ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు భగ్గుమన్నారు. ఇటీవలే ప్రకటించిన కొత్త పీఆర్సీ తమకు ఎంత మాత్రం అంగీకారం కాదంటూ రోడ్డెక్కారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నిరసన బాట పట్టాయి. నిన్న నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరైన ఉద్యోగులు ఇవాళ ధర్నాలు చేస్తున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు చేపట్టిన ఆందోళనలు కొన్ని చోట్ల తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తోంది. ప్రభుత్వం అర్థరాత్రి తీసుకొచ్చిన పీఆర్సీ జీవోలను వెంటనే ఉపసంహరించుకొని పాత జీతాలే ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చలో కలెక్టరేట్ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి.  


పీఆర్సీ, సిపిఎస్ విషయంలో‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వేంటనే రద్దు చేయాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాలు ఐక్య వేదిక ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ ముట్టడికి దిగ్గాయి. జిల్లా నలుమూల నుంచి భారీ ఎత్తున వచ్చిన ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయ, ఉద్యోగులను పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఉపాధ్యాయ సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..


కృష్ణా,గుంటూరు క‌లెక్ట‌రేట్‌ల వద్ద కూడా ఇదే పరిస్థితి కనిపించింది. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులను దగా చేసిందంటూ పెద్ద ఎత్తున ఉద్యోగులు నినాదాలు చేశారు. ఫిట్మెంట్ విషయంపై ప్రభుత్వం పునరలోచించాలని రిక్వస్ట్ చేశారు. చీకటి జివోలు1,2,8,9ను వెంటనే రద్దు చేయాలన్నారు.  గుంటూరు క‌లెక్ట‌రేట్ వ‌ద్ద ఎమ్మెల్సీ ల‌క్ష్మ‌ణ‌రావును పోలీసులు అరెస్టు చేశారు. 


కృష్ణా, గుంటూరులో ఉపాధ్యాయ సంఘాలకు రైతు సంఘాలు మద్దతు తెలిపాయి. దీంతో భారీ మోహరించిన పోలీసులు నలువైపులా మార్గాలు బారికేడ్లతో మూసివేశారు. దీంతో కాసేపు ఉద్రిక్తంగా కలెక్టరేట్ పరిసర ప్రాంతాలు మారాయి. ఉపాధ్యాయుల నినాదాలతో కలెక్టరేట్ దద్దరిల్లింది. కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన ఉపాధ్యాయ సంఘాల నాయకులను అరెస్ట్ చేసి పోలీసు స్టేషనుకు తరలించారు పోలీసులు.  అరెస్టు చేసిన వారితో మచిలీపట్నంలోని పోలీస్ స్టేషన్లు అన్నీ నిండిపోవడంతో గూడూరు, గుడ్లవల్లేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు.


శ్రీకాకుళం జిల్లాలోనూ అదే పరిస్థితి కనిపించింది. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుందుకు ఉద్యోగులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 80 ఫీట్ రోడ్డు, సంతోషి మాతా గుడి, అరసవల్లి మీదుగా కలెక్టరేట్ కు చేరుకునే మార్గాలన్నింటినీ పోలీసులు బారికేడ్లతో మూసివేశారు. ఓ దశలో పోలీసులకు ఉద్యోగుల మధ్య తోపులాట జరిగింది. ఇలాంటి పరిస్థితి ఊహించిన పోలీసులు ముందుగానే జిల్లా ఎన్జీఓ నేతలను అదుపు లోకి తీసుకున్నారు. 


ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఆధ్వర్యంలో జరిగిన ధర్నాతో కర్నూలు కలెక్టర్ కార్యాలయం వద్ద కాసేపు అలజడి రేగింది. కొత్త జీవో కాపీలను తగలపెట్టిన ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. దీంతో వారిని పోలీసులు అడ్డుకోవడాన్ని ఉద్యోగులు తప్పుపట్టారు. తమతో కలిసి రావాలని విజప్తి చేశారు.


కడప కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ఉద్యోగ సంఘాలు విఫలయత్నం చేశాయి. ఈ టైంలోనే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. ముళ్ళ కంచె బారికేడ్లు తోసుకోని లోనికి చోరబడే యత్నం చేశారు ఉద్యోగులు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. పోలీసులు భారీ ఎత్తున మొహరించినా కలెక్టరేట్‌లోకి ఉద్యోగులు చొచ్చుకెళ్లారు. 


శుక్రవారం సమ్మె నోటీసు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే నిర్ణయించాయి. సీఎస్‌ను క‌ల‌సి స‌మ్మె నోటీస్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించాయి. ఉద్యోగ సంఘాల‌న్నీ క‌ల‌సి ప్ర‌త్యేక స‌మావేశాన్ని ఏర్పాటు చేసుకునేందుకు స‌మాయ‌త్తం అవుతున్నాయి. ఇప్ప‌టికే ఏపీ జేఏసి, అమ‌రార‌వ‌తి జేఏసీలు విడివిడిగా కార్య‌వ‌ర్గ స‌మావేశాలు నిర్వ‌హించి నిర్ణ‌యం తీసుకోనున్నాయి. అనంత‌రం అన్ని సంఘాలు క‌లిసి భ‌విష్య‌త్ ఉద్య‌మాన్ని ప్లాన్ చేయ‌బోతున్నాయి.


ఏపీ సీఎస్ విడుద‌ల చేసిన నివేదిక త‌రువాత ఉద్యోగ సంఘాలు మ‌రింత సీరియ‌స్‌గా ఉద్య‌మాన్ని రూపొందించేందుకు నిర్ణ‌యం తీసుకున్నాయి. సీఎస్ స్దాయిలో అధికారి వాస్తవ లెక్కలు చెప్పలేదని.. ఐఎఎస్ అదికారుల సంఘం చేసిన వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌ట్టాయి ఉద్యోగ సంఘాలు. ఈ పరిస్థితుల్లోనే ఉద్య‌మం మ‌రింత వేడెక్కింది. 


Also Read: సమ్మెలోకి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు.. 21న సీఎస్‌కు నోటీసు !


Also Read: కరోనాతో ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయింది.. కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గవు


Also Read: ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ బిగ్ షాక్! డిమాండ్లు పట్టించుకోకుండానే వరుస జీవోలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.