జూనియర్‌ వరల్డ్‌ కప్‌ హాకీ టోర్నీ(FIH Junior World Cup 2023)లో భారత్‌ (Bharat)సంచలనం సృష్టించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో పటిష్టమైన నెదర్లాండ్స్‌(Netherlands)పై విజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో యువ భారత్‌ ప్రదర్శన అబ్బురపరిచింది. ఆరంభంలో నెదర్లాండ్స్‌ దూకుడు ముందు తేలిపోయిన భారత యువ ఆటగాళ్లు కీలక సమయంలో పుంజుకుని 4-3తో విజయం సాధించారు. ఈ మ్యాచ్‌లో యువ భారత్‌ విజయం కష్టమని చాలామంది అంచనా వేయగా... బలమైన నెదర్లాండ్స్‌ను టీమిండియా ఓడించింది. ప్రత్యర్థి రక్షణ శ్రేణి ఎంత బలంగా ఉన్నా చొచ్చుకుపోయే సత్తా కలిగిన జట్టు నెదర్లాండ్స్‌ను ఓడించిన యువ భారత్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్‌  ఫైనల్‌లో యువ భారత్‌- నెదర్లాండ్స్‌ హోరాహోరీగా తలపడ్డాయి.


ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన నెదర్లాండ్స్‌ అయిదో నిమిషంలోనే గోల్‌ చేసి టీమిండియాకు షాక్‌ ఇచ్చింది. నెదర్లాండ్స్‌ స్ట్రైకర్‌ బోయర్స్‌ గోల్‌ చేశాడు. అనంతరం 16వ నిమిషంలో నెదర్లాండ్స్‌ మరో గోల్‌ చేసి 0-2 ఆధిక్యానికి దూసుకెళ్లింది. తొలి క్వార్టర్‌లో  0-2 గోల్స్‌తో నెదర్లాండ్స్‌ ముందుండడంతో యువ భారత్‌ ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు. కానీ 34వ నిమిషంలో అదిత్య గోల్‌ చేయడంతో భారత్‌ ఖాతా తెరిచింది. అనంతరం మరో రెండు నిమిషాలాకో పెనాల్టీ కార్నర్‌ను అరైజిత్‌ సింగ్‌ గోల్‌గా మలచడంతో స్కోరు 2-2తో సమమయ్యాయి. కానీ 44వ నిమిషంలో నెదర్లాండ్స్‌ ఆటగాడు ఒలివర్‌ గోల్‌ చేయడంతో డచ్‌ జట్టు మళ్లీ 3-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత మరో ఎనిమిది నిమిషాలకు సౌరభ్‌ కుష్యాహా చేసిన అద్భుత గోల్‌తో భారత్‌ స్కోరును 3-3తో సమం చేసింది. ఇక సమయం ముగుస్తుందనుకున్న దశలో భారత కెప్టెన్‌ ఉత్తమ్‌సింగ్‌ గోల్‌ చేసి టీమిండియాను 4-3తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఈ గోల్‌ తర్వాత నెదర్లాండ్స్ ఎన్ని ప్రయత్నాలు చేసినా మరో గోల్‌ సాధించలేకపోయింది. ఓటమి ఖాయమనుకున్న దశలో జూనియర్‌ హాకీ జట్టు అద్భుత విజయంతో సెమీస్‌లోకి చేరింది. డిసెంబర్ 14న జర్మనీతో భారత్‌ సెమీఫైనల్లో తలపడనుంది. మరో క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో స్పెయిన్‌తో పాకిస్తాన్ తలపడనుంది. 


జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ మూడు మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు ఒక మ్యాచ్‌లో గెలిచి మరో మ్యాచ్‌లో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో యువ భారత్‌(Bharat) శుభారంభం చేసింది. మూడోసారి విశ్వవిజేతగా నిలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు.. బలమైన కొరియాపై 4-2తో విజయం సాధించింది. అర్జీత్‌ సింగ్‌ హుందాల్‌(Araijeet Singh Hundal) హ్యాట్రిక్‌ గోల్స్‌ కొట్టడంతో పూల్‌-సి మ్యాచ్‌లో 4-2తో కొరియా(South Korea)ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచి భారత్‌ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఎక్కడా ప్రత్యర్థి జట్టు పుంజుకునేందుకు అవకాశమే ఇవ్వలేదు. 11వ నిమిషంలో అర్జీత్‌ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. రెండో క్వార్టర్‌లో భారత్‌ ఖాతాలో మరో రెండు గోల్స్‌ పడ్డాయి. 16వ నిమిషంలో అర్జీత్‌ సింగ్‌, 30వ నిమిషంలో అమన్‌దీప్‌ గోల్స్‌ చేయడంతో భారత్‌ 3-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లి విజయాన్ని ఖరారు చేసుకుంది. కానీ మూడో క్వార్టర్‌లో కొరియా కాస్త పుంజుకుంది. 38వ నిమిషంలో లిమ్‌ చేసిన గోల్‌తో కొరియా ఖాతా తెరిచింది. కానీ వెంటనే అర్జిత్‌ సింగ్‌ 41వ నిమిషంలో హ్యాట్రిక్‌ గోల్‌ కొట్టడంతో భారత్‌ 4-1తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది.