టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మరో అరుదైన రికార్డు బద్దలు కొట్టాడు. వన్డే క్రికెట్లో విదేశాల్లో అత్యధిక పరుగులు చేసిన భారతీయుడిగా నిలిచాడు. దిగ్గజ క్రికెటర్లైన సచిన్‌ తెందూల్కర్‌, మహేంద్ర సింగ్ ధోనీ, రాహుల్‌ ద్రవిడ్‌, సౌరవ్‌ గంగూలీని వెనక్కినెట్టేశాడు. దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో అతడీ ఘనత అందుకున్నాడు.


దక్షిణాఫ్రికాపై ఛేదనలో విరాట్‌ కోహ్లీ (51; 63 బంతుల్లో 3x4) తొమ్మిది పరుగులు చేయగానే సచిన్‌ను అధిగమించాడు. భారత్‌ తరఫున విదేశాల్లో వన్డేల్లో 5108 పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతకు ముందు సచిన్‌ (5065)ను వెనక్కి నెట్టేశాడు. ఇక ఎంఎస్‌ ధోనీ (4520), రాహుల్‌ ద్రవిడ్‌ (3998), సౌరవ్‌ గంగూలీ (3468) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. విరాట్‌ రికార్డును బద్దలు చేయడంలో ఇప్పట్లో ఎవరికీ సాధ్యమయ్యే పనికాదు!


ఇన్నాళ్లు టీమ్‌ఇండియా కెప్టెన్‌గా ఉన్న విరాట్‌ కోహ్లీ దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో ఒక సాధారణ ఆటగాడిగా ఆడాడు. దాంతో అందరి చూపూ అతడి వైపే ఉంది. మునుపటితో పోలిస్తే అతడు మైదానంలో అంత చురుకుగా కనిపించలేదు. కొన్ని బంతులు మిస్‌ఫీల్డ్‌ కూడా అయ్యాయి. అయితే జట్టులోని ఆటగాళ్లతో మాత్రం కలివిడిగానే ఉన్నాడు. వికెట్లు తీస్తున్నప్పుడు సహచరులను ఉత్తేజపరుస్తూ కనిపించాడు. అవసరమైనప్పుడు మాత్రం ప్రత్యర్థిని కవ్వించేందుకు మాత్రం విరాట్‌ వెనుకాడలేదు. ఎప్పటిలాగే 'తగ్గేదే లే' అన్నట్టు ప్రవర్తించాడు. చక్కని షాట్లు బాదుతూ అర్ధశతకం చేసిన అతడు అభిమానులను కాస్త నిరాశపరిచాడు! ఎందుకంటే అర్ధశతకాన్ని సెంచరీగా మలుస్తాడని అంతా ఆశించారు.


Also Read: Ind vs SA, 1st ODI Highlights: కొంప ముంచిన మిడిలార్డర్.. శార్దూల్ పోరాటం సరిపోలేదు.. మొదటి వన్డేలో భారత్ పరాజయం!


Also Read: SA vs IND, 1st ODI: తగ్గేదే లే..! బవుమాతో విరాట్ కోహ్లీ మాటల యుద్ధం!


Also Read: Glenn Maxwell: మెల్‌బోర్న్‌లో మాక్స్‌వెల్ అరాచకం.. బౌండరీలతోనే ఏకంగా 112 పరుగులు.. ఆర్సీబీ రికార్డు మూడో స్థానానికి.. అయినా హ్యాపీనే!


ఈ వన్డేలో భారత్ 31 పరుగులతో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. తెంబా బవుమా (110: 143 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు), వాన్ డర్ డుసెన్ (129: 96 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు) సెంచరీలు సాధించారు. భారత బౌలర్లలో బుమ్రాకు రెండు వికెట్లు దక్కగా.. అశ్విన్ ఒక వికెట్ తీశాడు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 265 పరుగులు మాత్రమే సాధించింది. భారత బ్యాటర్లలో శిఖర్ ధావన్ (79: 84 బంతుల్లో, 10 ఫోర్లు), విరాట్ కోహ్లీ (51: 63 బంతుల్లో, మూడు ఫోర్లు), శార్దూల్ ఠాకూర్ (50 నాటౌట్: 43 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధ సెంచరీలు సాధించారు.