IND vs SL Pink Ball Test: టీమ్‌ఇండియా యువ క్రికెటర్ శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) తగ్గేదే లే! అంటున్నాడు. భారత జట్టులోంచి తనను ఇంకెవరూ కదలించకుండా తిరుగులేని ఫెర్ఫార్మెన్స్‌ చేస్తున్నాడు. షార్ప్‌ స్పిన్‌తో బ్యాటర్లను వణికిస్తున్న బెంగళూరు పిచ్‌పై అమేజింగ్ హాఫ్‌ సెంచరీ చేశాడు. నిజానికి ఇలాంటి పిచ్‌పై అర్ధశతకం చేయడమంటే సెంచరీ చేసినట్టేనని విశ్లేషకులు అంటున్నారు. విరాట్‌ కోహ్లీ ఔటవ్వడంతో క్రీజులోకి వచ్చిన అతడు 54 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. నాలుగు బౌండరీలు, రెండు సిక్సర్లు కొట్టాడు. సిక్సర్‌తో అతడు హాఫ్‌ సెంచరీ చేసుకోవడం ప్రత్యేకం. దీంతో టీమ్‌ఇండియా స్కోరు 200 దాటేసింది.


పిచ్‌పై అప్‌ అండ్‌ డౌన్‌ బౌన్స్‌ ఉంది. ఎప్పుడెలా బాల్‌ వస్తుందో తెలియడం లేదు. కొన్నిసార్లు మీదకు వస్తే కొన్ని సార్లు పైకే రావడం లేదు. ఇక కొన్నిసార్లు ఊహించని విధంగా వేగంగా టర్న్‌ అవుతూ ఇబ్బంది పెడుతోంది. అందుకే సీనియర్‌ క్రికెటర్లు ఒక్కొక్కరుగా పెవిలియన్‌ చేరారు. కానీ ఇలాంటి కఠిన పిచ్‌పై శ్రేయస్‌ (Shreyas Iyer) బ్యాటింగ్‌ చేస్తున్న తీరు మాత్రం అద్భుతం. టర్న్‌ను చక్కగా ఎదుర్కొంటూనే లూజ్‌ బాల్స్‌ పడితే బౌండరీకి పంపిస్తున్నాడు. అవతలి ఎండ్‌లోని బ్యాటర్లు కంగారు పడుతోంటే అతడు మాత్రం నిలకడగా ఆడుతున్నాడు. బంతిని బట్టి బ్యాక్‌ఫుట్‌కు వెళ్తున్నాడు. ఒక్కోసారి ముందుకొస్తూ బౌలర్‌ను తికమక పెట్టి బౌండరీలు కొడుతున్నాడు. అందుకే అతడు విలువైన అర్ధశతకం చేశాడు. 53 ఓవర్లకు టీమ్‌ఇండియా 223/8తో ఉంది. శ్రేయస్‌ అయ్యర్‌ (68), మహ్మద్‌ షమి (0) బ్యాటింగ్‌ చేస్తున్నారు.