శ్రీలంకతో రెండో T20లో తలపడే భారత జట్టుపే క్లారిటీ లేదు. షెడ్యూల్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య రెండో టీ20 మంగళవారం జరగాలి. మ్యాచ్‌కి ముందు కొన్ని గంటల ముందు ఆటగాళ్లకు నిర్వహించిన కరోనా టెస్టుల్లో భారత ఆటగాడు కృనాల్ పాండ్య పాజిటివ్‌గా తేలాడు. దీంతో మ్యాచ్‌ని ఈ రోజుకి వాయిదా వేశారు. సిరీస్ ముగిసిన అనంతరం భారత ఆటగాళ్లు అందరూ తిరిగి ఇండియా వచ్చేస్తారు. కానీ, కృనాల్ పాండ్య మాత్రం ఐసోలేషన్ పూర్తి అవ్వాలి. అనంతరం నిర్వహించే RT-PCR టెస్టులో నెగిటివ్ వచ్చిన తర్వాతే అతడు స్వదేశానికి వస్తాడు. 


ఆ తర్వాత భారత జట్టు మేనేజ్‌మెంట్ కృనాల్ పాండ్యతో సన్నిహితంగా మెలిగిన ఆటగాళ్లు ఎవరా అన్న దానిపై ఆరా తీయడం ప్రారంభింది. అలాగే ఆటగాళ్లందరికీ RT-PCR టెస్టులు నిర్వహించింది. ఫలితాల్లో అందరూ నెగిటివ్‌గా తేలారు. కృనాల్ పాండ్యను ఈ రోజు ఆటగాళ్లకు దూరంగా మరో హోటల్‌కి తరలించారు. తాజాగా కృనాల్‌తో సన్నిహితంగా మెలిగిన ఆటగాళ్లు ఎనిమిది మందిగా గుర్తించింది సిబ్బంది. ముందు జాగ్రత్త కోసం వాళ్లందరినీ కూడా ఐసోలేషన్లో ఉంచారు. దీంతో ఈ రోజు, రేపటి మ్యాచ్‌‌లకు వీరంతా దూరం కానున్నట్లు తెలుస్తోంది.  


కృనాల్ పాండ్యాతో క్లోజ్ కాంటాక్ట్‌లో ఉన్న ఆటగాళ్ల జాబితాని ఓసారి పరిశీలిస్తే... ఆ 8 మందిలో ధావ‌న్‌, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిష‌న్‌, కృష్ణ‌ప్ప గౌత‌మ్‌, పృథ్వి షా, సూర్య‌కుమార్ యాద‌వ్‌, మ‌నీష్ పాండే, య‌జువేంద్ర చాహ‌ల్ ఉన్నట్లు సమాచారం. దీంతో... ఈ ఎనిమిది మంది టీ20 సిరీస్‌కి కృనాల్ పాండ్యాతో పాటు దూరమయ్యారు. వీరి స్థానాల్లో కొత్త ఆటగాళ్లు ఆడే అవకాశం ఉంది. లంక టూర్‌లో 20 మంది భారత ఆటగాళ్లతో పాటు నలుగురు స్టాండ్ బై నెట్ బౌలర్లు కూడా ఉన్నారు. 


దీంతో ఇప్పుడు ఈ రెండు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఎవరు వ్యవహరిస్తారన్న విషయం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ధావన్ కెప్టెన్‌గా ఉంటే బౌలర్ భువనేశ్వర్ కుమార్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇప్పుడు శిఖర్ ధావన్ స్థానంలో భువి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడా అన్న దానిపై క్లారిటీ లేదు.  మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ వేసే సమయానికి కానీ కెప్టెన్ ఎవరు, తుది జట్టులో ఎవరెవరు ఆడుతున్నారన్న దానిపై క్లారిటీ వస్తోంది. 


మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ తొలి T20లో విజయం సాధించి ఆధిక్యంలో ఉంది. ఇప్పటికే శ్రీలంకతో 1-2 తేడాతో భారత్ సిరీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కొత్త జట్టుతో భారత్ ఏమాత్రం రాణిస్తుందో చూడాలి. యువ ఆటగాళ్లకు ఇది నిజంగా కలిసొచ్చే అంశం. మరి, తుది జట్టులో స్థానం దక్కించుకున్న ఆటగాళ్లు ఎంతవరకు రాణిస్తారో.