టీమ్‌ఇండియా క్రికెటర్లకు బీసీసీఐ ఈ సారి ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయడం లేదని తెలిసింది. ఎంత ప్రయాణించినా విమాన కంపెనీల నుంచి స్పందన రాకపోవడమమే ఇందుకు కారణం. దాంతో ఆటగాళ్లను సాధారణ విమానాల్లోనే అహ్మదాబాద్‌ రావాలని బోర్డు సూచించిందని సమాచారం. కొవిడ్‌ నేపథ్యంలో అహ్మదాబాద్‌ నుంచి కోల్‌కతాకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది.


ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న వెస్టిండీస్‌ ఫిబ్రవరి 2న అహ్మదాబాద్‌ చేరుకుంటుంది. 6, 9, 11న మొతెరా వేదికగా మూడు వన్డేలు జరుగుతాయి. 16, 18, 20న కోల్‌కతా వేదికగా టీ20లు నిర్వహిస్తారు. ఇందుకోసం టీమ్‌ఇండియా ఆటగాళ్లు ఫిబ్రవరి 1న అహ్మదాబాద్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. మూడు రోజుల క్వారంటైన్‌ తర్వాత సన్నాహక శిబిరం ఉంటుంది. ఆ తర్వాత మ్యాచులు మొదలవుతాయి.


గతంలో భారత మహిళలు, పురుషుల జట్లు ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లాయి. అప్పుడు క్రికెటర్లందరికీ బీసీసీఐ ముంబయిలో క్వారంటైన్‌ ఏర్పాటు చేసింది. అప్పుడు దిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా నుంచి ప్రత్యేక విమానాల్లో క్రికెటర్లను ముంబయికి చేర్చారు. అక్కడ పది రోజుల క్వారంటైన్‌, కరోనా టెస్టుల తర్వాత ఇంగ్లాండ్‌కు పంపించారు. ఈ సారి మాత్రం అలా చేయడం లేదు.


'ఇంగ్లాండ్‌ పర్యటన తరహాలోనే ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయాలనుకున్నాం. కానీ సారి కుదరడం లేదు. మేం ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాం. అప్పుడు ఇతర ట్రావెలర్లను సంప్రదించాల్సిన అవసరం వచ్చేది కాదు. ఏదేమైనా ఇప్పటికే ఆలస్యమైంది. క్రికెటర్లు, రాహుల్‌ ద్రవిడ్‌ సహా సహాయ సిబ్బంది ఫిబ్రవరి 1న అహ్మదాబాద్‌ చేరుకుంటారు. మూడు రోజులు క్వారంటైన్‌లో ఉంటారు. కొవిడ్‌ పరీక్షలు జరుగుతాయి. ఆ తర్వాత వన్డే సిరీసుకు చిన్న శిబిరం ఉంటుంది' అని బీసీసీఐ అధికారులు తెలిపారు.


Also Read: IPL 2022: ఎంఎస్‌ ధోనీ CSK పగ్గాలు వదిలేస్తున్నాడా? మరి 'సింహం' చెన్నైలో ఎందుకు దిగినట్టు?


Also Read: Ravi Shastri News: రవిశాస్త్రి 2.0? ఆ మాటల వెనక అర్థమేంటి?


టీమ్‌ఇండియా వన్డే జట్టు: రోహిత్ శర్మ, కేఎల్‌ రాహుల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, శిఖర్ ధావన్‌, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, దీపక్‌ హుడా, రిషభ్ పంత్‌, దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, యుజ్వేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్, రవి బిష్ణోయ్‌, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ


టీమ్‌ఇండియా టీ20 జట్టు: రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్ పంత్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, రవి బిష్ణోయ్‌, అక్షర్‌ పటేల్‌, యుజ్వేంద్ర చాహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, మహ్మద్‌ సిరాజ్, భువనేశ్వర్‌ కుమార్‌, అవేశ్‌ ఖాన్‌, హర్షల్‌ పటేల్‌