టీమ్‌ఇండియాకు ఆడటం, నాయకత్వం వహించడం తనకు లభించిన అత్యుత్తమ గౌరవమని ఓపెనర్ కేఎల్ రాహుల్ అంటున్నాడు. తన నాయకత్వ నైపుణ్యాలపై ఆత్మవిశ్వాసంతో ఉన్నానని వెల్లడించాడు. చివరి మూడు వన్డే సిరీసులను టీమ్‌ఇండియా ఓడిపోయిందని, జట్టులో మార్పులు చేయడం అనివార్యమని స్పష్టం చేశాడు. తనపై వస్తున్న విమర్శలకు అతడు దీటుగా స్పందించాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీసులో టీమ్‌ఇండియా ఘోరంగా విఫలమైంది. ఆడిన మూడు మ్యాచుల్లోనూ పరాజయం పాలై అవమానం మూటగట్టుకొంది. 0-3తో సిరీస్ క్లీన్‌స్వీప్ అవ్వడంతో జట్టుపై విమర్శలు పెరిగాయి. కేఎల్ రాహుల్ నాయకత్వం బాగా లేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
రాహుల్ దూకుడుగా కాకుండా రక్షణాత్మకంగా కనిపించాడని కొందరు అంటున్నారు. బౌలర్లను ఉపయోగించుకున్న తీరు బాగాలేదని పేర్కొన్నారు. సునిల్ గావస్కర్ ఓ అడుగు ముందుకేసి.. అతడికి దేశవాళీ క్రికెట్లో కెప్టెన్‌గా అనుభవమే లేదని విమర్శించాడు. పంజాబ్ కింగ్స్‌కు సారథ్యం వహించినా సాధించిందేమీ లేదని పేర్కొన్నాడు. కేఎల్ రాహుల్‌ను మున్ముందు నాయకుడిగా చూడటం కష్టమేనని బీసీసీఐలో ఓ అధికారి అనడమూ బయటకు వచ్చింది.
Also Read: Gambhir Corona Positive: గౌతమ్ గంభీర్‌కు కరోనా పాజిటివ్.. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని ట్వీట్
Also Read: IPL Lucknow Team: ఆ జట్టు పాత పేరునే కొత్త జట్టుకు.. లక్నో టీం పేరు ఫిక్స్!
Also Read: Virat Kohli: కోహ్లీపై మండిపడుతున్న నెటిజన్లు... ఇదేం పని అంటూ ఆగ్రహం...!
'ఇదో గొప్ప గౌరవం. దేశం తరఫున ఆడటం, నాయకత్వం వహిచడం కలలు నిజమైన సందర్భాల వంటివి. ఫలితాలు మాకు అనుకూలంగా రాలేదన్నది నిజమే. కానీ అక్కడ నేర్చుకొనేందుకు ఎంతో ఉంది. మేమిప్పుడు జట్టుగా మెరుగవ్వాల్సిన పరిస్థితి ఉంది. అదే సమయంలో ప్రపంచకప్‌లపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గత నాలుగైదేళ్లుగా మేం అద్భుతమైన క్రికెట్ ఆడామనే అనుకుంటున్నా. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో జట్టు మరింత పరివర్తన చెందాల్సి ఉంది' అని కేఎల్ రాహుల్ అన్నాడు.
'నా సారథ్య నైపుణ్యాలపై విశ్వాసం ఉంది. జట్టుగా మేం పురోగతి చెందుతున్నాం. నాయకత్వం వహిస్తూనే నేనెంతో నేర్చుకుంటున్నా. ఆరంభంలో విజయాల కన్నా ఓటముల వల్లే మరింత దృఢంగా మారతాం. నా కెరీర్ ఎప్పుడూ అలాగే ఉంటోంది. నా విషయంలో ప్రతిదీ నెమ్మదిగానే ఉంటుంది. మా ఆటగాళ్ల అత్యుత్తమ ఆటతీరును నేను కచ్చితంగా బయటకు తీసుకొస్తా. నా దేశం, నా ఫ్రాంచైజీ తరఫున రాణిస్తాననే నమ్మకం నాకుంది' అని రాహుల్ స్పష్టం చేశాడు.