యాపిల్ తన ఐవోఎస్ 15.4 మొదటి డెవలపర్ బీటాను విడుదల చేసింది. దీంతోపాటు ఐప్యాడ్ ఓఎస్ 15.4, మాక్ఓఎస్ మాంటేరే 12.3 కూడా విడుదల అయ్యాయి. ఐవోఎస్ 15.4లో యాపిల్ అతి పెద్ద ఫీచర్‌ను అందించింది. దీంతో ఐఫోన్ ఉపయోగించేవారికి ప్రస్తుతం ఉన్న సమస్యల్లో ఒకటి తీరిపోనుంది.


ఐవోఎస్ 15.4కు అప్‌గ్రేడ్ చేసుకుంటే వినియోగదారులు మాస్క్ తీయకుండానే వారి ఐఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు. దీనికి తగ్గట్లు యాపిల్ తన ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేసింది. 2020లో కరోనావైరస్ ప్రారంభం అయిన దగ్గర నుంచి మనకు మాస్క్ కచ్చితం అయిపోయింది. కానీ ఐఫోన్ వినియోగదారులు వారి మొబైల్‌ను అన్‌లాక్ చేయాలంటే బయట ఉన్నప్పటికీ మాస్క్ తీయడం కంపల్సరీ. కానీ యాపిల్ ఇప్పుడు దాన్ని మార్చింది.


2020లోనే మాస్క్ పెట్టుకున్నప్పుడు ఫోన్‌ను పాస్ కోడ్ ద్వారా అన్‌లాక్ చేసే ఫీచర్‌ను యాపిల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ తర్వాత యాపిల్ వాచ్ కూడా ఉన్నవారు తమ వాచ్ ద్వారా స్మార్ట్ ఫోన్ అన్‌లాక్ చేసే ఫీచర్ అందించారు. అయితే ఇప్పుడు వచ్చిన ఫీచర్ అయితే ఇవేవీ అవసరం లేకుండా ఫోన్ అన్‌లాక్ చేసుకునే వెసులుబాటును కల్పించనుంది.


కళ్ల భాగంలో స్కాన్ చేయడం ద్వారా ఫోన్ అన్‌లాక్ చేసే ఫీచర్‌ను డెవలప్ చేసినట్లు యాపిల్ తెలిపింది. అంటే మీరు ఐవోఎస్ 15.4కు అప్‌గ్రేడ్ చేసుకుంటే మాస్క్ పెట్టుకున్నప్పటికీ పాస్ కోడ్, యాపిల్ వాచ్ అవసరం లేకుండానే ఐఫోన్ అన్‌లాక్ చేయవచ్చన్న మాట.