టోక్యో ఒలింపిక్స్‌లో ఇప్పటి వరకు భారత్ కేవలం ఒకే ఒక్క పతకం నెగ్గింది. ఇప్పటికే మన అథ్లెట్లు చాలా మంది ఖాళీ చేతులతో వెనుదిరిగారు. టేబుల్ టెన్నిస్‌లో కచ్చితంగా పతకం వస్తుందని అనుకున్నారు. కానీ, ఒక్క పతకం కూడా రాలేదు. టాప్ ప్లేయర్లు మనిక బాత్ర, శరత్ కమల్ కూడా 3వ రౌండ్లోనే వెనుదిరిగారు.
ప్రస్తుతం అందరి దృష్టి అంతా భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పైనే. రియో ఒలింపిక్స్‌లోని రజత పతకాన్ని టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణంగా మార్చుకుంటోందని అందరూ భావిస్తున్నారు. దీంతో ఆమెపై భారీగా అంచనాలు పెరిగాయి. పోటీల్లో భాగంగా బుధవారం సింధు... హాంకాంగ్ క్రీడాకారిణి చాంగ్‌పై 21-9, 21-16 తేడాతో విజయం సాధించింది. తొలి సెట్‌ని సునాయాసంగా చేజెక్కించుకున్న సింధు రెండో సెట్ కోసం కాస్త కష్టపడాల్సి వచ్చింది. కానీ, చివరికి తనదైన స్టైల్లో సింధు విజయం సాధించి ప్రిక్వార్టర్స్‌కి దూసుకెళ్లింది.
ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ... టోక్యో ఒలింపిక్స్ నాకౌట్ దశ సులభమేమీ కాదు, ప్రిక్వార్టర్స్‌లో డెన్మార్క్‌కు చెందిన బ్లిచ్‌ఫెల్ట్‌తో పోరు కఠినంగానే సాగుతుంది. ఈ రోజు రెండో గేమ్‌లో నా లయ అందుకుని... మ్యాచును ముగించాను. ఆట వేగంగా సాగింది. నేను కొన్ని అనవసర తప్పిదాలు చేశాను. వెంటనే ప్లాన్ మార్చుకుని గేమ్‌ను నా నియంత్రణలోకి తెచ్చుకున్నాను. పెద్ద మ్యాచులకు ముందు ఇలాంటి పరీక్షలు అత్యంత కీలకం’ అని సింధు తెలిపింది.
తర్వాతి మ్యాచులో తలపడే బ్లిచ్‌ఫెల్ట్‌పై సింధుకు 4-1 ఆధిక్యం ఉంది. ఐతే ఆమెతో పోరు సులువు కాదంటోంది. ‘తొలి నాకౌట్ మ్యాచ్ అంత సులభమేమీ కాదు. త్వరగా కోలుకొని బలంగా పుంజుకోవాలి. నేనామెతో కొన్ని మ్యాచుల్లో తలపడ్డాను. ప్రతి పాయింటు ముఖ్యమే. బ్లిచ్ దూకుడుగా ఆడుతుంది. కాబట్టి నేనూ కూడా అలాగే ఆడాలి’ అని సింధు తెలిపింది. ఈ ఏడాది జనవరిలో జరిగిన థాయ్‌లాండ్ ఓపెన్లో బ్లిచ్... సింధుపై విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో బ్లిచ్ 22-20, 21-10 తేడాతో సింధుపై విజయం సాధించింది. ప్రి క్వార్టర్స్‌లో సింధు.. బ్లిచ్ పై గెలిస్తే... క్వార్టర్స్‌లో అకానె యమగూచి, సెమీస్‌లో తైజు ఇంగ్‌తో సింధు తలపడే అవకాశం ఉంది.
ఇప్పటికే ఒలింపిక్స్‌లో ఒత్తిడికి గురవుతున్నట్లు సింధు తెలిపింది. ఒత్తిడిని భరించలేక అమెరికా జిమ్నాస్టిక్ క్రీడాకారిణి సిమోన్ బైల్స్ ఒలింపిక్స్ నుంచి తప్పుకుంది. మరి, సింధు ఒత్తిడిని అధిగమించి పతకం గెలుస్తుందో లేదో చూడాలి. బ్యాడ్మింటన్‌లో సింధు తప్ప మిగతా ఆటగాళ్లందరూ ఇప్పటికే ఇంటిముఖం పట్టారు. పురుషుల సింగిల్స్‌లో సాయి ప్రణీత్, పురుషుల డబుల్స్‌లోనూ భారత్‌కు చుక్కెదురైంది.