India drop to 117th in Fifa rankings:  అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య ర్యాంకింగ్స్‌(FIFA rankings)లో భారత్‌ ర్యాంక్‌ మరింత దిగజారింది. ఫిఫా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత ఫుట్‌బాల్‌ జట్టు 15 ర్యాంక్‌లు దిగజారి 117వ స్థానంలో నిలిచింది. గత ఏడేళ్లలో టీమ్‌ఇండియా(Team India)కు ఇదే అత్యంత తక్కువ ర్యాంక్‌ కావడం గమనార్హం. ఇటీవల జరిగిన ఏఎఫ్‌సీ ఏషియన్‌ కప్‌లో ఆడిన మూడు గ్రూపు మ్యాచ్‌ల్లో భారత్‌ ఓడిపోవడం ర్యాంకింగ్స్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ఆస్ట్రేలియా, ఉజ్బెకిస్థాన్‌, సిరియాతో ఆడిన మ్యాచ్‌ల్లో భారత్‌ కనీసం ఒక్క గోల్‌ చేయలేకపోయింది. ఆసియా ర్యాంకింగ్స్‌ పరంగా చూస్తే టీమ్‌ఇండియా ప్రస్తుతం 22వ ర్యాంక్‌లో ఉంది. 2017 తర్వాత టీమిండియా ర్యాంక్‌ ఇంతగా పతనం కావడం ఇదే తొలిసారి. ఆసియాక్‌ప లీగ్‌ దశలో ఆడిన మూడు మ్యాచుల్లోనూ భారత్‌ ఓటములను చవిచూసింది. అంతేకాకుండా ఒక్క గోల్‌ కూడా నమోదు చేయలేదు. దీంతో మొత్తం 35.57 పాయింట్లను కోల్పోవాల్సి వచ్చింది. 

 

ఎక్కువ ఆశించొద్దు

భారత్‌లో ఉత్తమమైన క్లబ్‌లు సైతం బంగ్లాదేశ్‌, మాల్దీవుల లాంటి దేశాల క్లబ్‌ల చేతుల్లో ఓడుతున్నంత కాలం ఆసియాకప్‌లో జాతీయ జట్టు నుంచి ఎక్కువగా ఆశించలేమని ఫుట్‌బాల్‌ కోచ్‌ ఇగర్‌ స్టిమాచ్‌ అన్నాడు. భారత్‌ ప్రదర్శనపై అఖిల భారత ఫుట్‌బాల్‌ సంఘానికి ఇచ్చిన నివేదికలో ఈ విషయాన్ని పేర్కొన్నాడు. తానెప్పుడూ వాస్తవిక దృక్పథంతో ఉంటానని తెలిపాడు. ఆసియాకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో భారత్‌ తరుచుగా ఆడుతుండడం ఆనందంగానే ఉంది. ఇటీవల దోహాలో జరిగిన ఈ టోర్నీలో భారత్‌ మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించలేదని తెలిపాడు. ఏఎఫ్‌సీ ఛాంపియన్‌ లీగ్‌లో భారత్‌లో ఉత్తమ ఐఎస్‌ఎల్‌ జట్లు బంగ్లాదేశ్‌, మాల్దీవుల క్లబ్‌ల చేతిలో ఓడిపోతుంటే జాతీయ జట్టు నుంచి ఇంతకుమించిన ప్రదర్శన ఏం ఆశించగలమని స్టిమాచ్‌ తెలిపాడు.  ఆసియాకప్‌లో ఆడిన 24 దేశాల్లో ప్రపంచంలో జరిగే ప్రధాన లీగ్‌లలో ఆడని ఆటగాళ్లు ఉన్న జట్టు భారత్‌ మాత్రమేనని తెలిపాడు. అండర్‌-18, 20, 23 ఆసియాకప్‌లకు కనీసం అర్హత కూడా సాధించట్లేదని స్టిమాచ్‌ అన్నాడు. 

 

ఆసియా గేమ్స్‌లో సౌదీ అరేబియా చేతిలో భారత ఫుట్‌బాల్‌ జట్టు ఓటమిపాలైంది. రౌండ్‌ ఆఫ్‌ 16 మ్యాచ్‌లోనే సునీల్‌ ఛెత్రీ నాయకత్వంలోని టీమ్‌ఇండియా ఇంటిముఖం పట్టింది. దీంతో భారత ఫుట్‌బాల్‌ కోచ్‌ ఇగార్ స్టిమాచ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సరైన సన్నద్ధత లేకుండా జట్టును ఇక్కడికి పంపించారని మేనేజ్‌మెంట్‌పై విమర్శలు చేశాడు. కీలక ఆటగాళ్లు ప్రాక్టీస్‌కు కూడా అందుబాటులో లేకుండా చేశారని వ్యాఖ్యానించాడు. ‘‘ఆసియా గేమ్స్‌లో ఈ ఓటమి భారత్‌కు గుణపాఠం. అందుకే, సరైన సన్నద్ధత లేకుండా మమ్మల్ని ఎప్పుడూ ఇలాంటి టోర్నీలకు పంపొద్దు. అత్యుత్తమ ఆటగాళ్లు అందుబాటులో లేకుండా ప్రాతినిధ్యం వహించడం కష్టం. సిద్ధం కావడానికి తగినంత సమయం, సరైన ఆటగాళ్లను ఇస్తేనే భారీ టోర్నీల్లో రాణించేందుకు అవకాశం ఉంటుంది. మేం ఇక్కడకు భారత్‌ తరఫున ఆడేందుకు వచ్చాం. అయితే, సరైన సన్నద్ధత లేకపోయినా ఇక్కడకు వచ్చి ఉత్తమ ఆటతీరును ప్రదర్శించిన ఆటగాళ్ల పట్ల భారత అభిమానులు తప్పకుండా గర్వపడతారు. ఆసియా క్రీడల్లో పాల్గొనే ముందు కనీసం ఒక్క ప్రాక్టీస్‌ సెషన్‌ కూడా నిర్వహించలేదు. అందుకే, ఇలాంటి టోర్నీలకు పంపే ముందు సరైన ప్రణాళికలు ఉండాలని స్టిమాచ్‌ తెలిపాడు.