 తేడాలో భారత మహిళల జట్టు ఓటమి పాలైంది. దాంతో క్వాలిఫయర్ టోర్నీలో నాలుగో స్థానానికి పరిమితమైన మహిళల జట్టు పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించలేదు. తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు పారిస్ ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్నాయి. 

 

అర్జున అవార్డీపై రేప్‌ కేసు

భారత హాకీ జట్టు(Indian hockey player) సభ్యుడు, అర్జున అవార్డు గ్రహీత(Arjuna Award) వరుణ్‌ కుమార్‌(Varun Kumar)పై కేసు నమోదైంది. పెళ్లి పేరుతో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ యువతి ఫిర్యాదు చేశారు. దీంతో బెంగళూరు(Bengaluru) పోలీసులు కేసు నమోదు చేశారు. గత ఐదేళ్లుగా వరుణ్‌ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కర్ణాటకకు చెందిన ఓ యువతికి 2019లో ఇన్‌స్టాగ్రామ్‌లో వరుణ్‌ కుమార్‌ పరిచయమయ్యాడు. అప్పుడు ఆమె వయసు 17 ఏళ్లు. బెంగళూరులో హాకీ మ్యాచ్‌ల కోసం వచ్చినప్పుడు వరుణ్ కలిసేవాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకున్నాడని బాధితురాలు ఆరోపించారు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి గత ఐదేళ్లుగా వరుణ్‌ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించారు. బెంగళూరులోని శాయ్‌ స్టేడియానికి వచ్చిన సమయంలో వరుణ్‌ తనతో శృంగారంలో పాల్గొనేవాడని ఆరోపించారు. ప్రస్తుతం తన వయసు 22 ఏళ్లు అని తెలిపింది. హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన వరుణ్‌.. పంజాబ్‌లోని జలంధర్‌లో నివసిస్తున్నాడు. అతడిని విచారించేందుకు కర్ణాటక పోలీసుల బృందం జలంధర్‌ వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. హాకీ ఇండియా లీగ్‌లో పంజాబ్‌ వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వరుణ్‌.. జాతీయ జట్టులోనూ ఆడాడు. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన భారత హాకీ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.