Gurukula PD Recruitment: తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీలో గోల్‌మాల్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదని, జోనల్ పోస్టులను మల్టీజోనల్‌గా నింపినట్టు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. నోటిఫికేషన్‌కు విరుద్ధంగా అనర్హులను ఎంపిక చేసినట్టు స్పష్టం చేస్తున్నారు. గురుకుల పాఠశాలల ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు గతేడాది ట్రిబ్ గతేడాది ఏప్రిల్ 24 నుంచి మే 24 వరకు దరఖాస్తులు స్వీకరించింది. నోటిఫికేషన్ ప్రకారం 5 ఏప్రిల్ 2023 నాటికి పీడీ పోస్టులకు సంబంధించిన అన్ని పరీక్షలు పాసైన అభ్యర్థులే అర్హులని ప్రకటించింది. ఆ లెక్కనే గత మే నాటికే అభ్యర్థులు ఆయా విద్యార్హతలను సాధించి ఉండాలి. కానీ, ప్రస్తుతం ట్రిబ్ నోటిఫికేషన్‌కు విరుద్ధంగా గత అక్టోబర్‌లో పాసైన అభ్యర్థికీ పోస్టింగ్ ఇచ్చిందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.
ఆరోపణలకు బలం..
చార్మినార్‌లో జోన్‌లో పీడీ పోస్టుకు అభ్యర్థి (హాల్ టిక్కెట్ నంబర్ 2302070434) నోటిఫికేషన్ సమయానికి బీపీఎడ్ ఉత్తీర్ణులు కాలేదు. గత అక్టోబర్‌లో నిర్వహించిన బ్యాక్‌లాగ్ సెమిస్టర్‌లో ఉత్తీర్ణత సాధించాడు. కానీ, ప్రస్తుతం ట్రిబ్ పోస్టింగ్ ఇచ్చింది. దీనిపై ట్రిబ్ అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎంత మంది ఉన్నారోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డెమో మార్కులను ట్రిబ్ అధికారులు ఇష్టారాజ్యంగా వేశారని పీడీ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.
రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు తిలోదకాలు..
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జోన్/సొసైటీలోని పోస్టుల్లో 95 శాతం లోకల్ వారికి, 5 శాతం నాన్‌లోకల్ వారికి కేటాయించాల్సి ఉంటుంది. ఇక జోన్‌ను యూనిట్‌గా తీసుకున్నా, జిల్లాను యూనిట్‌గా తీసుకున్నా, రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకున్నా ఇదే నిబంధనను పాటించాల్సి ఉంటుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. కానీ, ప్రస్తుతం ట్రిబ్ అందుకు విరుద్ధంగా జోనల్ పోస్టులను భర్తీచేసినట్టు తెలుస్తున్నది. గురుకుల స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టు జోనల్ పోస్టుగా నిర్ధారించారు. అన్ని జోన్లు, సొసైటీలు కలిపి మొత్తం 275 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం జోన్‌నే కాకుండా సొసైటీని యూనిట్‌గా తీసుకుని పోస్టులను భర్తీ చేయాల్సి ఉన్నది. సొసైటీల వారీగానే కాకుండా, జోన్లవారీగా చూసుకున్నా నాన్‌లోకల్ అభ్యర్థులకు ఒక్క పోస్టు కూడా దక్కదు. కానీ ఏకంగా ఆరు నాన్‌లోకల్ అభ్యర్థులకు ట్రిబ్ పోస్టింగ్‌లు ఇచ్చిందని అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరుగురు కూడా ఏపీకి చెందినవారుకావడంపై భగ్గుమంటున్నారు. ఒక జోన్‌లో 20 పోస్టులకు పైబడి ఉంటేనే నాన్‌లోకల్‌కు ఒక పోస్టు వచ్చే అవకాశముందనేది అభ్యర్థుల వాదన. అలా చూసినా కూడా నాన్‌లోకల్ అభ్యర్థులకు ఒక్క పోస్టు కూడా వచ్చే అవకాశం లేదు. కానీ, ఏకంగా ఏపీకి చెందిన ఆరుగురిని నాన్‌లోకల్ అభ్యర్థులుగా ట్రిబ్ ఎంపిక చేసిందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మొత్తంగా జోన్ల వారీగానే నాన్‌లోకల్ అభ్యర్థులకు పోస్టింగ్‌కు అవకాశం లేకపోగా, జోన్‌లోని సొసైటీలవారీగా చూస్తే అందుకు ఎంతమాత్రం అవకాశం లేదు. కానీ, ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీలో ఏకంగా రెండు పోస్టులను నాన్‌లోకల్ అభ్యర్థులతో భర్తీ చేసిందని, ఇదెలా సాధ్యమైందని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. జోనల్ పోస్టులైన స్కూల్ పీడీ పోస్టులను కూడా మల్టీ జోనల్ పోస్టులుగానే భావించి ట్రిబ్ భర్తీ చేసిందని అభ్యర్థులు వాదిస్తున్నారు.
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో మొత్తంగా తొమ్మిది క్యాటగిరీల్లో 1,276 పీజీటీ పోస్టులు; 4,020 టీజీటీ పోస్టులతోపాటు.. 2,876 జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు; 434 టీజీటీ స్కూల్ లైబ్రేరియన్, 275 స్కూల్ ఫిజికల్ డైరెక్టర్; 226 ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్, 124 మ్యూజిక్ టీచర్ పోస్టులు.. ఇలా మొత్తం 9,231 పోస్టుల భర్తీ ప్రక్రియను తెలంగాణ రెసిడిన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ రిక్రూట్‌మెంట్ బోర్డు(ట్రిబ్) నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో టీజీటీ, స్కూల్ పీడీ, లైబ్రేరియన్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పోస్టులు జోనల్ పోస్టులు కాగా, గురుకుల డీఎల్, జేఎల్, పీజీటీ పోస్టులు మల్టీ జోనల్ పోస్టులుగా నిర్ణయించింది. అందుకనుగుణంగానే ట్రిబ్ జోనల్ పోస్టులకు అభ్యర్థుల నుంచి జోన్లవారీగా, సొసైటీలవారీగా ఆప్షన్లను ట్రిబ్ స్వీకరించింది. కానీ, ప్రస్తుతం జోనల్ పోస్టుల భర్తీని అందుకు విరుద్ధంగా చేపట్టిందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై ట్రిబ్‌ను సంప్రదించినా కనీస స్పందన కరువైందని వాపోతున్నారు.
చేతులు కాలాక.. మేల్కొన్న ట్రిబ్
పీడీ స్కూల్ అభ్యర్థుల ఆరోపణల నేపథ్యంలో ట్రిబ్ అధికారులు స్పందించారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే నియామకాలు జరిగాయని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయవచ్చని, వాటిని పరిశీలిస్తామని వెల్లడించారు. అయితే తాము అడిగితే మాత్రం ఏ సమాధానమివ్వడం ఇవ్వలేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.