Big Relief For Former DGP Anjani Kumar: డీజీపీగా ఉంటూ ఎన్నికల ఫలితాల రోజుల కాంగ్రెస్ లీడర్లను కలిశారని అంజనీకుమార్‌పై వేసిన సస్పెన్స్‌ను ఎత్తివేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ డీజీపీగా ఉన్న అంజనీ కుమార్ డిసెంబర్ మూడో తేదీన కాంగ్రెస్ నేతలను కలిశారు. ముఖ్యంగా అప్పటి పీసీసీ చీఫ్, ఇప్పటి సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. అప్పటికే కాంగ్రెస్ లీడ్‌లో ఉన్నందున గెలిచేది కాంగ్రెస్ పార్టీయే అని తెలుసుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఆగ్రహించిన కేంద్ర ఎన్నికల సంఘం ఆయనపై వేటు వేసింది.
తెలంగాణలో ఎన్నికల ఫలితాలు వెలువెడుతున్న సమయంలోనే డీజీపీ అంజనీకుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుండగానే టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డిని డీజీపీ కలుసుకుని చర్చ జరపడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరపాలని ఆ భేటీలో అంజనీకుమార్‌తో రేవంత్ రెడ్డి చర్చించారు.
ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డిని కలిసి ప్రమాణ స్వీకారంపై చర్చించడంతో డీజీపీపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డిని కలవడంపై అంజనీ కుమార్‌ను ఈసీ వివరణ కోరింది. ఆయన్ని సస్పెండ్ చేసింది. అంజనీ కుమార్ స్థానంలో రవి గుప్తాను తెలంగాణ డీజీపీగా నియమించింది.
మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూస్తానని కేంద్ర ఎన్నికల సంఘానికి అంజనీకుమార్ వివరణ ఇచ్చారు. ఆయన వివరణతో సంతృప్తి వ్యక్తం చేసిన ఈసీ సస్పెన్స్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.