Cyber Crime: అతడో మాయగాడు. అంతకు మించి జాదూగాడు. చేపలు పట్టడంలో మంచి నేర్పరి. చేపలు చిక్కేలా.. మంచి మంచి ఎరలను వేస్తాడు.  అతడి లక్ష్యం ఏ చేప పడితే ఆ చేపను పట్టుకోవడం కాదు. కొరమీనులనే వేటాడతాడు. చిక్కిన చేపలను సొమ్ము చేసుకుంటాడు. పోలీసుల దర్యాప్తులో ఆ కేటుగాడి చేపల వేట బాగోతం అంతా బయట పడింది. చేపల వేటగాడి పేరు వంశీ కృష్ణ. అతను వేటాడేది రెండో పెళ్లికి సిద్దమైన మహిళలను అని పోలీసులు చెప్పారు.


వంశీకృష్ణ ఎవరు అసలు?


తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్ర వరంలోని రామచంద్రారావు పేటకు చెందిన జోగాడ వంశీ కృష్ణ వయసు 31 ఏళ్లు. బీటెక్ పూర్తి చేసిన అతడు ఉద్యోగం వెతుక్కుంటూ హైదరాబాద్ లోని కూకట్ పల్లికి చేరుకున్నాడు. ఆరేళ్ల వ్యవధిలో సుమారు వెయ్యి నుంచి పదిహేను వందల మంది యువతులను, మోసం చేసినట్లు పోలీలు రికార్డులు చెబుతున్నాయి. వారి నుంచి దాదాపు 40 నుంచి 50 కోట్ల వరకు కొట్టేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అతడికి హర్ష, హర్ష వర్ధన్, చెరుకూరి హర్ష అనే మారుపేర్లు కూడా ఉన్నాయి. గత మే నెలలో వంశీకృష్ణ పోలీసులకు పట్టుబడ్డాడు. తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. 


అతను ఏం చేస్తుంటాడు?


2014లే హైదరాబాద్ కు వచ్చిన వంశీకృష్ణ తొలుత కూకట్ పల్లిలోని హోటల్ లో పని చేశాడు. 2015లో క్రికెట్ పందేలకు అలవాటు పడ్డాడు. 2016లో జాబ్ కన్సల్టెన్సీ, ట్రావెల్ ఆఫీసులో చేరాడు. 10 మంది యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేశాడు. ఈ కేసులో అరెస్టు అయి జైలుకు కూడా వెళ్లాడు. జైలు నుంచి విడుదల అయ్యాక.. మాధురి చౌకి, గాయత్రి.. శ్వేత, సాత్విక, జెస్సీ, హర్ష కూల్ 94 పేర్లతో ఇన్ స్టా గ్రామ్ లో నకిలీ ఖాతాలు తెరిచాడు. మహిళలు, యువతులకు తనను తాను యువతిగా పరిచయం చేసుకునే వాడు. సంపాదనలో సగానికి పైగా సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తాడంటూ మారు పేర్లతో ఉన్న ఖాతాల నుంచి తనపై తానే పొగడ్తవ వర్షం కురిపించుకునే వాడు. 


ఆరేళ్లలో 1000 నుంచి 15000 మందిని దోచేశాడు!


ఇది నిజమని 1000-1500 మందిని నమ్మించాడు. ఉద్యోగం, ఉపాధి, సేవా కార్యక్రమాలు అంటూ ఒక్కొక్కరి నుంచి పెద్ద మొత్తంలో గుంజేశాడు. పరిచయం అయిన అమ్మాయిు, మహిళలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలిస్తే వారికి వెంటనే లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు ఉదారంగా ఇచ్చేవాడు. దీంతో అతడి గురించి వేరే ప్రచారం చేసేవారు. ఇలా ఆరేళ్ల వ్యవధిలో ఇంతమందిని మోసగించగలిగాడని అధికారులు చెబుతున్నారు. పోలీసులు నిందితుుడి బ్యాంకు ఖాతాల్లోని సుమారు నాలుగు కోట్ల లావాదేవీలను స్తంభింపజేశారు. రిమాండ్ లో ఉన్న అతడిని కస్టడీలోకి తీస్కొని మరింత సమాచారం సేకరించాలని భావిస్తున్నారు.