టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి మద్దతుగా రవిశాస్త్రి మాట్లాడిన విధానం తనకు నచ్చలేదని మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ అంటున్నాడు. 'రవిశాస్త్రి 2.0' ఏంటో, అతడి ఎంజెండా ఏంటో అర్థం కాలేదని పేర్కొన్నాడు. బహుశా అతడు భారత క్రికెట్‌ను అర్థం చేసుకోనట్టు కనిపిస్తోందని వెల్లడించాడు.


గతేడాది సెప్టెంబర్లో విరాట్‌ కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దక్షిణాఫ్రికా సిరీసుకు ముందు బీసీసీఐ అతడిని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించింది. సఫారీ టెస్టు సిరీసు ముగిసిన వెంటనే సుదీర్ఘ ఫార్మాట్‌ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్న కోహ్లీ ప్రకటించాడు. మొత్తంగా అతడి నాయకత్వ నిష్క్రమణ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారింది. అటు బోర్డుకు తలనొప్పులు తీసుకొచ్చింది. టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోగానే విరాట్‌కు రవిశాస్త్రి మద్దతుగా మాట్లాడాడు.


విరాట్‌ కోహ్లీ గనక కెప్టెన్‌గా కొనసాగి ఉంటే టీమ్‌ఇండియా సులువుగా మరో 50-60 టెస్టులు గెలిచేదని శాస్త్రి అంచనా వేశాడు. కానీ చాలామంది ఈ ఘనతను జీర్ణించుకోలేరని వ్యాఖ్యానించాడు. ఈ మాటలనే మంజ్రేకర్‌ తప్పుపట్టాడు.


'అతడేం మాట్లాడాడో అర్థంకాలేదు. రవిశాస్త్రి అంటే నాకెంతో గౌరవం. నేనతడి సారథ్యంలో ఆడాను. అతడు ఆటగాళ్లకు ఎంతో మద్దతు ఇస్తాడు. గొప్ప పోరాట యోధుడు. సీనియర్‌. ఈ రవిశాస్త్రి 2.0 ఏంటో అర్థకాలేదు. అతడు బహిరంగంగా ఏ మాట్లాడతాడో ఊహించిందే. దానిపై నేను స్పందించను' అని మంజ్రేకర్‌ అన్నాడు. 'నేను అగౌరపరచాలని అనుకోవడం లేదు. అతడు తెలివైన ప్రకటనలు చేయడు. వాటి వెనక అజెండాను మీరు చూడొచ్చు. ఇది సరైన క్రికెటింగ్‌ పరిశీలన కాదు' అని సంజయ్‌ పేర్కొన్నాడు.


Also Read: Dinesh Karthik on Ravindra Jadeja: జడ్డూ చిన్న పిల్లాడేం కాదు! మిడిలార్డర్‌ కష్టాలు తీర్చేస్తాడు!!


Also Read: Harbhajan Favourite Batter: కోహ్లీపై పూర్తి గౌరవంతో చెబుతున్నా! నా ఫేవరెట్‌ క్రికెటర్‌ ఎవరంటే?


విరాట్‌ కోహ్లీ మూడు నెలలు విరామం తీసుకుంటే మంచిదని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి సూచించిన సంగతి తెలిసిందే. దీనివల్ల అతడు ఆటను మరింత ఎక్కువ ఏకాగ్రతతో ఆడగలడని పేర్కొన్నాడు. విరామం తర్వాత అతడు రారాజులా క్రికెట్‌ ఆడతాడని అంచనా వేశాడు. షోయబ్‌ అక్తర్‌ యూట్యూబ్‌ ఛానళ్లో అతడు మాట్లాడాడు.


'తనకు 33 ఏళ్లు నిండాయని విరాట్‌ కోహ్లీ గుర్తించాడు. మరో ఐదేళ్లు క్రికెట్‌ ఆడగలనని అతడికి తెలుసు. అతడు ప్రశాంతంగా ఉండి, బ్యాటింగ్‌పై దృష్టి పెడితే, ఒకసారి ఒక మ్యాచ్‌నే లక్ష్యంగా ఎంచుకుంటే, ఆట నుంచి విరామం తీసుకుంటే బాగుంటుంది. అతడో రెండు మూడు నెలలు ఇంటివద్దే ఉంటే లేదా ఒక సిరీసు నుంచి విరామం తీసుకుంటే అతడికి మంచి చేస్తుందని అనుకుంటున్నా' అని రవిశాస్త్రి అన్నాడు.