దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ 31 పరుగులతో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. టెంపా బవుమా (110: 143 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు), వాన్ డర్ డుసెన్ (129: 96 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు) సెంచరీలు సాధించారు. భారత బౌలర్లలో బుమ్రాకు రెండు వికెట్లు దక్కగా.. అశ్విన్ ఒక వికెట్ తీశాడు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 265 పరుగులు మాత్రమే సాధించింది. భారత బ్యాటర్లలో శిఖర్ ధావన్ (79: 84 బంతుల్లో, 10 ఫోర్లు), విరాట్ కోహ్లీ (51: 63 బంతుల్లో, మూడు ఫోర్లు), శార్దూల్ ఠాకూర్ (50 నాటౌట్: 43 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) అర్థ సెంచరీలు సాధించారు.


టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ ఎంచుకుంది. జట్టు స్కోరు 19 వద్దే ఓపెనర్‌ జానెమన్‌ మలన్‌ (6)ను జస్ప్రీత్‌ బుమ్రా అవుట్ చేసి భారత్‌కు మొదటి వికెట్ అందించాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన బవుమా మొదట్లో మెల్లగా ఆడాడు. 16వ ఓవర్లో క్వింటన్‌ డికాక్‌ (27), ఆ తర్వాత ఎయిడెన్‌ మార్క్రమ్‌ (4) అయ్యాక సఫారీల్లో 68 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డారు. అయినా సరే సఫారీలు భారీ స్కోరు చేశారంటే అందుకు బవుమా, వాన్‌ డర్‌ డుసెన్‌ బ్యాటింగే కారణం. వీరు నాలుగో వికెట్‌కు 184 బంతుల్లో 204 పరుగుల భారీ భాగస్వామ్యం అందించారు.


డుసెన్ మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడగా... బవుమా తనకు చక్కటి సహకారం అందించాడు. 133 బంతుల్లో బవుమా, 83 బంతుల్లో డుసెన్‌ సెంచరీలు చేశారు 49వ ఓవర్ మొదటి బంతికి బవుమాను బుమ్రా ఔట్‌ చేసినా అప్పటికే చాలా ఆలస్యం అయింది.


297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిగిన భారత్ ఇన్నింగ్స్ సాఫీగానే ప్రారంభం అయింది. మొదటి వికెట్‌కు 46 పరుగులు జోడించిన అనంతరం తొమ్మిదో ఓవర్లో కేఎల్ రాహుల్ (12: 17 బంతుల్లో) అవుటయ్యాడు. ఆ తర్వాత శిఖర్ ధావన్ (79: 84 బంతుల్లో, 10 ఫోర్లు), విరాట్ కోహ్లీ (51: 63 బంతుల్లో, మూడు ఫోర్లు) స్కోరును ముందుకు నడిపించారు. రెండో వికెట్‌కు 92 పరుగులు జోడించిన అనంతరం శిఖర్ ధావన్‌ను అవుట్ చేసి కేశవ్ మహరాజ్ వీరి భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ తర్వాత కాసేపటికే విరాట్ కూడా అవుటయ్యాడు.


ఇక మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ (16), శ్రేయస్ అయ్యర్ (17), వెంకటేష్ అయ్యర్ (2) విఫలం కావడంతో భారత్ వెనకబడింది. చివర్లో శార్దూల్ ఠాకూర్ (50 నాటౌట్: 43 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) పోరాడినా ఫలితం లేకపోయింది. అజేయమైన తొమ్మిదో వికెట్‌కు శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా (14 నాటౌట్: 23 బంతుల్లో, ఒక ఫోర్) 46 బంతుల్లోనే 51 పరుగులు జోడించడం విశేషం.  భారత్ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 265 పరుగులు సాధించింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి, షంసి, ఫెలుక్వాయో రెండేసి వికెట్లు తీశారు. కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్క్రమ్‌లకు చెరో వికెట్ దక్కింది.


Also Read: Team India Next Captain: విరాట్‌ కోహ్లీ వారసుడి పేరు సూచించిన గావస్కర్‌..! లాజిక్‌ ఇదే!


Also Read: Mohammed Siraj on Kohli: నువ్వెప్పుడూ నా కెప్టెనే! ధోనీకి కోహ్లీ.. కోహ్లీకి సిరాజ్‌!


Also Read: Lucknow IPL Franchise: కేఎల్‌ రాహుల్‌ ఓకే! లఖ్‌నవూ మిగతా ఆటగాళ్లెవరో తెలుసా!!