India tour of West Indies: వెస్టిండీస్‌తో తొలి వన్డేకు టీమ్‌ఇండియా సిద్ధమైంది. మ్యాచుకు ముందు ట్రినిడాడ్‌లో సాధన చేసింది. దీనికి వరుణుడు అడ్డుపడ్డాడు. హఠాత్తుగా వర్షం రావడంతో ఆటగాళ్లంతా ఇండోర్‌ ఫెసిలిటీలో ప్రాక్టీస్‌ చేశారు. కుర్రాళ్లంతా ఉత్సాహంగా కనిపించారు.


టీమ్‌ఇండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, కెప్టెన్ శిఖర్ ధావన్‌ నేతృత్వంలో ఆటగాళ్లు సాధన చేశారు. శుభ్‌మన్ గిల్‌, అర్షదీప్‌ సింగ్‌, ఇషాన్‌ కిషన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ హుషారుగా కనిపించారు. వర్షం అడ్డంకిగా మారినా అందరం కలిసి ఇండోర్‌లో సాధన చేశామని శుభ్‌మన్‌ గిల్‌ చెప్పాడు. 


భారత్‌ సాధన చేస్తున్న వీడియోను బీసీసీఐ ట్విటర్లో పోస్టు చేసింది. కాగా వెస్టిండీస్‌, భారత్‌ తొలి వన్డే శుక్రవారం జరగనుంది. అక్కడ ఉదయమే మొదలవుతున్నా భారత కాలమానాం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్‌ ఉంటుంది.






రోహిత్‌, కోహ్లీ, బుమ్రా వంటి సీనియర్లకు విశ్రాంతినివ్వడంతో వన్డే సిరీసుకు గబ్బరే కెప్టెన్సీ చేస్తున్నాడు. గయానాలో అడుగుపెట్టిన వెంటనే కుర్రాళ్లంతా కలిసి ఓ వీడియో చేశారు. 'హే ట్రెండ్‌'తో సందడి చేశారు. ఈ వీడియోను శిఖర్‌ ఇన్‌స్టాలో పంచుకున్నాడు.



వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ జులై 22న 27న ముగుస్తుంది. పోర్ట్‌ ఆఫ్ స్పెయిన్‌లోనే మూడు వన్డేలు జరుగుతాయి. ఆ తర్వాత జులై 29 నుంచి  ఐదు టీ20ల సిరీసు మొదలవుతుంది. ఆగస్టు 7న ముగుస్తుంది. తొలి మ్యాచ్‌కు ట్రినిడాడ్‌లోని బ్రయన్ లారా స్టేడియం వేదిక. ఆ తర్వాతి రెండు మ్యాచులకు సెయింట్‌ కీట్స్‌లోని వార్నర్‌ పార్క్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. చివరి రెండు మ్యాచులు అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగుతాయి.


విండీస్‌తో టీ20 సిరీసుకు టీమ్‌ఇండియా అంచనా జట్టు: రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, దినేశ్‌ కార్తీక్‌, సంజు శాంసన్‌, యుజ్వేంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, రవీంద్ర జడేజా, హార్దిక్‌ పాండ్య, దీపక్‌ హుడా, భువనేశ్వర్‌ కుమార్‌, హర్షల్‌ పటేల్‌, అవేశ్ ఖాన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, అర్షదీప్‌ సింగ్‌