తడు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ప్రాధాన్యం ఉన్న పాత్రలోకి తీసుకోవాలంటే భయపడేవారు. నటీ నటుల వారసులకే పెద్ద పీఠం వేసే బాలీవుడ్‌లో నెట్టుకు రావడం అంటే అంత సులభం కాదు. నెపొటిజాన్ని తట్టుకోలేక చాలామంది నటీనటులు కనుమరుగయ్యారు. కానీ, నవాజుద్దీన్ సిద్ధిక్ మాత్రం.. ప్రతికూల పరిస్థితులకు ఎదురీదుతూ.. కేవలం తన ప్రతిభతోనే గుర్తింపు పొందాడు. ఇప్పుడు బాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా ప్రజాభిమానం పొందాడు. పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసే నావాజుద్దీన్.. ఈ స్థాయికి చేరడానికి దాదాపు 23 ఏళ్లు పట్టింది. 


2015లో ‘భజరంగీ భాయ్‌జాన్’ సినిమాలో జర్నలిస్టుగా కనిపించిన నవాజుద్దీన్ ఆ తర్వాత మళ్లీ వెనుతిరిగి చూడలేదు. ‘మాంజీ’ వంటి ప్రయోగాత్మక చిత్రాలతోపాటు బాల్ థాకరే వంటి మహా నాయకుడి బయోపిక్ (థాకరే) చిత్రాల వరకు ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయి నటించాడు. ప్రస్తుతం నవాజుద్దీన్ నటించిన ‘రాత్ అకేలీ హై’, ‘సీరియస్ మ్యాన్’ చిత్రాలు ఓటీటీల్లో స్ట్రీమ్ అవుతున్నాయి. ఇవి కాకుండా మరో ఆరు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇటీవల నవాజుద్దీన్.. ముంబయిలో నిర్మించిన తన కొత్త ఇంటికి ‘నవాబ్’ అని పేరు పెట్టాడు. తన తండ్రి న‌వాబుద్దిన్ సిద్ధిఖికి గుర్తుగా ఈ పేరును పెట్టినట్లు తెలిసింది. శ్వేత వర్ణంలో తాజ్ మహాల్‌ను తలపించే ఈ భవంతిని చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు.


ఉత్తరప్రదేశ్‌లోని బుధానా గ్రామంలో త‌న బాల్యాన్ని గ‌డిపిన ఇంటిని గుర్తుకు తెచ్చేలా ఈ కొత్త బంగ్లాను నిర్మించాడు. నవాజుద్దీన్ తాజాగా ఆ భవంతి ముందు లాన్‌లో కూర్చొని ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది చూసి ఆయన అభిమానులు తెగ మురిసిపోతున్నారు. 1999లో జూనియర్ ఆర్టిస్ట్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నవాజుద్దీన్.. 23 ఏళ్ల శ్రమకు ఫలితం ఈ భవంతి అని అంతా అంటున్నారు.