ప్రాణం నిలిపే దేవుళ్లు.. ఈసారి ప్రాణం పోశారు. ప్రాణాలతో పోరాడేవారిని సమయానికి ఆస్పత్రికి చేర్చి ఎంతో మంది ప్రాణాలను రక్షిస్తుంటారు అంబులెన్స్ సిబ్బంది. కానీ ఈసారి అలా కాకుండా వారే ప్రాణదాతలయ్యాయి. ఆగిపోయిన చిన్నారి గుండెకు అంబులెన్స్‌ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించిన తిరిగి ఊపిరిపోశారు. 




కరీంనగర్ జిల్లా మంథని మండలం గంగిపల్లికి చెందిన సుజాత అనే మహిళకు మూడు రోజుల క్రితం బాలుడు జన్మించాడు. అమ్మపక్కనే ఒదిగి వెచ్చగా నిద్రపోవాల్సిన చిన్నారి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. కరీంనగర్‌ సివిల్‌ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఒ‍క్కసారిగా బాబు పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వరంగల్‌ ఎంజీఎంకి  తరలించాలని డాక్టర్లు సూచించారు.


వైద్యుల సలహాతో అత్యవసర పరిస్థితిలో ఉన్న బాలుడిని తల్లిదండ్రులు వరంగల్‌కు అంబులెన్స్‌లో తరలించాలని నిర్ణయించుకున్నారు. అంబులెన్స్‌లో తీసుకెళుతుండగా..మార్గ మధ్యలో చిన్నారి పరిస్థితి విషమించింది. పసికందు గుండె ఒక్కసారిగా కొట్టుకోవడం ఆగిపోయింది. దీంతో అంబులెన్స్‌ సిబ్బంది వెంటనే.. హార్ట్ బీట్ చెస్ట్ కంప్రెషన్ విధానంలో మళ్ళీ గుండె కొట్టుకునేలా చేశారు. దీంతో ఆ బాలుడు తిరిగి సాధారణంగా స్థితికి చేరుకున్నాడు. పొత్తిళ్లలో ఉండాల్సిన బిడ్డ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండడం చూసి ఆ తల్లి కన్నీరుమున్నీరైంది. అంతలోనే అంబులెన్స్ సిబ్బంది ఊపిరినిలపడంతో కన్నీళ్లతో వారికి కృతజ్ఞతలు తెలిపింది.  ఆ తర్వాత వెంటనే వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.




ఆ మధ్య మహబూబ్ నగర్ జిల్లాలో ఓ గర్భిణిని అంబులెన్స్ లో తరలిస్తుండగా మార్గ మధ్యలో నొప్పులు పెరిగాయి. ఆసుపత్రికి తరలించే వరకూ అలాగే వదిలేస్తే తల్లి,బిడ్డ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చేది. కానీ అంబులెన్స్ సిబ్బంది తమ పని తాము చేద్దాంలే అని వదిలేయలేదు. అప్రమత్తంగా వ్యవహరించారు. గర్భిణికి సుఖ ప్రసవం చేసి....తల్లి, బిడ్డ ఇద్దర్నీ క్షేమంగా ఆసుపత్రికి తరలించారు.  ఒకటో రెండో కాదు....ఇలాంటి ఘటనలు చాలా ఉన్నాయి. 




వాస్తవానికి రోగులకు అంబులెన్స్ సేవలు వర్ణించలేనివి..చికిత్సకు వైద్యులు ఎంత అవసరమో..ఆపదలో ఉన్నవారిని ,అత్యవసర చికిత్స అవసరమున్నవారిని సమాయానికి ఆసుపత్రులకు చేర్చడం కూడా అంతే ముఖ్యం. చావుబతుకుల్లో ఉన్న రోగిని ఆసుపత్రికి చేర్చేవరకూ మార్గ మధ్యలో ఏం జరగకుండా జాగ్రత్తగా చూసుకుంటూ సకాలంలో ఆసుపత్రికి చేరుస్తారు. అంత అవకాశం లేని చాలా సందర్భాల్లో అంబులెన్స్ సిబ్బంది ప్రాధమిక వైద్యం చేసి ఆ కొద్దిసేపు ప్రాణాలకు అరచేతులు అడ్డం పెడతారు.గతంలోనూ ఇలాంటి సందర్భాల్లో ఎందరో అంబులెన్స్ డ్రైవర్లు సమయానికి ఆదుకున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన చిన్నారి ప్రాణాలు నిలిపిన సందర్భంగా అంబులెన్స్ సిబ్బందిని ప్రసంశిస్తున్నారంతా.....