ఉపఖండంలో వెస్టిండీస్‌ పర్యటన షెడ్యూల్లో మార్పు జరిగే అవకాశం కనిపిస్తోంది! దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు పెరగడం, ఒమిక్రాన్‌కు వేగంగా వ్యాపించే గుణం ఉండటంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని తెలిసింది. ఆరు మ్యాచులకు ఆరు వేదికలు కాకుండా రెండింటికే  పరిమితం చేయాలని అనుకుంటోంది.


ప్రస్తుతం టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోంది. టెస్టు సిరీసును ముగించింది. వన్డే సిరీసు మరో నాలుగు రోజుల్లో పూర్తవుతుంది. ఆ తర్వాత భారత జట్టు స్వదేశానికి తిరిగొచ్చి వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనుంది.


కరోనా కేసుల పెరుగుదలతో బీసీసీఐ పర్యటనలు, షెడ్యూలు కమిటీ బుధవారం వర్చువల్‌గా సమావేశమైంది. బీసీసీఐ సీఈవో హేమంగ్‌ అమిన్‌తో పాటు కమిటీలోని నలుగురు సభ్యులు ఇందులో పాల్గొన్నారు. ఆఖర్లో బీసీసీఐ అధ్యక్ష్యకార్యదర్శులు గంగూలీ, జే షా మీటింగ్‌లో జాయిన్‌ అయ్యారు.


వెస్టిండీస్‌ ఆడే ఆరు మ్యాచులకు ఆరు వేదికలను ఏర్పాటు చేయాలని బీసీసీఐ మొదటి నిర్ణయించింది. వేర్వేరు ప్రాంతాలకు తిరిగితే కరోనా సోకే ప్రమాదం ఉండటంతో వేదికల సంఖ్యను రెండుకు తగ్గిస్తోందని బోర్డు వర్గాలు ఏబీపీకి తెలిపాయి.  సురక్షితమైన బయో బుడగలు ఏర్పాటు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నాయి. అహ్మదాబాద్‌, కోల్‌కతాలో మ్యాచులు ఉంటాయని తెలుస్తోంది. టీ20 సిరీసుకు ఒకటి, వన్డేలకు మరొకటి సిద్ధం చేస్తారని సమాచారం.


'ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఆరు వేర్వేరు వేదికల్లో మ్యాచులకు ఆతిథ్యమివ్వడం కష్టం. ఆటగాళ్లు, అధికారుల ఆరోగ్యానికి మరింత ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వారిని కొవిడ్‌ రిస్క్‌లోని నెట్టడం మంచిది కాదు. అందుకే అన్ని మ్యాచులను రెండు వేదికల్లోనే నిర్వహించాలని నిర్ణయించాం' అని బీసీసీఐ వర్గాలు ఏబీపీకి తెలిపాయి. తేదీలను కూడా ఒక రోజు వెనక్కి జరుపుతారని సమాచారం. ఫిబ్రవరి 12న జరగాల్సిన తొలి వన్డేను 13కు, 15న నిర్వహించే తొలి టీ20ని 16కు జరుపుతారని తెలుస్తోంది.


Also Read: Ind vs SA, 1st ODI Highlights: కొంప ముంచిన మిడిలార్డర్.. శార్దూల్ పోరాటం సరిపోలేదు.. మొదటి వన్డేలో భారత్ పరాజయం!


Also Read: SA vs IND, 1st ODI: తగ్గేదే లే..! బవుమాతో విరాట్ కోహ్లీ మాటల యుద్ధం!


Also Read: Glenn Maxwell: మెల్‌బోర్న్‌లో మాక్స్‌వెల్ అరాచకం.. బౌండరీలతోనే ఏకంగా 112 పరుగులు.. ఆర్సీబీ రికార్డు మూడో స్థానానికి.. అయినా హ్యాపీనే!