AP Early Elections: ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రస్తకే లేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) అన్నారు. టీడీపీ తమ నాయకులను నిలబెట్టుకునేందుకు తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. టీడీపీ(TDP) నుంచి ఇతర పార్టీలకు జంప్ అవుతున్నారని, వాళ్లని అడ్డుకునేందుకు చంద్రబాబు(Chandrababu) వేసిన ఎత్తు ముందస్తు ఎన్నికల ప్రచారం అన్నారు. ముందస్తుపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సజ్జల అన్నారు. ప్రజలు ఐదేళ్లకు అధికారం ఇస్తే దానిని రెండేళ్లకు, మూడేళ్లకు ఎందుకు కుదించుకోవాలని సీఎం జగన్ అంటారని సజ్జల పేర్కొన్నారు. వైసీపీ(Ysrcp) కార్యకర్తల డీఎన్ఏ(DNA) వేరన్నారు. వైసీపీ డిమాండ్ ఉన్న పార్టీ అని సజ్జల అన్నారు. వైసీపీలోకి వచ్చేందుకు చాలా మంది ఎదురుచూస్తున్నారన్నారు. అంతే కానీ వైసీపీ నుంచి ఎవరూ ఇతర పార్టీలకు వెళ్లడంలేదన్నారు. బీజేపీ, జనసేన తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయన్నారు. 


వైసీపీ ఆవిర్భావ వేడుకలు 


ప్రజలు తమకు ఐదేళ్లు అధికారం ఇచ్చారని, దానిని తగ్గించుకోవాల్సిన అవసరం వైసీపీ ప్రభుత్వానికి లేదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ వేడుకల్లో శనివారం ఆయన పాల్గొన్నారు. ముందస్తు  ఎన్నికల ఊహాగానాలపై విలేకరుల ప్రశ్నలకు ఆయన స్పందించారు. ప్రజలను మోసం చేసేవారు, భ్రమలో ఉంచేవారే ముందస్తుకు వెళ్తారన్నారు. చంద్రబాబు టీడీపీ ఉనికిని కాపాడుకునేందుకు ముందస్తు ఎన్నికల ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలు తనకిచ్చిన ఐదేళ్ల అధికారాన్ని వినియోగించుకుని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారన్నారు. మరింత మెరుగ్గా పాలన చేసి ప్రజల ఆశీస్సులు కోరడానికి మళ్లీ ఎన్నికలకు వెళ్తారని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ, సభ్యత్వ నమోదు చేపడతామని చెప్పారు. పార్టీ సంస్థాగత నిర్మాణ పరంగా కిందస్థాయి వరకు పదవులు నియామకం చేపడతామని సజ్జల అన్నారు. 


వైసీపీ డిమాండ్ ఉన్న పార్టీ 


"వైఎస్ఆర్పీసీపీ కార్యకర్తల డీఎన్‌ఏ వేరు. వైఎస్‌ఆర్ కుటుంబంతో వారి బంధం విడదీయలేనిది. వైసీపీ వాళ్లు వేరే పార్టీలోకి వెళ్తున్నారనడం వారి భ్రమ. మా పార్టీకే డిమాండ్‌ ఎక్కువ. ఇతర పార్టీలోకి ఎందుకు వెళ్తారు. పదవులు ఆశించిన వారైతే ఇక్కడ ఉంటారు. అధికారంలోని లేని పార్టీలోకి ఎవరు వెళ్తారు?" అంటూ సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రశ్నించారు. మరో రెండేళ్లలో ఎన్నికలు వస్తున్నాయన్న ఆయన అందుకు పార్టీని కింద స్థాయి నుంచి మళ్లీ బలోపేతం చేస్తామన్నారు. ప్రభుత్వ పాలనతో పార్టీని బలోపేతం చేయడం తమకు కీలకమేనని సజ్జల అన్నారు. మంత్రి వర్గ విస్తరణపై స్పందించిన సజ్జల, సీఎం జగన్ అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే కేబినెట్ విస్తరణ గురించి చెప్పారన్నారు. త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని స్పష్టం చేశారు.